రజనీకాంత్ పార్టీ… తమిళనాడులో ఇప్పుడేం జరగబోతోంది

Rajnikanth political entry impact on Tamil Nadu politics

తమిళనాట రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేయగానే విమర్శలు, ప్రశంసలు, అభినందనలు, చేరుతామన్న ప్రతిపాదనలూ అన్నీ మొదలయ్యాయి. వచ్చే ఎన్నికలలో తన పార్టీ పోటీలో ఉంటుందని ఆయన ఇలా ప్రకటించారో లేదో అలా ఆయనకు మద్దతు పలికేవారు మొదలయ్యారు. తిరువళ్లూరు బీజేపీ కార్యవర్గ సభ్యుడు సెల్వరాజ్ తాను రజనీ పెట్టబోయే రాజకీయ పార్టీలో చేరతానని ప్రకటించాడు. ఇది అంతంతమాత్రంగా ఉన్న అక్కడి బీజేపీలో కలకలం రేపింది. ఇతర పార్టీలకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా రజనీకి జై అంటున్నారు.

మరోవైపు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి రజనీ తాజా ప్రకటనపై తనదైన శైలిలో విసుర్లు విసిరారు. నిరక్షరాస్యుడైన రజనీకాంత్ ను మీడియా పెద్దగా చేసి చూపుతోందని పేర్కొన్నారు. రాజకీయాలలోకి వస్తున్నట్లు ప్రకటించిన రజనీ కాంత్ అందుకు సంబంధించిన వివరాలు, డాక్యుమెంట్లను వివరించలేదని అన్నారు. కాగా మరో నటుడు కమలహాసన్ రజనీకి అభినందనలు తెలిపారు. “రాజకీయాల్లోకి వస్తున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు. సమాజం పట్ల మీకు ఉన్న నిబద్ధత అభినందనీయం. సుస్వాగతం” అంటూ కమల్ ట్వీట్ చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇప్పటికే కమల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీని ప్రారంభిస్తానని… 2018లో పార్టీ వివరాలు ప్రకటిస్తానని ఆయన గతంలో తెలిపారు. సినీ రంగానికి చెందిన పలువురు ఇతరులు కూడా రజనీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. రజనీలాంటి వ్యక్తి తమిళ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలని వారు అభిలషిస్తున్నారు.

కాగా రజనీ రాజకీయ ప్రకటన నేపథ్యంలో ఆయన పార్టీలో చేరే అవకాశమున్న నేతలెవరా అని తమిళనాట ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఒక కన్నేస్తున్నాయి. తమతమ పార్టీల్లో అసంతృప్త నేతలు, రజనీ అంటే బాగా అభిమానమున్నవారిని పిలిపించి మాట్లాడే పనిలో పడుతున్నట్లుగా తెలుస్తోంది. అదేసమయంలో రజనీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందన్న కోణంలోనూ ఆలోచనలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.

Tags: Rajnikanth political entry impact on Tamil Nadu politics

Related posts

Leave a Comment