మళ్లీ మేమే గెలుస్తాం

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాము మళ్లీ విజయం సాధిస్తామని ప్రధాని నరేంద్రమోదీ దీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అభివృద్ధి మంత్రమే తమ నినాదమని తేల్చి చెప్పారు. జాతి ప్రగతి దిశగా నాలుగేండ్లుగా తమ ప్రభుత్వం చేసిన కృషి ఆధారంగానే ప్రజాతీర్పు కోరతామన్నారు. తమ ప్రభుత్వం 2022 నాటికి నవ్య భారతాన్ని నిర్మించాలన్న విజన్‌తో పని చేస్తున్నదే కానీ, ఎన్నికల కోసం కాదన్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రజలు కనబర్చిన ప్రేమ, ఆప్యాయతానురాగాలను మళ్లీ గెలుచుకోగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్డీయే గత రికార్డులను బద్ధలు కొట్టి విజయం తిరిగి విజయం సాధిస్తామని చెప్పారు. 2014లో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని పలు వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా విపక్షాల ఆధ్వర్యంలోని ఏర్పాటు కానున్న మహా కూటమి విజయవంతం కాదని, తనను ప్రధాని పదవి నుంచి తొలిగించడమే వాటి లక్ష్యమన్నారు. సిద్ధాంత సారూప్యత లేని పార్టీలన్నీ నిరాశానిస్పృహలతో రాజకీయ అవకాశ వాదంతో కూటమి ఏర్పాటు చేస్తున్నాయన్నారు. 1979, 1990, 1996ల్లో ఇటువంటి అవకాశవాద కూటములు విఫలమయ్యాయని మనకు చరిత్ర చెబుతున్నదన్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికతో ఎన్డీయే మిత్రపక్షాలపై నెలకొన్న సంశయాలకు తెర పడిందన్నారు. ప్రజలు తమను తప్పుదోవ పట్టించేందుకు నినాదాలిస్తున్న వారిని గమనిస్తున్నారన్నారు. సంఖ్యా బలం, సమస్యలు లేకున్నా కేవలం అహంకారం వల్లే తమ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయని ప్రధాని మోదీ అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తనను హత్తుకోవడానికి గల కారణాలనూ తానూ అన్వేషిస్తున్నానని పేర్కొన్నారు.
మూక దాడులు నేరమే..కట్టడికి చర్యలు తీసుకుంటాం
ఎవరు చేసినా మూక దాడులు చేయడం నేరమేనని అలా జరుగడం బాధాకరం అని ప్రధాని మోదీ చెప్పారు. ఈ దాడులను గట్టిగా ఖండించాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. వాటి కట్టడికి చర్యలు తీసుకుంటామన్నారు. మూక దాడుల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.
ఎన్‌ఆర్సీపై కాంగ్రెస్‌ది ఓటుబ్యాంక్ రాజకీయం
అసోంలో జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్‌ఆర్సీ)ని ఆమోదించినట్లు చెబుతున్నా ఆచరణలో కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నదని ప్రధాని మోదీ అన్నారు. 1972లో ఇందిర-ముజిబ్ ఒప్పందం, 1985లో రాజీవ్‌గాంధీ-అసు ఒప్పందం మేరకే అక్రమ వలసదారులను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకనుగుణంగానే తాము ఎన్‌ఆర్సీ ముసాయిదా మాత్రమే విడుదల చేశామన్నారు.
బోఫోర్స్ భూతం నుంచి బయటపడేందుకే రాఫెల్‌పై ఆరోపణలు
బోఫోర్స్ భూతం నుంచి బయటపడేందుకు రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ పదేపదే ఊహాజనిత ఆరోపణలు చేస్తున్నదని ప్రధాని మోదీ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలు కావాల్సిన రాఫెల్ ఒప్పందాన్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య జరిగిందని, పారదర్శకంగా, నిజాయితీతో చేసుకున్నదన్నారు. గత ప్రభుత్వాల వల్లే కొందరు వ్యక్తు లు సులభంగా రుణాలు పొంది తేలిగ్గా పారిపోయారన్నారు. విజయ్‌మాల్య, నీరవ్ మోదీ, లలిత్ మోదీ వంటి ఆర్ధిక నేరగాళ్లను స్వదేశానికి రప్పించేందుకు తమ ప్రభుత్వం పరారైన ఆర్థిక నేరగాళ్ల చట్టం తేవడంతో వారిలో ఆందోళన మొదలైందన్నారు.
ఉద్యోగాలపై విపక్షాల అబద్ధ ప్రచారం
ఉద్యోగాల కల్పనపై విపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ, నిందలు మోపుతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కానీ ఈపీఎఫ్‌ఓ డేటా ప్రకారం గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు సంఘటిత రంగంలో 45 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే, గతేడాది 70 లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చామని మోదీ వివరించారు. గత ప్రభుత్వ విధానాలతోనే బ్యాంకులకు మొండి బాకీ సమస్య ఏర్పడిందన్నారు. జీఎస్టీ అమలు విషయంలో వాటాదారులంతా ప్రభుత్వంతోనూ, వ్యవస్థతోనూ సహకరిస్తున్నారని చెప్పారు. జీఎస్టీ అమలులో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. కొన్ని పార్టీలు మాత్రమే జీఎస్టీని వ్యతిరేకిస్తున్నాయన్నారు. సుపరిపాలనతోపాటు ఐటీ చట్టం, ఆధార్ చట్టం ద్వారా పౌరుల వ్యక్తిగత డేటా పరిరక్షణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఉగ్రవాద రహిత ప్రాంతం కోసం పాక్ కృషి చేయాలి
ఇటీవలే ఎన్నికలు జరిగిన పాకిస్థాన్‌లో కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం ఉగ్రవాద, హింసా రహిత సురక్షిత, సుస్థిర, శ్రేయోదాయక ప్రాంతం కోసం పని చేస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీకి అనుగుణంగా దక్షిణాసియా ప్రాంతంలో సుస్థిర శాంతి సాధనకు పొరుగుదేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామన్నారు. ఉగ్రవాదంపై పోరుతోపాటు సుస్థిరతను ప్రోత్సహిస్తూ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి దిశగా అమెరికాతో లోతైన సంబంధాలను కలిగి ఉన్నామన్నాన్నారు. ఆస్తానా స్ఫూర్తితో చైనాతో భారత్ సంబంధాలు ముందుకు సాగుతున్నాయని వివరించారు.
జన్‌ధన్ ఖాతాదారులకు వరాలుపంద్రాగస్టు నాడు ప్రకటించనున్న ప్రధాని
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని 32 కోట్ల జన్‌ధన్ ఖాతాదారులకు వరాలు ప్రకటించనున్నట్టు అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాదారులకు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని రూ.10వేలకు పెంచనున్నట్లు పేర్కొన్నాయి. అలాగే ప్రభుత్వం ఆకర్షణీయ సూక్ష్మ బీమా పథకాన్నీ ప్రకటించే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. రుపే కార్డుదారులకు ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని లక్ష రూపాయలకు పైగా పెంచనున్నారు. పీఎంజేడీవై రెండో దశ ఈ నెల 15తో ముగియనుంది. ఈ నేపథ్యంలో పథకానికి మరిన్ని లక్ష్యాలను నిర్దేశించి పునరుద్ధరించనున్నట్లు సమాచారం. పంద్రాగస్టు నాడు ఎర్రకోట నుంచి చేసే ప్రసంగంలో ప్రధాని ఈ పథకాలను ప్రకటించనున్నట్టు తెలిపాయి. ఇవి కాకుండా అటల్ పెన్షన్ యోజన కింద పింఛన్ శ్లాబ్‌ను రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచనున్నారు.

Related posts

Leave a Comment