బిగ్‌బాస్‌కి ఇంటిదొంగల బెడద

బిగ్‌బాస్‌ అనేది స్టార్‌ నెట్‌వర్క్‌కి ఎక్స్‌క్లూజివ్‌ షో. బాలీవుడ్‌లో పదకొండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షోని తెలుగు వారి ముందుకి తీసుకొచ్చింది స్టార్‌ నెట్‌వర్క్‌. మాటీవీని సొంతం చేసుకోవడంతో ఈ షోని తెలుగులో కూడా చేయవచ్చునని భావించి ఇక్కడ ఇంట్రడ్యూస్‌ చేసారు. ఫస్ట్‌ సీజన్‌కి ఎన్టీఆర్‌ హోస్ట్‌ కావడంతో ఈ షో సూపర్‌హిట్‌ అయింది. సెకండ్‌ సీజన్‌కి ఎన్టీఆర్‌ అందుబాటులో లేక నానిని హోస్ట్‌గా తీసుకున్నారు.

మామూలుగా బిగ్‌బాస్‌ని లోనావాలాలో సెట్‌ వేసి అక్కడ షూట్‌ చేస్తుంటారు. కానీ అంత దూరంలో పెడితే ప్రతి వీకెండ్‌కి హోస్ట్‌ని అక్కడికి తీసుకురావడంతో పాటు మరికొన్ని ఇబ్బందులు వుండడంతో ఈసారి అన్నపూర్ణ స్టూడియోలో సెట్‌ వేసి ఇక్కడే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దూరంగా వుంటే బిగ్‌బాస్‌ సంగతులు బయటకి రావు కానీ లోకల్‌గా సెట్‌ వుండేసరికి ఎవరికి వారు తమకి తోచిన దారుల్లో ఇన్‌ఫర్మేషన్‌ లాగుతున్నారు. ఔత్సాహికులైన క్రూలోని సభ్యులు కొందరు షూట్‌ జరుగుతుండగా ఫోటోలు తీసి లీక్‌ చేసేస్తున్నారు. అంతే కాకుండా హౌస్‌లోని కీలక సమాచారం కూడా లీక్‌ అయిపోతోంది.

భాను ఎలిమినేషన్‌తో పాటు ఆమె వేసిన బిగ్‌ బాంబ్‌ సమాచారం గత ఆదివారం ఉదయానికే నెట్‌లో ఫోటోలతో సహా వచ్చేయడం నానితో పాటు అందరినీ షాక్‌కి గురి చేసింది. ఈ లీకు వీరులకి చెక్‌ ఎలా పెట్టాలో తెలియక బిగ్‌ బాస్‌ టీమ్‌ తల పట్టుకుంది. బిగ్‌ బాస్‌ హౌస్‌కి సెక్యూరిటీతో పాటు పలువురు మెయింటెనెన్స్‌, ఎడిటింగ్‌, కెమెరా టీమ్‌లలో పని చేస్తుంటారు. వీరిలో ఎవరు సమాచారం లీక్‌ చేస్తున్నారనేది పట్టుకోవడం అంత తేలిక కాదు. ఒకవేళ ఇంటిదొంగలు దొరికినా వారిపై ఇప్పుడు తక్షణ చర్యలు తీసుకోవడానికి కుదరదు. షో మధ్యలో వుంది కనుక ఇప్పుడు ఎలాంటి యాక్షన్‌ తీసుకున్నా షోకి సంబంధించిన రహస్య సమాచారం మరింత బయటకి పొక్కే అవకాశాలే ఎక్కువ. దీంతో వారిపై చర్యలు తీసుకోకుండానే లీకులని ఎలా నివారించాలా అని బిగ్‌బాస్‌ టీమ్‌ మదనపడుతోంది.
Bigg Boss 2 Leaks,Bigg Boss 2 Telugu eliminations

Related posts

Leave a Comment