మాటలు.. మంటలు రచ్చకు దారితీసిన జోన్‌పై చర్చ

జీవీఎల్‌ జోక్యంతో ఊగిపోయిన తెదేపా నేతలు
విభజన అంశాలు కేంద్ర, ఏపీ ప్రభుత్వాల మధ్య మరోసారి మంటలు రేపాయి. రైల్వేజోన్‌, వెనుకబడిన జిల్లాలకు ఇచ్చి వెనక్కు తీసుకున్న రూ.350 కోట్ల గురించి కేంద్ర రైల్వే, ఆర్థికమంత్రి పీయూష్‌గోయల్‌కు విజ్ఞప్తి చేయడానికి తెదేపా ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు ప్రయత్నించినప్పుడు భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. చివరకు పరిస్థితులు రైల్వే మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేసేంతవరకూ వెళ్లాయి. ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు చెందిన తెదేపా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా మంగళవారం గోయల్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. రెండు పర్యాయాలు వాయిదా వేసి.. సుమారు రెండుగంటల 20 నిమిషాలు తన కార్యాలయంలో వేచిచూసేలా చేసి రాత్రి 8.20 గంటలకు రైల్వేశాఖ కార్యాలయంలో మంత్రి సమావేశమయ్యారు.

కేంద్ర మంత్రికి తెదేపా నేతల విజ్ఞప్తుల అనంతరం భాజపా ఎంపీ జీవీఎల్‌ జోక్యం చేసుకుంటూ రైల్వేజోన్‌కు కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉందన్నారు. వెనుకబడిన జిల్లాల నిధుల వినియోగం సరిగా జరగలేదని, అందుకే రూ.350 కోట్లు వెనక్కు తీసుకున్నారంటూ మాట్లాడబోవడంతో ఎంపీలు శ్రీరాం మాల్యాద్రి, గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు తదితరులు జోక్యం చేసుకొని.. జీవీఎల్‌ ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కళా వెంకటరావు ఆగ్రహంగా ఊగిపోతూ నీసంగతి చూస్తానంటూ జీవీఎల్‌పై ధ్వజమెత్తారు. ఆయన కూడా.. చూసుకుందాం అంటూ ప్రతిసవాల్‌ విసిరారు. దీంతో కేంద్రమంత్రి పీయూష్‌గోయెల్‌ బయటకు వెళ్లిపోబోగా ఎంపీ సుజనాచౌదరి సర్ది చెప్పడంతో కేంద్రమంత్రి సీటులో కూర్చొన్నారు. ఈ సమయంలో జీవీఎల్‌ తాను మాట్లాడుతుండగా అడ్డుకోవడం తగదనడంతో మంత్రి కళా వెంకటరావు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. కేంద్రమంత్రి స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో తెదేపా నేతలు కేంద్ర మంత్రి కార్యాలయం ముందే 40 నిమిషాలపాటు ధర్నా చేశారు.

కాలపరిమితి ఎలా చెప్తాం: రైల్వేజోన్‌పై తెదేపా నేతలు చెప్పింది విన్న అనంతరం కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌ మాట్లాడుతూ.. 160 ఏళ్ల చరిత్రలో రాష్ట్రాల వారీగా జోన్‌ ఇచ్చిన ఘటన ఎప్పుడూ లేదని చెప్పారు. అయినా రైల్వే బోర్డు, అధికారులు అందరితోనూ చర్చలు జరుగుతున్నాయని, ఎలా సాధ్యం అవుతుందో దారులు చూడాలని చెప్పానన్నారు. ‘మీరేమో ఇలా అంటున్నారు. ఇటీవల హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇస్తామని చెప్పారు.. ఏదో గడువు చెప్పండి. ఇస్తారో లేదో స్పష్టంచేయండి’ అని సుజనాచౌదరి పట్టుబట్టారు. అందుకు గోయల్‌ స్పందిస్తూ ‘నెల కావచ్చు.. రెండేళ్లు కావచ్చు.. సమయం చెప్పడం కష్టం’ అన్నారు. ఎంపీ అవంతి శ్రీనివాస్‌ జోక్యం చేసుకొని తెలంగాణలో ఉద్యమం పేరుతో చాలామంది చనిపోయారని, అలాంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఆ విధంగా మాట్లాడవద్దని పీయూష్‌ గోయెల్‌ సూచించారు. మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభలో ఎంపీ అవంతి శ్రీనివాస్‌ రైల్వేజోన్‌ గురించి ప్రస్తావించారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెదేపా ఎంపీలంతా వాకౌట్‌చేశారు.

Related posts

Leave a Comment