మోదీ జీ! మీ ఆధార్‌ సంఖ్య చెప్పండి

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆధార్‌ సంఖ్య ఉంటే దానిని ఆన్‌లైన్‌లో వెల్లడించాలని స్వయం ప్రకటిత ఫ్రెంచి భద్రత నిపుణుడు, ఎథికల్‌ హ్యాకర్‌ ఇలియట్‌ ఆండర్సన్‌ సవాల్‌ విసిరారు. భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) ఛైర్మన్‌ ఆర్‌.ఎస్‌.శర్మ ట్విటర్లో వెల్లడించిన ఆధార్‌ సంఖ్య ఆధారంగా ఆయనకు సంబంధించిన వ్యక్తిగత వివరాలన్నింటినీ ఆండర్సన్‌ బయటపెట్టారు. చరవాణి సంఖ్య, పాన్‌, ప్రత్యామ్నాయ ఫోన్‌, ఇ-మెయిల్‌ చిరునామా, కుటుంబంతో దిగిన చిత్రం వంటి సమాచారాన్ని శనివారం ఆయన బయటపెట్టారు. మరికొందరు ఎథికల్‌ హ్యాకర్లూ ఆయనకు తోడుగా శర్మ గురించి ఇంకొంత సమాచారం వెల్లడించారు. ఆయన ఐ-ఫోన్‌ వాడుతున్నారనీ, బ్యాంకు ఖాతాతో ఆధార్‌ సంఖ్యను అనుసంధానించుకోలేదనీ వారు చెప్పారు. దానికి కొనసాగింపుగా ప్రధానికి కూడా ఆండర్సన్‌ సవాల్‌ విసిరారు. ఆధార్‌ వ్యవస్థ లోపభూయిష్టమైనదంటూ గత కొన్ని నెలలుగా ఆయన విమర్శిస్తున్నారు.
ఖండించిన ఉడాయ్‌: ట్రాయ్‌ ఛైర్మన్‌ వివరాలను ఆధార్‌తో బయటపెట్టినట్లు ఆండర్సన్‌ చెప్పుకోవడాన్ని ‘భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ-ఉడాయ్‌’ ఖండించింది. అది శుద్ధ తప్పు అని స్పష్టం చేసింది. అంతర్జాలంలో శోధించి ఎవరైనా ఇలాంటి వివరాలు తెలుసుకోవచ్చనీ, దానికి ఆధార్‌ సంఖ్యే అవసరం లేదనీ పేర్కొంది.

Related posts

Leave a Comment