ప్రగతి నివేదన సభ సూపర్ సక్సెస్

జనజాతర.. జన సముద్రం.. చీమలదండులా కదిలిన లక్షల మంది ప్రజలు.. సభా ప్రాంగణమే కాదు ఎటు చూసినా.. ఏ వైపు చూసినా ప్రభంజనమే. ఆదివారం కొంగరకలాన్‌లో కనిపించిన దృశ్యమిది. టీఆర్‌ఎస్ పార్టీపై ప్రేమతో, ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే అభిమానంతో, తెలంగాణ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందామన్న కృతజ్ఞతతో కొందరు, ఏండ్లుగా ఎదురుచూసిన సమస్యలు తెలంగాణ వచ్చాక పరిష్కారమయ్యాయన్న ఆనందంలో మరికొందరు.. ఇలా రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ప్రగతి నివేదన సభకు హాజరయ్యారు. 31 జిల్లాల నుంచి లక్షల మంది జనం పోటెత్తారు. ప్రగతి నివేదన సభలోని 13 గ్యాలరీలు పూర్తిగా నిండిపోయాయి. మూడు కిలోమీటర్ల దూరం వరకు ఉన్న కలెక్టరేట్ రహదారి కిక్కిరిసిపోయింది. 480 ఎకరాల్లోని సభాప్రాంగణం పూర్తిగా నిండటంతో ప్రజలు రోడ్లపైనే నిలబడి ఎల్‌ఈడీ స్క్రీన్లలో సీఎం ప్రసంగాన్ని వీక్షించారు.
అందరి అంచనాలను మించి తెలంగాణ రాష్ట్ర సమితి ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభ సూపర్ సక్సెస్ అయింది. సాధారణంగా అధికారపార్టీ సభ పెట్టిందంటే జనాన్ని తోలుకురావడమే ఉండేది. సమైక్యపాలనలో కాం గ్రెస్, టీడీపీల హయాంలో సభలు పెడితే జనంలో ఉత్సాహమే ఉండేది కాదు. కానీ, ఆదివారం నాటి సభలో భిన్నమైన పరిస్థితి కనిపించింది. చిన్న, పెద్ద తేడాలేదు. ఉద్యోగి, రైతు అన్న భేదం కనిపించలేదు. ఒంటరి మహిళలు, రైతులు, యువతీయువకులు, కొత్తగా ఉద్యోగాలు పొందినవారు, రైతు బీమా అం దుకున్న కుటుంబాలు.. వివిధ కులాలు, మతాల ప్రజలు.. ఇలా ఒకరు కాదు.. సకల సబ్బండ వర్ణాలు సభకు వచ్చాయనడంలో అతిశయంలేదు. తండాలను గ్రామపంచాయతీలుగా చేసినందుకు కృతజ్ఞతగా ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల నుంచి పెద్దఎత్తున లంబాడీలు, గోండులు తరలివచ్చారు. తమ అభిమానాన్ని గుండెలనిండా చాటుకోవడానికి నృత్యాలు చేశారు. ఆదివాసీలు తమ ప్రత్యేక వస్త్రధారణతో వచ్చి ఉదయం నుంచి సభ మొదలయ్యేవరకు నృత్యాలు చేశారు. గోండులు గుస్సాడీ నృత్యాలు చేయడంతోపాటు మంత్రి కేటీఆర్‌తోను తమ ఆనందాన్ని పంచుకున్నారు. ధన్యవాదాలు తెలిపారు. సెల్ఫీలు దిగారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా కమ్మరి, కుమ్మరులు, విశ్వబ్రాహ్మణులు, రజకులు, యాదవులు భారీ సంఖ్యలో సభకు వచ్చారు. యాదవులైతే తమకు ప్రభుత్వం ఇచ్చిన జీవాలను పట్టుకొని మరీ వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతోనే తమ జీవితాలు బాగుపడ్డాయని ఆనందం వ్యక్తంచేశారు. మహబూబ్‌నగర్ నుంచి వచ్చిన రాములుయాదవ్ నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ తన జీవితానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడని చెప్పారు. తనకు జీవాలను ఇచ్చారని, కొత్త జీవితాన్ని కూడా ఇచ్చారని ఆనందంగా చెప్పాడు. గొర్రెలకు ఇప్పుడు పిల్లలు పుట్టాయని, తన ఆస్తి రెండు రెట్లు పెరిగిందన్నాడు. కరీంనగర్ నుంచి వచ్చిన అంగన్‌వాడీ టీచర్ ఉమ మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తలంటే గత ప్రభుత్వాలకు అలుసుగా ఉండేదని, కానీ, ఇప్పుడు ఆత్మగౌరవంతో బతుకుతున్నామని, కేసీఆర్ తమ జీతాలు పెంచారన్న అభిమానంతో, సొంత ఖర్చులతో సభకు వచ్చానని చెప్పారు.
కొందరు యువకులు తమ తలపై జుట్టును తొలిగించుకొని కేసీఆర్, టీఆర్‌ఎస్ అని రాయించుకున్నారు. యువకులు సభ మొత్తం కలియతిరుగుతూ నాయకులతో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా కనిపించారు. సాధారణంగా రాజకీయపార్టీల సభలంటే మహిళల హాజరు తక్కువగా ఉంటుంది. కానీ, ప్రగతి నివేదన సభకు భారీఎత్తున మహిళలు హాజరయ్యారు. టీఆర్‌ఎస్ పార్టీ పట్ల మహిళలకున్న ప్రేమాభిమానాలకు ఇదో నిదర్శనంగా చెప్పవచ్చు. సభలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది. వేదిక వద్ద కళాకారుల ఆటపాటలకు అనుగుణంగా వేల మంది గొంతు కలిపారు. నల్లగొండ నుంచి వచ్చిన టీచర్ల బృందం బతుకమ్మ ఆట ఆడింది. యువకులు కోలాటాలాడారు. జాతరకు వెళ్లేటపుడు ఎంతటి ఆనందం ఉంటుందో.. అలాం టి ఆనందం ప్రగతినివేదన సభలో అడుగడుగునా కనిపించింది. ఇక సీఎం కేసీఆర్ తన ప్రసంగం ప్రారంభించిన వెంటనే సభికులంతా హర్షధ్వానాలతో ఆహ్వానం పలికారు. కేసీఆర్ సభావేదికపైకి రావడంతోనే లేచి నిల్చొని తమ గౌరవాన్ని చాటుకున్నారు. ఢిల్లీ గద్దెలకు బానిసలుగా ఉంటారా..? గులాంలుగా ఉంటారా..? గులాబీలుగా ఉం టారా..? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించడంతో సభలోని వారంతా గులాబీలుగానే ఉంటామంటూ నినదించారు.

సాధారణంగా ప్రజల నుంచి ఈ స్థాయిలో స్పందనలు రావడం తక్కువగా ఉం టుంది. అలాంటిది ఒక్కసారిగా పెద్దఎత్తున తమ ఆమోదం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నపుడు కూడా ఆయా పథకాల ద్వారా లబ్ధి పొందినవారు లేచి నిల్చొని తమ హర్షాతిరేకాలను వ్యక్తంచేశారు. దూరప్రాంతాల నుంచి వచ్చినవారు తమ వెంట ఫలహారం డబ్బాలు తీసుకొని రావడం కనిపించింది. అక్కడక్కడ చెట్ల కింద కూర్చొని తిన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేసిన కార్యక్రమాల వివరాలతో రూపొందించిన ప్రగతినివేదిక బుక్‌లెట్‌ను కూడా చాలా మంది ఆసక్తిగా చదవడం కనిపించింది. మొత్తంగా సభలో ఉత్సాహం ఉరకలెత్తింది. ఉదయం ఎప్పుడో బయల్దేరినప్పటికీ సాయంత్రం వరకు ఎంతో ఆసక్తిగా సీఎం ప్రసంగం కోసం ప్రజలంతా ఎదురుచూశారు. సభ చివరలో మళ్లీ ఆశీర్వదించండి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించేవరకు ఎక్కడివారు అక్కడే ఉండి ఆసక్తిగా తిలకించడం అబ్బురమే.

Related posts

Leave a Comment