మోదీ రాకతో మారిన సీన్..

కాంగ్రెస్ నుంచి బీజేపీకి మారుతున్న కన్నడ ఓటర్లు!
నిన్నటి వరకు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన కన్నడిగులు
మోదీ రాకతో బీజేపీకి పెరుగుతున్న అనుకూలత
క్షేత్రస్థాయిలో చక్కబెడుతున్న అమిత్ షా
మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ కన్నడనాట రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సర్వేల సంగతి ఎలా ఉన్నా నిన్నమొన్నటి వరకు కర్ణాటక కాంగ్రెస్‌దేనని నిపుణులు ఢంకా బజాయించి చెప్పారు. అయితే, ఇప్పుడు అదే మాటను చెప్పేందుకు తటపటాయిస్తున్నారు. కారణం.. మోదీ పర్యటన. ప్రధాని మోదీ కర్ణాటకలో పర్యటించక ముందు, పర్యటించిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారినట్టు చెబుతున్నారు. మోదీ సుడిగాలి పర్యటనలతో బీజేపీ దశ తిరిగిందని, విజయం దిశగా పయనిస్తోందని చెబుతున్నారు. ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

ఇటీవల పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో కర్ణాటకలో హంగ్ తప్పదని తేలింది. దాదాపు సర్వేలన్నీ కాస్త అటూ, ఇటుగా ఇదే విషయాన్ని చెప్పాయి. కాంగ్రెస్‌కు 41 శాతం మంది, బీజేపీకి 33 శాతం మంది, జేడీఎస్‌కు 23 శాతం మంది మద్దతు పలికారు. ఈ లెక్కన కాంగ్రెస్‌కు ఎక్కువలో ఎక్కువగా 100 సీట్లు, బీజేపీకి 85, జేడీఎస్‌కు 41 స్థానాలు రావచ్చని అంచనా వేశాయి.

వారం రోజుల క్రితం మోదీ తన రెండో విడత ప్రచారాన్ని ప్రారంభించనంత వరకు ఇవే ఫలితాలపై అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే, మోదీ రంగంలోకి దిగాక ఒక్కసారిగా సీన్ చేంజ్ అయినట్టు చెబుతున్నారు. మోదీ ఇప్పటి వరకు 13 ప్రచార సభల్లో పాల్గొన్నారు. 8 ర్యాలీల్లో పాల్గొనాల్సి ఉంది. ప్రతీ సభలోనూ కాంగ్రెస్‌ను దునుమాడుతున్నారు. సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై విరుచుకుపడుతున్నారు. ఆయన ప్రసంగాలకు ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. మరోవైపు అమిత్ షా క్షేత్రస్థాయిలో పనులు చక్కబెడుతుండడంతో కన్నడ గాలి ఒక్కసారిగా బీజేపీ వైపు మళ్లినట్టు చెబుతున్నారు.

మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, యూపీఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ కర్ణాటక విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నా బీజేపీ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నారన్నది విశ్లేషకుల మాట. బీజేపీ విమర్శలకు వీరు దీటుగా బదులివ్వలేకపోతున్నారని చెబుతున్నారు.

Related posts

Leave a Comment