మోడీ, షాలకు అగ్ని పరీక్షే

వచ్చే లోక్ సభ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి ఎంత ప్రతిష్టాత్మకమైనవో… ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకూ అంతే ముఖ్యమైనవి. ఈ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడపకపోతే సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వెల్లువత్తే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే కొందరు ఎంపీలు, బీజేపీ నేతలు ఈ ఇద్దరిపై గుర్రుగా ఉన్నారు. పార్టీలో సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీమనోహర్ జోషిలను పక్కన పెట్టారన్న ఆగ్రహం పార్టీ శ్రేణులు లోలోపల రగిలిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు టైం వారిద్దరిదీ నడుస్తుండటంతో మౌనంగానే ఉంటూ వస్తున్నారు.మరోవైపు ఇటీవల జరిగిన మూడు రాష్ట్ర్రాల ఎన్నికల్లో బీజేపీ అంత ఘోరంగా ఓటమి పాలు కాకపోవడం కూడా షా, మోడీలకు కలసి వచ్చిందంటున్నారు.

టగ్ ఆఫ్ వార్ గా జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీఅనుకున్న స్థాయిలో ప్రతిభను కనపర్చిందన్నది పార్టీ నేతల విశ్లేషణ. లోక్ సభ ఎన్నికల నాటికి ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటుందన్న ఆశతో కమలనాధులు ఉన్నారు. ఇటీవల హర్యానా మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడంతో అర్బన్ ప్రాంతాలు కమలం వైపు ఉన్నాయన్న ధీమా ఆ పార్టీలో కన్పిస్తోంది.ఇక వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపోటములను బట్టే పార్టీలో వీరిద్దరి భవిష్యత్తు ఆధారపడి ఉందంటున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకూ వీరిద్దరికీ వెన్నుదన్నుగా ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్ లు కూడా అడ్డం తిరుగుతాయన్న టాక్ బలంగా విన్పిస్తోంది. రాజస్థాన్ లో వసుంధర రాజేను తప్పించాలని ఎన్నికలకు ముందునుంచి ఆర్ఎస్ఎస్ చెబుతున్నా వీరిద్దరూ పట్టించుకోలేదన్న టాక్ ఉంది.

ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్, వీహెచ్ పిలు రామమందిరం నిర్మాణాన్ని వేగవంతం చేయాలని డిమాండ్ చేయడం కూడా వీరికి ఇబ్బందిగా మారిందనే చెప్పాలి.రామమందిరం విష‍యంలో 2019 లోగా నిర్ణయం తీసుకోవాలన్నది ఈ రెండు సంఘాల నిశ్చితాభిప్రాయం. వీలయితే ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి రామమందిరం నిర్మాణపనులను ప్రారంభించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది మోదీ, షాలకు తలనొప్పిగా మారింది. దీంతో వారిని బుజ్జగించేందుకు అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. రాజస్థాన్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో సమావేశమయ్యారు. జనవరిలో సుప్రీంకోర్టులో అయోధ్య అంశం విచారణకు వస్తుందని, రామమందిరం నిర్మాణ పనులను ప్రారంభిస్తామని వారికి వివరించినట్లు సమాచారం. ఇలా ఒకవైపు రామమందిరంపై ఆ రెండు సంస్థల వత్తిడితో పాటులోక్ సభ ఎన్నికల్లో గెలుపు దిశగా అనుసరించాల్సిన వ్యూహాన్ని వారు సిద్ధం చేసుకోవడం సవాల్ గా మారింది. ఈ లోక్ సభ ఎన్నికలు ఈ ఇద్దరికి అగ్ని పరీక్ష అని చెప్పకతప్పదు.
Tags: modi amit shah, central party, local bjp party

Related posts

Leave a Comment