మళ్లీ వేడెక్కిన కావేరి! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న కర్ణాటక

కుదరదంటున్న తమిళనాడు ప్రభుత్వం

తమిళనాడు, కర్ణాటకల మధ్య ఏళ్ల తరబడి సాగుతున్న కావేరి జలాల పంపిణీ వ్యవహారం మళ్లీ వేడెక్కింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంతా సజావుగా సాగుతోందని భావిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కావేరిపై పట్టు బిగింపునకు సన్నద్ధమైంది. దీని కోసం ఆ రాష్ట్ర రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చింది. ‘కావేరి’ వ్యవహారంలో మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, సోమవారం దిల్లీలో జరగనున్న ‘ప్రాధికార సంస్థ’ తొలి సమావేశంలో కర్ణాటక ప్రతినిధుల ద్వారా నిరసన గళం విప్పాలని కూడా నిర్ణయించింది. ఈ పరిస్థితుల్లో ధీమాగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం… కర్ణాటక కోర్టుకు వెళ్లినా ఎలాంటి ప్రయోజనం ఉండబోదని పేర్కొంటోంది.
నేడు కీలక సమావేశం
కావేరి జలవివాదం పరిష్కారానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కావేరి జల నిర్వహణ ప్రాధికార సంస్థ, కావేరి జల నియంత్రణ సమితి ఏర్పాటైన విషయం తెలిసిందే. ప్రాధికార సంస్థ తొలి సమావేశం సోమవారం దిల్లీలో జరగనున్న నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి శనివారం బెంగళూరులో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో కావేరి వ్యవహారంపై పలు కీలక తీర్మానాలు ఆమోదించారు. దిల్లీలో సోమవారం జరగనున్న ప్రాధికార సంస్థ సమావేశంలో కర్ణాటక ప్రతినిధులు మౌఖికంగా, లిఖితపూర్వకంగా ఆక్షేపణలు వ్యక్తం చేయాలని నిర్ణయించారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956 ప్రకారం కావేరి జల నిర్వహణ ప్రాధికార సంస్థ, కావేరి జల నియంత్రణ సమితుల నియామక హక్కు అధికారాలు పార్లమెంటువని, వీటిని సుప్రీంకోర్టు దక్కించుకున్నట్లయిందని, అందువల్ల కర్ణాటక ప్రయోజనాలు కాపాడేందుకు పార్లమెంటులో తమ రాష్ట్ర వాణి వినిపించాలని కూడా ఆమోదించిన తీర్మానాల్లో ఉంది. న్యాయకోవిదులు, సాగునీటి నిపుణుల సలహాల్ని పొందిన తర్వాత మరోసారి సుప్రీంకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రివ్యూ పిటిషనా? లేదంటే ఆదేశాలన్నీ సవరించాలని కోరే క్యురేటివ్‌ పిటిషన్‌ను దాఖలు చేయాలా? అనే విషయాన్ని తర్వాత నిర్ణయించనున్నట్టు ఆ రాష్ట్ర సాగునీటి మంత్రి శివకుమార్‌ వెల్లడించారు.

ముఖ్యమంత్రి ధీమా
ఈ పరిణామాలపై విపక్ష పార్టీలు ఆందోళనలు చెందుతున్నాయి. మరోవైపు రాష్ట్రానికి తగిన జలాలు లభించనున్నట్టు ప్రభుత్వం గట్టి ధీమాతో ఉంది. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నిబ్బరంగా ఉన్నారు. కావేరి జల నిర్వహణ ప్రాధికార సంస్థకు వ్యతిరేకంగా నిర్ణీత సంవత్సరాల వరకు వ్యాజ్యం దాఖలు చేయడం కుదరదని ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిందని శనివారం సేలంలో తెలిపారు. అందువల్ల సుప్రీంకోర్టులో కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి వ్యాజ్యం దాఖలు చేయడానికి అవకాశం లేదన్నారు. సోమవారం ప్రాధికార సంస్థ సమావేశం తర్వాత తగిన కావేరి జలాలను రాష్ట్రానికి విడుదల చేసేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టనుందని తెలిపారు. ప్రస్తుతం కర్ణాటకలో భారీవర్షాలు కురుస్తుండటంతో కబిని జలాశయం నిండిందని, దీంతో అదనపు జలాలు రాష్ట్రానికి చేరుతున్నాయని పేర్కొన్నారు. ఒక రోజుకు 25 వేల టీఎంసీలు నీరు వస్తుండటంతో మేట్టూర్‌ జలాశయం నిండే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కావేరి వ్యవహారంపై రాష్ట్రంలోని ఇతర రాజకీయ పక్షాలు, రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. గతంలో పలుమార్లు కోర్టు ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం బేఖాతరు చేసిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో తాజా పరిణామాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. దీంతో సోమవారం జరగనున్న సమావేశంపై రాష్ట్రనేతలు దృష్టి సారించారు. ఆ తర్వాతి పరిణామాలపై ఇప్పుడే విశ్లేషణలు చేస్తున్నారు.

Related posts

Leave a Comment