మడుగుల మాటున పొంచిన ముప్పు

మద్యం మత్తులో బలైపోతున్న యువకులు
నాలుగేళ్లలో 72 మరణాలు
భానుడి ప్రభావం.. వేసవి తాపం.. శరీరం అతలాకుతలం.. వాటి నుంచి బయటపడేందుకు నగరాల్లోని యువత విహారయాత్ర నిమిత్తం ఎంతో దూరానికి సైతం వారాంతాల్లో ఉల్లాస వాతావరణం అనుభవించడానికి పయనిస్తున్నారు. అదే కోవలో చెన్నైకు 70 కి.మి.ల దూరంలోని నాగలాపు రానికి వచ్చేస్తుంటారు. చుట్టూ పచ్చని చెట్లు, దట్టమైన రాతిగుట్టల నడుమ జలపాతాల నుంచి వచ్చే నీటి ప్రవాహం, స్వచ్ఛమైన గాలి, ఈదులాడటానికి సుందరమైన మడుగులు, ఎంత హడావుడి చేసినా ప్రశ్నించే వ్యక్తులు లేని ఏకాంతం.. వెరసి నాగలాపురం మండలంలోని సద్దికూడుమడుగు, భూపతీశ్వరకోన ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. తీరా విహారానికి వచ్చిన ఎక్కువ మంది యువకులు తుదకు విగతజీవులై వెనుదిరగాల్సి వస్తుండటం విచారకరం.
సద్దికూడుమడుగు, భూపతీశ్వరకోనలు రెండింటి చెంత జలపాత సోయగాలు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ కొండల నడుమ పైనుంచి జాలువారే జలపాతాల నుంచి వచ్చే నీరు మడుగుగా మారుతుంది. అక్కడి నుంచి నీరు కాలువల నుంచి ప్రవహిస్తూ పొలాలకు ఉపయుక్తమవుతుంది. ఈ రెండు ప్రాంతాలు అటవీ శాఖ పరిధిలో ఉండటంతో సాధారణ ప్రజానీకం ఆవైపు ఎక్కువగా వెళ్లరు. దీంతో ఈ ప్రాంతాలు జనావాసాలకు దూరంగా ఉన్నందున నగర యువతకు ఏకాంతంగా సుందర వాతావరణాన్ని అనుభవించే వీలు కలుగుతోంది. నగర యువతకు మద్యపానం సాధారణ విషయంగా మారటంతో వారు హద్దులు దాటి కోనల చెంత తాగేస్తున్నారు. తీరా జలపాతపు మడుగుల్లో స్నానానికి వెళ్లి మత్తులో ఈదులాడలేక.. మడుగుల్లోని రాళ్ల నడుమ కాళ్లు చిక్కుకుని తప్పించులేక.. నీళ్లలో పగలుగొట్టిన మద్యంసీసాల పెంకుల ధాటికి గాయాలపాలై ఈత కొట్టలేక.. తేలికపాటి తీగలు ఇరుక్కుని పైకి రాలేక దుర్మరణం పాలవుతున్నారు. ఇదే కోవలో గడిచిన నాలుగు సంవత్సరాల వ్యవధిలో 72 మంది యువకులు ఈ రెండు మడుగుల్లోనే మృత్యువాత పడ్డారు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా..
విహారయాత్రకు వచ్చే కొందరు యువత డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. వీరు ఒక దఫా కోనకు వస్తున్నారంటే… తినుబండారాలు, మందు, మాంసం వగైరాలు పెద్ద చిట్టీతోనే వస్తున్నారు. మద్యం తీసుకోవడం, అమ్మాయిల ముందు బడాయిలకు పోతూ మరణాన్ని ఆహ్వానించాల్సిన దుస్థితికి చేరుకుంటున్నారు. కోనల వద్ద చోరుల బెడద దారుణంగా ఉంటోంది. సుదూరం నుంచి వచ్చే యువకులు తమ వాహనాలను జలపాతానికి కంటికి కనిపించనంత దూరంలో ఆపాల్సిన పరిస్థితి. జనసంచారం లేకపోవడంతో చోరులు తరచూ వాహనాలను అపహరిచండం, వాహనాల్లోని ఇంధానాన్ని తీసేయటం చేస్తున్నారు. గడిచిన నాలుగు సంవత్సరాల్లో 85 వాహనాలు ఇక్కడ చోరీకి గురయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తరచూ కేసులు… ఆపై చోరుల నుంచి వాహనాలను యజమానులకు అప్పగించడం పోలీసులు చేయాల్సి వస్తోంది.

పుట్టినరోజునే స్నేహితునితో కలసి కడతేరాడు..
తమిళనాడులోని చెన్నై సమీపంలోని మూలకడైకు చెందిన యాష్లీ(30) అక్కడే సెలూన్‌లో పనిచేస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న అతనికి పుట్టినరోజు కావడంతో తన దుకాణానికి వస్తూ పరిచయస్తులైన ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యశ్వంత్‌ సింగ్‌(20), అతని స్నేహితులతో కలసి విహారయాత్రకు సిద్ధమయ్యారు. చెన్నై నుంచి సద్దికూడుమడుగుకు మూడు ద్విచక్రవాహనాల్లో వేడుకలు చేసుకోవడానికి వచ్చారు. మడుగు ఆవరణలో కేకులను కోసుకుని తిన్న అనంతరం.. ఐదుగురు యువకులకు ఈత రాకున్నా మద్యాన్ని సేవించి స్నానానికి మడుగులో దిగారు. మద్యం మత్తులో యశ్వంత్‌సింగ్‌, యాష్లీ నీట మునిగిపోయారు. వీరిని రక్షించడానికి స్నేహితులు ప్రయత్నించినా.. నీటిలో వెళ్లడానికి భయపడి వెనుదిరిగారు. ఇటువంటి సంఘటనలు సద్దికూడుమడుగుతో పాటు భూపతీశ్వరకోనలో సర్వసాధారణమయ్యాయి.

కోట్ల ఆస్తికి వారసుడు.. కడచూపునకు ఏడిపించాడు..
నన్ను పున్నామ నరకం నుంచి రక్షిస్తాడని అల్లారుముద్దుగా పెంచుకున్నాను. ఒక్కగానొక్క కొడుకుగా మురిపించిన సంతోష్‌ ఇప్పుడు నన్ను విడిచాడు. తొలి నుంచి చదువులో ముందుస్థానంలో నిలిచి ఆఖరున మరణంలోనూ ముందుగానే వెళ్లిపోయాడు. నీటి అడుగున నా కొడుకు ఇరుకున్నాక వాణ్ని చూడటానికి 20 గంటలు నిరీక్షించాల్సి వచ్చింది. కోట్ల ఆస్తికి వారసుడైన వాడు కడచూపుకు సైతం నన్ను ఏడిపించాడు. పిల్లలు ఎంత క్రమశిక్షణతో ఉన్నా వారి స్నేహితులు, విహారాలపై పెద్దలు కాస్త శ్రద్ద చూపించాల్సిందేనన్న విషయాన్ని మరవడం నాకు మనశ్శాంతిని దూరం చేసింది.

– సెంగోట్టయాన్‌(సంతోష్‌ తండ్రి), చెన్నై
నా సంపాదనకు ఇక లక్ష్యమేది
మాఅబ్బాయికి కష్టం కలుగకుండా పెంచాలని సొంత ఊరిని వదిలి దుబాయ్‌లో పనిచేస్తున్నాను. చిన్ననాటి నుంచి సరదాలకు నోచుకోని నేను నా కొడుకు ఆనందన్‌(23) ఆస్వాదించాలని రేయింబవళ్లు పనిచేసి లక్షలు కూడగట్టాను. పెద్దయ్యాక వాడి జీవితం ఆనందంగా ఉంటుందని ఇంజినీరింగ్‌ చేయించాను. మావాడు చురుగ్గా ఉండి పాతిక వేల వేతనాన్ని సాధించాడు. ఇక వాడి జీవితానికి ఎటువంటి ఇబ్బంది ఉండబోదని ఆనందంగా ఉన్న నాకు.. విహారం పేరిట భూపతీశ్వరకోనకు మార్చి 19న మడుగులో చిక్కుకుని కుమారుడు విగతజీవిగా మారాడన్న వార్త నన్ను కలచివేసింది. పిల్లల ఇష్టాలకు విలువ ఇస్తూనే వారిని జాగ్రత్తగా గమనించాలి.మరెవ్వరికీ నాకు కలిగిన నష్టం కలుగరాదంటే ఎవరేమనుకున్నా పిల్లలపై పెద్దలు నిఘా ఉంచాల్సిందే.
– సెల్వం(ఆనందన్‌ తండ్రి), చెన్నై
నిషిద్ధ ప్రాంతాలుగా ప్రకటిస్తా…
మడుగుల చెంత వరుసగా సాగుతున్న మరణాలు, చోరీలు, అసాంఘిక మరణాలు నన్ను కలచివేస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలను ఆపలేకపోవడం బాధను కలిగిస్తోంది. ఈ రెండు ప్రాంతాలు అటవీ శాఖ పరిధిలో ఉండటం.. జనావాసాలకు దూరంగా ఉన్నందున సమస్య నెలకొంటోంది. ఇక్కడ రక్షణాత్మక చర్యలు తీసుకోవడం ఇబ్బందికరంగా ఉన్నందున ఈ ప్రాంతాలను ఉన్నతాధికారులకు నివేదించి నిషిద్ధ ప్రాంతాలుగా ప్రకటిస్తాను. ఇక్కడ జరిగిన ప్రమాదాలు, మృతుల వివరాలు, మృతదేహాలతో ఫ్లెక్సీలను అధిక సంఖ్యలో ఏర్పాటుచేసి యువతకు పరిస్థితి అర్థమయ్యేలా ప్రచారం నిర్వహిస్తాను.

Related posts

Leave a Comment