మండుటెండలు.. ఆరోగ్యం జాగ్రత్త!

కలుషిత నీరు, ఆహారంతోనే ప్రధాన సమస్య
అతిసారం, విరేచనాలు, టైఫాయిడ్‌, కామెర్లు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం
పొంచి ఉన్న వడదెబ్బ ముప్పు
ఇంట్లో ఉన్నా నీరు తాగాల్సిందే
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఔషధ డోసులు సరిచూసుకోవాలి
ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు
వేసవిలో సూర్య ప్రతాపానికి సాధారణ ప్రజలు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 43-44 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదవుతోంది. గత వారం రోజుల్లోనే సుమారు 20 మంది వరకు మృతిచెందినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఉపాధి కూలీలు, ఇటుక బట్టీల్లో పనిచేసేవారు, ఎండవేడికి ఎక్కువగా గురవడానికి అవకాశమున్నవారు తీవ్ర అనారోగ్యం బారినపడుతున్నారు. అలా ఓ ఐదు నిమిషాలు బయటకెళ్లొస్తే.. ఆరోగ్యవంతులు కూడా ఊసూరుమంటూ కూలపడిపోవాల్సి వస్తోంది. ఒంట్లో నుంచి నీరు, ఖనిజాలు, లవణాలు చెమట రూపంలో ధారాళంగా బయటకు వెళ్లిపోతుండడంతో నిస్సత్తువ ఆవహిస్తుంది. ఈ పరిస్థితుల్లో అత్యవసరంగా శరీరంలో నీటిని, లవణాలను భర్తీ చేయాల్సిందే. ఎండవేడికి ఎక్కువగా గురైనప్పుడు.. శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా శరీరంలో వేడి అంతకంతకూ పెరిగిపోయి కుప్పకూలిపోతారు. ఇది అత్యవసరంగా వైద్య చికిత్సనందించాల్సిన పరిస్థితి.
నీటి ఎద్దడితో ముప్పు
వేసవిలో నీటి ఎద్దడి కారణంగా నీరు కలుషితమయ్యే అవకాశాలెక్కువగా ఉంటాయి. కలుషిత నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఎండవేడిమికి ఆహారం త్వరగా పాడైపోతుంది. సాధారణ పరిస్థితుల కంటే వేడి వాతావరణంలో సాల్మొనెల్లా, షిజెల్లా, లెజియోనెల్లా, ఈకొలి.. తదితర కొన్ని రకాల బ్యాక్టీరియాలు విజృంభిస్తాయి. కలుషిత నీరు, ఆహారాల ద్వారా త్వరగా రోగకారక క్రిములు వ్యాప్తి చెందుతాయి. తద్వారా హెపటైటీస్‌ ఏ(కామెర్లు), టైఫాయిడ్‌, నీళ్ల విరేచనాలు(డయేరియా), జిగట విరేచనాలు(డీసెంట్రీ), అమీబియాసిస్‌, వాంతులు ప్రధానంగా కనిపించే అతిసారం వంటి వ్యాధులు ప్రబలుతుంటాయి.

స్వీయ జాగ్రత్తలే మేలు
ఎండాకాలంలో సాధ్యమైనంత వరకు వేడిగా, తాజాగా ఆహారాన్ని తినడమే మేలు. పండ్లు, కూరగాయల ముక్కలను అప్పటికప్పుడు కోసుకొని తినాలి. క్లోరినేషన్‌ చేసిన నీటినే తాగాలి. లేదంటే నీటిని తప్పనిసరిగా కాచి, వడబోసి తాగాలి. ఆహారపదార్థాలపై ఈగలు వాలకుండా ఎప్పుడూ మూతలు పెట్టాలి. మలమూత్ర విసర్జన చేసిన తర్వాత తప్పనిసరిగా చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. వాంతులు, విరేచనాలు అవుతున్నప్పుడు ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని తాగించాలి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రయాణాలు చేయకపోవడమే మేలు. ముఖ్యంగా పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల విషయంలో అప్రమత్తత పాటించాల్సిందే.

-డాక్టర్‌ మనోహర్‌, విశ్రాంత ఆచార్యులు, ఉస్మానియా వైద్యకళాశాల.
బీపీ మాత్రలు సరిచూసుకోవాలి
అధిక రక్తపోటుకు వాడే కొన్నిరకాల మాత్రలకు ఒంట్లోంటి నీరు తగ్గించే గుణం ఉంటుంది. ఇలాంటప్పుడు రక్తంలో నీళ్లు, సోడియం తక్కువైతే ‘డీహైడ్రేషన్‌’కు గురయ్యే అవకాశం ఉంటుంది. మానసిక చికిత్స, పార్కిన్‌సన్‌ వంటి నాడీ సంబంధ వ్యాధుల్లో ఉపయోగించే కొన్ని రకాల మందుల వల్ల చెమట పట్టే గుణం తగ్గిపోతుంది. ఫలితంగా ఎండలో వెళ్లినప్పుడు వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది. ఎండాకాలంలో రక్తనాళాలు ఉబ్బి, రక్తపోటు పడిపోతుంది. ఫలితంగా మెదడుకు రక్తప్రసరణ ఒక్కసారిగా తగ్గి ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయే అవకాశముంటుంది. తరచూ ఓఆర్‌ఎస్‌ ద్రావణాలు, మజ్జిగను తీసుకుంటూ ఉండాలి. ఇంట్లో ఉన్నా తరచూ నీళ్లు తాగాల్సిందే. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తమ ఔషధ మోతాదులను వైద్యుని సంప్రదింపులతో సరిచూసుకోవాలి.
– డాక్టర్‌ ఎంవీ రావు, జనరల్‌ ఫిజీషియన్‌
వడదెబ్బకు గురైనప్పుడు..
* వెంటనే నీడపట్టున చేర్చాలి.
* దుస్తులు విప్పి, గాలి బాగా ఆడే ప్రదేశంలో ఉంచాలి.
* చల్లని నీళ్లతో తుడవాలి.
* సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి.
* ఎట్టి పరిస్థితుల్లోను జ్వరం తగ్గించే మాత్రలను ఇవ్వద్దు.

Related posts

Leave a Comment