మీడియాపై మండిపడ్డ సైఫ్‌

బాలీవుడ్‌ నటులు సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌ల ముద్దుల కుమారుడు తైమూర్‌కు అప్పుడే ఎంతటి పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తైమూర్‌ ఎక్కడికి వెళితే అక్కడికి మీడియా, ఫొటోగ్రాఫర్లు ఫాలో అవుతుంటారు. అతనికి సంబంధించి ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూ ఉంటుంది. ఇటీవల సైఫ్‌ తన కుటుంబంతో కలిసి విహారయాత్ర నిమిత్తం లండన్‌కు వెళ్లారు. అక్కడ కేవలం తైమూర్‌ ఫొటోల కోసం అభిమానులు ఎగబడుతుంటే సైఫ్‌ వారిపై కేకలు వేశారు. తైమూర్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను చూసి తాను ఈ దేశ బుల్లి సూపర్‌స్టార్‌కు తల్లిని అయినందుకు ఎంతో గర్వంగా ఉందని కరీనా అంటూ ఉంటారు.

అయితే..ఇప్పుడు సైఫ్‌ ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడి మీడియా వర్గాలు తన పని గురించి కాకుండా కరీనా, తైమూర్‌ల గురించే ప్రశ్నలు వేస్తున్నారట. దాంతో ఇక వారి గురించి అడిగే ప్రశ్నలకు సమాధానాలిచ్చే ఓపిక లేదని అంటున్నారు సైఫ్‌. ప్రస్తుతం ఆయన ‘సేక్రెడ్‌ గేమ్స్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా సైఫ్ ఆదివారం‌ మీడియాతో సమావేశమయ్యారు.

సమావేశంలో ఓ విలేకరి..‘మీ భార్య, కుమారుడి గురించి చెప్పండి’ అని అడిగాడట. దాంతో సైఫ్‌కు చిర్రెత్తుకొచ్చింది. ‘నా పని గురించి మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా నాకు ఇబ్బంది లేదు. దాని గురించి ఎంతైనా మాట్లాడతాను. కానీ నా భార్య, కుమారుడి గురించి మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ఓపిక నాకు లేదండీ. నా కుమారుడి గురించి మీరు రాసే వార్తలు చదివి గర్వపడతాను. కానీ పిల్లలను అడ్డంపెట్టుకుని వార్తలు రాబట్టాలని అనుకోవడం తప్పు’ అని వెల్లడించారు సైఫ్.

Related posts

Leave a Comment