ప్రేమపై.. పరువు కత్తి చెల్లెలిపై కత్తితో దాడిచేసిన అన్న

కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో..చెల్లెలిపై అన్న కత్తితో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావవైన కారణంగా యువతి పరిస్థితి విషమంగా ఉంది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వీరాపూర్‌లో శనివారం ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వీరాపూర్‌ గ్రామానికి చెందిన చిట్టంపల్లి రమకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. భర్త పదేళ్ల క్రితం మృతిచెందడంతో వ్యవసాయం, కూలి పనులు చేస్తూ పిల్లలను చదివించిందామె. రెండో కుమార్తె మౌనిక(22) ఇటీవలే డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉంది. ఇదే మండలం తోటపల్లికి చెందిన సాయి..ఆమె కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరుకావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించి.. పది రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. రక్షణ కల్పించాలంటూ స్థానిక పోలీసులను ఆశ్రయించగా..వారు కౌన్సెలింగ్‌ ఇచ్చి మౌనికను తల్లికి అప్పగించారు. చెల్లెలు కులాంతర వివాహం చేసుకోవడం వల్ల కుటుంబం పరువు పోయిందన్న భావనతో ఉన్న యువతి అన్న నాగరాజు శనివారం మధ్యాహ్నం ఆమెతో గొడవకు దిగాడు. మాటామాటా పెరడగంతో.. వీపుపై కత్తితో విచక్షణారహితంగా పొడిచి పరారయ్యాడు. స్థానికులిచ్చిన సమాచారం మేరకు.. రక్తపు మడుగులో ఉన్న మౌనికను పోలీసులు కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

Related posts

Leave a Comment