భద్రతలో తిరుపతి మేటి

దేశంలోనే రెండో అత్యుత్తమ నగరం
31వ స్థానంలో విశాఖ, 56వ స్థానంలో కాకినాడ
నివాస అనుకూల నగరాల సూచీలో వెల్లడి
దేశంలోనే అత్యుత్తమ రక్షణ, భద్రత కలిగిన రెండో నగరంగా ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి గుర్తింపు పొందింది. విశాఖపట్నం కొంత మెరుగైన స్థానాన్నే దక్కించుకోగా…రాజధాని ప్రాంతంలో ప్రధాన నగరమైన విజయవాడ వందో స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల దేశంలోని 111 నగరాలను పరిశీలించి నివాస అనుకూల నగరాల సూచీ-2018 (ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌-2018)ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆయా నగరాల్లో వ్యవస్థాగత, సామాజిక, ఆర్థిక, భౌతిక మౌలిక వసతుల విభాగాలకు సంబంధించిన పరిపాలన, సంస్కృతి, విద్య, ఆరోగ్యం, రక్షణ, భద్రత, ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, గృహనిర్మాణం, సమ్మిళిత వృద్ధి, విద్యుత్తు తదితర 15 అంశాల్లో స్థితిగతులను పరిగణనలోకి తీసుకుంది. వాటిని క్రోడీకరించి ఈ సూచీలో నగరాలకు ర్యాంకులను కేటాయించింది. దాని ప్రకారం దేశంలోనే అత్యంత నివాస అనుకూలమైన తొలి పది నగరాల జాబితాలో తిరుపతి 4, విజయవాడ 9, విశాఖపట్నం 17, కాకినాడ 64వ స్థానంలో నిలిచాయి కూడా. అయితే అందులో కేవలం రక్షణ-భద్రత అంశం పరంగా చూస్తే మాత్రం తిరుపతి మరింత మెరుగైన ర్యాంకు పొందినప్పటికీ….విజయవాడ, కాకినాడ మాత్రం బాగా వెనుకబడ్డాయి. మెరుగైన రక్షణ, భద్రత విధానాలు పాటించారంటూ తిరుపతి అర్బన్‌ ఎస్పీ, పోలీసు సిబ్బందిని డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ అభినందించారు.
రక్షణ-భద్రత విభాగంలో ప్రామాణికంగా తీసుకున్న అంశాలు
* నగరంలో ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నగర విస్తీర్ణానికి సరిపడా ఉన్నాయా? లేదా? వీధులు, బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారుల్లో నిఘా ఎలా ఉంది?
* ప్రతి లక్ష మంది జనాభాకు ఎన్ని నేరాలు నమోదవుతున్నాయి?
* మహిళలు, చిన్నారులు, వృద్ధులపై ఏటా జరుగుతున్న నేరాలు, వాటి తీరుతెన్నులు.
* ప్రతి లక్ష మంది జనాభాకు రవాణా సదుపాయం ఎలా ఉంది?
* హింసాత్మక ఘటనలు అరికట్టేందుకు వీలైన చర్యలు ఉన్నాయా? లేదా?

Related posts

Leave a Comment