ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటు పెంచిన ఎస్‌బీఐ

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కస్టమర్లకు శుభవార్త. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై బ్యాంకు వడ్డీరేటును పెంచింది. డిపాజిట్లపై 5 నుంచి 10 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. కొత్త వడ్డీ రేట్లు జులై 30వ తేదీ నుంచి అమలవుతాయి. వివిధ కాలపరిమితులతో సాధారణ, వయో వృద్ధులు చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు ఇచ్చే వడ్డీ రేట్లలో చేసిన మార్పులను ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఏడాది నుంచి పదేళ్ల కాలపరిమితికి రూ. కోటి కంటే తక్కువ చేసిన డిపాజిట్లపై వడ్డీని 5 నుంచి 10 బేసిస్‌ పాయింట్ల మధ్య పెంచింది. అంటే 0.05శాతం నుంచి 0.1శాతం పెరుగుతుంది.

సాధారణ ప్రజలకు ఏడాది నుంచి రెండేళ్ల కంటే తక్కువ కాలపరిమితికి చేసిన డిపాజిట్లపై గతంలో వడ్డీరేటు 6.65శాతం ఉండగా ఇప్పుడు 6.7శాతానికి పెరిగింది. రెండేళ్ల నుంచి మూడేళ్ల కంటే తక్కువ కాలపరిమితికి 6.65శాతం నుంచి 6.75శాతానికి పెరిగింది. ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు డిపాజిట్లపై 6.75శాతం నుంచి 6.85శాతానికి పెరిగింది. సీనియర్‌ సిటిజన్లకు ఏడాది నుంచి రెండేళ్ల కంటే తక్కువ కాలపరిమితికి చేసిన డిపాజిట్లపై వడ్డీ రేటు 7.15శాతం నుంచి 7.2శాతానికి పెరిగింది. ఐదేళ్ల నుంచి పదేళ్ల కాలపరిమితికి 7.25శాతం నుంచి 7.35శాతానికి పెరిగింది. ఎస్‌బీఐ ఉద్యోగులకు, ఎస్‌బీఐ పెన్షనర్లకు ఎస్‌బీఐ ప్రతిపాదించిన వడ్డీ రేటు కంటే ఒక శాతం ఎక్కువగా ఉంటుంది.

Related posts

Leave a Comment