ప్లీనరోత్సాహం

ఎన్నికలకు తెరాస సమాయత్తం
ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఉండాల్సిందే..
ఇంటింటి ప్రచారం
దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్‌
నేడు తెరాస ప్లీనరీ
13 వేల మంది ప్రతినిధులకు ఆహ్వానం
పార్టీకి, ప్రభుత్వానికి నూతనోత్తేజం..వచ్చే ఎన్నికలకు సమాయత్తం.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పునకు అంకురార్పణ లక్ష్యాలతో హైదరాబాద్‌లోని కొంపల్లిలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ శుక్రవారం జరగనుంది. రాష్ట్ర, జాతీయ రాజకీయ ముఖచిత్రాన్ని ఆవిష్కరించడంతో పాటు పార్టీ శ్రేణులకు అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీకి ఇది 17వ ప్లీనరీ కాగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నాలుగోది. రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా.. సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న ఈ ప్లీనరీని తెరాస ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి ప్లీనరీ వేదిక కానుంది. ఇప్పటికే పార్టీ గ్రామ, మండల కమిటీలు, రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటైంది. జిల్లా కమిటీల స్థానంలో నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలకు ఎమ్మెల్యేలే అధ్యక్షులుగా ఉంటారు. ఎమ్మెల్యేలు లేని చోట్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, ఇతర సీనియర్‌ నేతలను నియమించాల్సి ఉంది. ఎన్నికలు సమీపించే సమయంలో వాటిని నియమించాలనే భావనలో సీఎం ఉన్నారు. పార్టీ నేతలకు ఇప్పటికే నియమిత పదవులు దక్కాయి. ఇంకా కొన్ని పదవుల్లో నియామకాలు జరగాల్సి ఉంది. వాటి కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. పంచాయతీలు, సహకార సంఘాలు, మండల, జిల్లా పరిషత్‌లు, పురపాలక సంఘాల ఎన్నికలు మున్ముందు ఉన్నాయి.ఎన్నికల లక్ష్యంతో కొత్త పంచాయతీరాజ్‌ చట్టం తెచ్చారు. పురపాలక చట్టాన్ని సవరించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రాధాన్యం దృష్ట్యా శ్రేణులను సన్నద్ధం చేయాలని భావిస్తున్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లివ్వని పక్షంలో ఎన్నికల్లో ఓట్లు అడగబోమని సీఎం ఇప్పటికే పునరుద్ఘాటించారు.దీనికి అనుగుణంగా ఆ ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ వరప్రదాయినిగా తెరాస విశ్వసిస్తోంది. దీని పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మూడు నెలలకోసారి సర్వేలను నిర్వహిస్తూ ప్రజాప్రతినిధులు లోటుపాట్లను సీఎం వివరిస్తున్నారు.కొందరినిహెచ్చరించారు. 2019 ఎన్నికల బృందం ఇప్పటికే ఖరారైంది. ప్లీనరీ వేదికగా వీటన్నింటిపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

అత్యవసరమైతేనే హైదరాబాద్‌కు: వచ్చే ఎన్నికలు పూర్తయ్యేదాకా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లోనే ఉండాలని, ప్రజలతో మమేకం కావాలని సీఎం కేసీఆర్‌ పిలుపునివ్వనున్నారు. అత్యవసరమైతే తప్ప హైదరాబాద్‌కు రాకూడదని నిర్దేశించనున్నారు. పది నెలల పాటు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ఇంటింటి ప్రచారం నిర్వహించడంతో పాటు ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకునేందుకు భూపాలపల్లిలో సభాపతి మధుసూదనాచారి నిర్వహిస్తున్న పల్లెనిద్ర, సమస్యల పరిష్కారం కోసం నర్సంపేట ఇన్‌ఛార్జి, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ పెద్దిసుదర్శన్‌రెడ్డి చేస్తున్న పల్లెప్రగతివంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించనున్నారు.

ప్రగతి వేదిక: ప్లీనరీని ప్రగతి వేదికగా తెరాస ఉపయోగించుకోనుంది. నాలుగేళ్ల పాలనలో సాధించిన విజయాలు, ఫలితాలను పెద్దఎత్తున ఇప్పటికే ప్రచారం చేస్తోంది. ప్లీనరీ ప్రాంగణం, నలువైపులా రహదారులు, నగరమంతటా పార్టీ పథకాలు, కార్యక్రమాల ఫ్లెక్సీలు, ప్రచార చిత్రాలను ఏర్పాటు చేసింది. ఎకరానికి ఎనిమిదివేల చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు వచ్చే నెలలో ప్రారంభించనున్న రైతుబంధు పథకంపై పెద్దఎత్తున ప్రచారం చేపట్టనుంది. జాతీయస్థాయిలో రాజకీయ ముద్ర: భాజపా, కాంగ్రెస్సేతర పార్టీల ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే మమతాబెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడను కలిశారు. జాతీయ స్థాయిలో తెరాస ముద్రను చాటేందుకు, తెలంగాణ ప్రతిష్ఠను పెంచే లక్ష్యంతో తాను చేస్తున్న ప్రయత్నాలను ప్లీనరీలో వివరించనున్నారు.

విస్తృతంగా ఏర్పాట్లు: ప్రతి నియోజకవర్గం నుంచి వందమంది చొప్పున సదస్సుకు 13 వేల మంది ప్రతినిధులు హాజరవుతారు. 23 దేశాల నుంచి 200 మందికి పైగా తెలంగాణ ప్రవాస శాఖల ప్రతినిధులు వస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు ప్లీనరీ జరుగుతుంది. విద్యార్థి విభాగం నుంచి 15 వందల మంది వాలంటీర్లు విధులునిర్వహిస్తారు. రుచికరమైన వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా సభా ప్రాంగణంలో అంబలి, మజ్జిగ, మంచినీటి సరఫరా కేంద్రాలను ప్రారంభించారు. శుక్రవారమైనందున ముస్లిం సోదరుల నమాజ్‌ కోసం ప్రత్యేక స్థలం కేటాయించారు.

Related posts

Leave a Comment