బాలికపై అత్యాచారయత్నం..నిందితుల్లో టీడీపీ ఎంపీటీసీ భర్త?

కత్తిపూడి టీడీపీ ఎంపీటీసీ సంధ్య భర్త శ్రీనివాస్ పై ఆరోపణలు
అన్నవరం నుంచి కత్తిపూడికి వెళ్తుండగా మార్గమధ్యంలో సంఘటన
అర్ధరాత్రి సమయంలో టీ దుకాణం వద్ద గొడవ
బాలికపై అత్యాచారానికి యత్నించిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం తమ్మయ్యపేట గ్రామంలో జరిగింది. ఈ సంఘటనలో కత్తిపూడి టీడీపీ ఎంపీటీసీ కంచిబోయిన సంధ్య భర్త శ్రీనివాస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు.. బుధవారం అర్ధరాత్రి సమయంలో అన్నవరం నుంచి కత్తిపూడికి వెళ్తున్న శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి వెళ్తున్నారు. మార్గమధ్యంలో తమ్మయ్యపేటలో ఉన్న టీ దుకాణం వద్ద ఆగారు. ఈ టీ దుకాణాన్ని ఓ మహిళ తన ఇద్దరి కూతుళ్లతో కలిసి నిర్వహిస్తోంది. టీ కావాలని ఆయన అడగడంతో, ఇంత అర్ధరాత్రి టీ ఏంటి? అని ఆమె ప్రశ్నించింది. టీ ఇవ్వాల్సిందేనంటూ శ్రీనివాస్ పట్టుబట్టడం.. ఇరువురి మధ్య వాదన జరిగింది. ఈ క్రమంలో టీ దుకాణం నిర్వహించే మహిళ పెద్ద కూతురు (17) చేతిని పట్టుకుని, పక్కనే ఉన్న తోటలోకి శ్రీనివాస్, అతని అనుచరులు లాక్కెళ్లేందుకు యత్నించగా, అక్కడే ఉన్న స్థానికులు కొందరు ప్రతిఘటించడంతో వారు వెనుదిరిగారని సమాచారం. బాధితురాలు ఫిర్యాదు మేరకు శ్రీనివాస్, అతని అనుచరులు శ్రావణ్, రవి, సత్యనారాయణ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తొండంగి ఎస్ ఐ జగన్మోహన్ రావు తెలిపారు. కాగా, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెనుకాడతున్నట్టు తెలుస్తోంది.

Related posts

Leave a Comment