ప్రేమగా..విష‘వల’యంలోకి!

ఆప్యాయత ఒలకబోస్తూ వ్యభిచార కూపంలోకి
పిల్లల భావోద్వేగాలతో చీకటి వ్యాపారం
ఇప్పటికీ వారే ‘అమ్మ’లన్న భ్రమల్లో బయటపడిన చిన్నారులు
చదువుకుని డాక్టర్‌, పోలీసు అవుతామంటున్న పసికూనలు
‘అమ్మా’…! అన్న పిలుపు వినగానే కఠిన మనసైనా కరిగిపోతుంది. చిన్నపాప నుంచి పండుముసలి వరకు అప్యాయతను అమృతంలా కురిపించేందుకు సిద్ధమవుతుంది. వ్యభిచార నిర్వాహకులు మాత్రం..ఆ పిలుపునకు కళంకం తెచ్చారు. కాసుల కక్కుర్తితో ‘అమ్మ’ పిలుపునే పెట్టుబడిగా పెట్టి..అభంశుభం తెలియని బాలికలను విష వలయంలోకి దింపుతున్నారు. అక్రమ రవాణా ముఠాల నుంచి కొనుగోలు చేసి, దొంగతనంగా ఎత్తుకువచ్చిన ఆడపిల్లలకు తామే అమ్మలమన్న నమ్మకాన్ని కలిగించి..క్రమంగా అంగడి బొమ్మల్ని చేస్తున్నారు. వ్యభిచార గృహాల నుంచి బయటపడిన 15 మంది చిన్నారులు ఆ హృదయం లేని మహిళల్ని నేటికీ సొంత అమ్మలుగా భావిస్తుండటం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ‘‘చిన్నారులు ‘అమ్మ’ ఎక్కడంటూ సంరక్షణ కేంద్రానికి వచ్చిన అధికారులను అడుగుతుండటం వ్యభిచార కేంద్రం నిర్వాహకులు వారిపై బంధాల వల ఎలా విసురుతున్నారో అనేందుకు నిదర్శనమని’’ అధికారులు అభిప్రాయపడుతుండగా.. ‘‘వాళ్లు తమ సొంత పిల్లలుగా’’ ఆనవాళ్లు గుర్తుపట్టిన తల్లిదండ్రులు బాధతో కుమిలిపోతున్నారు.
వెంటాడుతున్న భయం…
వ్యభిచార గృహాల నుంచి పోలీసులు రక్షించిన పిల్లల్లో భయం మాత్రం ఇంకా తొలగిపోలేదు. అక్కడ అనుభవించిన చిత్రహింసలను తలచుకుని కొందరు ఉలిక్కిపడుతున్నారు. కళ్ల ముందు ఇంకా ఏదో జరుగుతోందన్న బెరుకు, భయం, ఆందోళన వారిలో తొలగిపోలేదు. పాపపు కూపం నుంచి బయటపడి స్వేచ్ఛాయుత వాతావరణంలోకి వచ్చామన్న సంతోషం ఓవైపు కనిపించినా, ఆ వెంటనే భయంతో తీవ్ర విచారంలోకి వెళ్తున్నట్టు అధికారులు గుర్తించారు. ‘ఆరేళ్ల పైబడిన పిల్లలు పునరావాస కేంద్రంలోని వారితో సరదాగా మాట్లాడుతూ ఆందంగా ఉంటున్నట్టు కన్పిస్తూనే..మరుక్షణంలో వారికి దూరంగా వెళ్తున్నారు. ఆరేళ్లలోపు ఒకరిద్దరు పిల్లలు అమ్మ ఎక్కడంటూ తమను ప్రశ్నిస్తున్నారు. ఒకరిని చూసుకుంటూ ఒకరు ఏడుస్తున్నారు’ అని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు పిల్లలను వాస్తవిక పరిస్థితుల్లోకి తీసుకువచ్చేందుకు పునరావాస కేంద్ర నిర్వాహకులు తమప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో పాపను ఒక్కో మహిళ సంరక్షణలో ఉంచారు. వారిని లాలించి..ఆడించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.

‘అత్తా’… నేను డాక్టర్‌ అవుతా
శనివారం పునరావాస కేంద్రానికి వెళ్లిన వెంటనే పిల్లలంతా సంతోషంగా సీడబ్ల్యూసీ, మహిళా శిశుసంక్షేమ అధికారుల దగ్గరకు వచ్చారు. ‘‘అత్తా బాగున్నావా? మమ్మల్ని ఇక్కణ్నుంచి తీసుకెళ్తారా’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారులు బిస్కెట్లు, చాక్లెట్లు ఇచ్చి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ‘ఆరేళ్ల పైబడిన పిల్లలకు వాస్తవ పరిస్థితులు అర్థం అవుతున్నాయి. తాము చెప్పిన మాటలు శ్రద్ధగా వింటున్నారు. ఆరేళ్లలోపు చిన్నారులు మాత్రం అమ్మ, పిన్ని, అక్క వచ్చారా?’ అంటూ అడుగుతున్నారు. ‘‘మీరంతా చదువుకుంటారా? అంటే అందరూ తలూపారు. కొందరు పిల్లలు పెద్దయ్యాక ఏమవుతారంటే ‘‘టీచర్‌ అవుతా.. డాక్టర్‌ అవుతా… పోలీసు అవుతామంటూ సమాధానం చెప్పారని’ అధికారులు వివరించారు. ‘‘అత్తా…మళ్లీ వచ్చి మమల్ని చూసివెళ్లు’ అంటూ పిల్లలు అనడాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని శిశు సంక్షేమ అధికారి ఒకరు కన్నీటి పర్వంతమయ్యారు.

డీఎన్‌ఏ పరీక్షలు పూర్తయ్యాకే…
మరోవైపు 15 మంది చిన్నారుల వాంగ్మూలాన్ని బాలల సంరక్షణ కమిటీ నమోదు చేసింది. పోలీసులు, రెవెన్యూ, జిల్లా కలెక్టర్లు పిల్లల గురించి ఆరాతీశారు. కొందరు తల్లిదండ్రులు పిల్లల ఆనవాళ్లు గుర్తించి తమకు అప్పగించాలని కోరినా ‘పిల్లల డీఎన్‌ఏ నమూనాలు సేకరించి..వివరాలు సరిపోయిన పక్షంలో న్యాయప్రక్రియ పూర్తిచేసి అప్పగించాలని’ ఇప్పటికే కమిటీ నిర్ణయించింది. జిల్లా వైద్య అధికారుల బృందం పిల్లలను పరిశీలించి వైద్యపరీక్షలు నిర్వహించింది. మానసిక పరిస్థితిని అంచనా వేసింది.

Related posts

Leave a Comment