రాజకీయ అరంగేట్రంపై ఇంకా ఆలోచించలేదు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

శ్రీకాకుళంలో 3 రోజుల పర్యటన ప్రారంభించిన లక్ష్మీనారాయణ
షూరిటీ పెట్టినా రైతులకు రూ.5 లక్షలివ్వని బ్యాంకులు!
ఈ విధానంలో మార్పు రావాలి
‘హోదా’ విషయంలో కేంద్రం అన్యాయం చేస్తే నేనూ ప్రత్యక్ష పోరాటానికి దిగుతా
ప్రస్తుతం ప్రజా సమస్యలపైనే దృష్టి పెడుతున్నానని, తన రాజకీయ అరంగేట్రంపై ఇంకా ఆలోచించలేదని ఐపీఎస్ మాజీ అధికారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు తన పర్యటన ప్రారంభించారు. స్థానిక వాసవీ తిరుమల కల్యాణ మండపంలో రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, పరిశ్రమలు పెడతామంటే రూ.50 లక్షలు రుణంగా ఇచ్చే బ్యాంకులు, ఐదెకరాలు షూరిటీగా పెట్టినా రైతులకు రూ.5 లక్షలు ఇవ్వడం లేదని .. ఈ విధానంలో మార్పు రావాలని అన్నారు. పూర్తిగా రైతు సమస్యలు అధ్యయనం చేసిన తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు.

మహాత్మా గాంధీ నడయాడిన ప్రాంతంలో తాను నిద్రచేయనుండటం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లక్ష్మీనారాయణ ప్రస్తావించారు. ‘హోదా’ విషయమై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశిస్తున్నానని, ఒకవేళ కేంద్రం అన్యాయం చేస్తే తాను కూడా ప్రత్యక్ష పోరాటానికి దిగుతానని అన్నారు.

’నేను 28 సంవత్సరాల సర్వీసు చేశాను. అందులో ఏడు సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ లో, ఇరవై ఒక్క సంవత్సరాలు మహారాష్ట్రలో పని చేశా. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలనేది నా కోరిక. అందుకని, శ్రీకాకుళం నుంచి ఈరోజు శ్రీకారం చుట్టాను.13 జిల్లాలలోనూ పర్యటిస్తా. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? ప్రజల సమస్యలు.. వాటి పరిష్కారాల గురించి వారితో చర్చించాలనేది మొదటి అంశంగా ఎంచుకున్నాను. ఇది పూర్తయిన తర్వాత నాకు కూడా ఎక్కువ అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో ఆ మార్గాన్ని నేను ఎంచుకుంటా’ అని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.

Related posts

Leave a Comment