రాజకీయం కోసం మమ్ముల్ని వాడుకున్నారు

-మా పునరావాసం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి
-కశ్మీరీ పండిట్ల ఆవేదన

తుల్ముల్ల/ జమ్ము, జూన్ 20: కశ్మీర్ లోయలో తమకు పునరావాసం కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఖీర్‌భవానీ ఫెయిర్‌లో పాల్గొన్న పలువురు కశ్మీరీ పండిట్లు వ్యాఖ్యానించారు. వివిధ పార్టీల నేతలు తమను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గందేర్బల్ జిల్లాలోని ప్రసిద్ధ రగ్నాదేవి ఆలయం వద్ద హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా ఖీర్ భవానీ మేళా జరిగింది. ఈ మేళాకు కశ్మీరీ పండిట్లతోపాటు వివిధ రాష్ర్టాల భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సతీశ్ మహల్దార్ అనే కశ్మీరీ పండిట్ మాట్లాడుతూ లోయకు తిరిగొచ్చిన కశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పిస్తామని 28 ఏండ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇస్తూనే ఉన్నాయి. కానీ చేసిందేమీ లేదు. వారు విఫలం అయ్యారు. కశ్మీరీ పండిట్లను రాజకీయ నినాదంగా వాడుకున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ కొందరు తమ లబ్ధి కోసం ఇప్పటివరకు కశ్మీరీ పండిట్లను ఒక దిశవైపు లాగితే, మరొకరు మరో వైపు లాగారు అని తెలిపారు.
అమర్‌నాథ్ యాత్రకు భద్రత పెంపు
ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్రకు భద్రత ఏర్పాట్లన్లు పెంపొందించాలని అనునిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జమ్ము ఐజీ ఎస్డీ సింగ్ జామ్వాల్ మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. చెక్‌పాయింట్లు, నియంత్రణ రేఖ (ఎల్వోసీ), అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వద్ద జవాన్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ చొరబాట్లకు ప్రయత్నిస్తున్న మిలిటెంట్లను నిలువరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీనియర్ పోలీస్, సైనిక, పారా మిలిటరీ, కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
TAGS:Jyeshtha Ashtami ,Kashmiri ,SD Singh Jamwal ,IB

Related posts

Leave a Comment