భవనంపై జలపాతం.. బాగుందా మరి..!

పచ్చని ప్రకృతి ఒడిలో కొండలు, కోనల నడుమ జలజల పారుతూ కిందకు దూకి సవ్వడి చేసే జలపాతాలను చూస్తుంటే ఎంతో కనువిందుగా ఉంటుంది. వర్షాకాలంలో అయితే ఈ జలపాతాల అందాలు మరింత మనోహరంగా ఉంటాయి. మరి అదే జలపాతం రద్దీగా ఉండే నగరం మధ్యలో ఉండే.. భవనాలపై నుంచి దూకుతుంటే.. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. చైనాలో అలాంటిదే నిర్మించాడు ఓ వ్యక్తి. అయితే ఈ కృతిమ జలపాతంపై స్థానికులు ఆసక్తి చూపకపోగా.. డబ్బు వృథా అంటూ విమర్శలు చేయడం గమనార్హం.

చైనాలోని గుయాంగ్‌ నగరంలో స్థానిక లుది ఇండస్ట్రీ గ్రూప్‌ ఓ భవన నిర్మాణం చేపట్టింది. షాపింగ్‌ మాల్‌, ఆఫీస్‌లు, లగ్జరీ హోటల్‌ ఏర్పాటుచేసేలా బహుళ అంతస్థుల భవనం నిర్మిస్తోంది. అయితే అన్నింటిలా కాకుండా ఈ భవనం కాస్త విభిన్నంగా ఉండాలని లుది గ్రూప్‌ భావించింది. ఇందుకోసం భవనంపై నుంచి కృతిమ జలపాతాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 350 అడుగుల ఎత్తున ఉండే అంతస్తు నుంచి నీరు కిందకు దూకేలా నిర్మించారు. భవన నిర్మాణం ఇంకా పూర్తికాకపోయినా ఇప్పటికే ఈ జలపాత నిర్మాణం పూర్తవడంతో అందుబాటులోకి తీసుకొచ్చారు.

బిజీ నగరంలో ప్రజలకు ప్రకృతి రమణీయ భావన కల్పించాలనే ఉద్దేశ్యంతోనే తాము ఈ జలపాతాన్ని నిర్మించినట్లు లుది గ్రూప్‌ చెబుతోంది. అంతేగాక.. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన కృతిమ జలపాతం కూడా ఇదేనని పేర్కొంటోంది. అయితే ఈ జలపాతం స్థానికులను ఆకర్షించకపోవడం గమనార్హం. దీని వల్ల డబ్బు, నీటి వృథా తప్పించి ఇంకేమి లేదని స్థానికులు సోషల్‌మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ జలపాతం కోసం లుది గ్రూప్‌ గంటకు 120డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 8వేలు) ఖర్చు చేస్తోందట.

Related posts

Leave a Comment