మృత్యువుకి ఆటో ఇటో! ప్రయాణికుల ప్రాణాలు బలిగొంటున్న ఆటోలు

ఆకారంలో చిన్నవైనా ఘోరాలకు హేతువులు
ఏటా 800 మందిని పొట్టన పెట్టుకుంటున్న వైనం
కేసులు పెట్టినా తీరు మారని డ్రైవర్లు
ఆటోరిక్షాలు చూడటానికి చిన్న వాహనాలే కానీ పెద్ద ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఏటా సుమారు 800 మందికి పైగా ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, నిబంధనలను ఉల్లంఘించి ఆటో స్వరూపాన్నే మార్చేస్తుండటం..కనీసం వాహనం నడిపేందుకు తగినంత వెసులుబాటు లేని విధంగా డ్రైవర్‌ పక్కనే ప్రయాణికులను కూర్చోబెట్టుకోవడం, వ్యతిరేక దిశలో వాహనాలు నడపటం వంటివి దీనికి కారణమవుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం సోమయాజుల పల్లె సమీపంలో జరిగిన ఆటో ప్రమాదమూ ఇలాంటి నిర్లక్ష్యాల మూలంగా చోటుచేసుకున్నదే. అందుకే ప్రమాదం చిన్నదైనా… ప్రాణనష్టం భారీగా ఉంటోంది.

ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయంటే!
* ఆటోడ్రైవర్‌ తన సీటుకు పక్కన ప్రయాణికులను కూర్చొబెట్టుకోరాదు. ఇలా చేయడం వల్ల వాహనం హ్యాండిల్‌ సరిగ్గా తిప్పడానికి వీలు కాదు. ఎదురుగా వచ్చే వాహనాలు కానీ, రోడ్డు కానీ సరిగ్గా కనిపించదు. ఇది ప్రమాదాలకు దారితీస్తోంది.
* ఆటోల నిర్మాణం నగరాలు, పట్టణాల పరిధిలో అంతర్గతంగా తిరిగేందుకు వీలుగానే ఉంటుంది. దూరప్రాంత ప్రయాణికులకు, అతివేగంతో నడిపేందుకు అనుకూలంగా వీటి నిర్మాణం ఉండదు. కానీ అత్యధిక శాతం ఆటోలు దూరప్రాంతాలకూ ప్రయాణికులను తీసుకెళ్తున్నాయి.

* జాతీయ రహదారులపై ఆటోలను తిప్పడం నిషిద్ధం. కానీ పరిమితికి మించిన వేగంతోనూ, జాతీయ, రాష్ట్ర ప్రధాన రహదారులపై వ్యతిరేక దిశలోనూ నడిపేస్తున్నారు.
* ఆటోల్లో లౌడ్‌ స్పీకర్లు ఏర్పాటు చేసి పాటలు వింటూ కూడా నడుపుతున్నారు.

54 వేల కేసులు
రాష్ట్రంలోని ఆటోల్లో అత్యధిక శాతం ఉల్లంఘనలకు పాల్పడేవే. అయితే వాటిని తనిఖీ చేసి కేసులు నమోదు చేస్తున్న తీరు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ 23వ తేదీ మధ్య రవాణా శాఖ 53,497 కేసులు నమోదు చేసింది. వాస్తవంగా చూస్తే అంతకు అనేక రెట్లు ఉల్లంఘనలు ఉంటాయి.

Related posts

Leave a Comment