పోలీసు శాఖ, సచివాలయాల్లో ఉద్యోగాలంటూ మోసం

పోలీస్‌శాఖతో పాటు సచివాలయంలోని పొరుగుసేవల విభాగంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఘరానా మోసగాళ్లు అభ్యర్థులను మోసం చేస్తున్నారు. పోలీసులయ్యేందుకు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు ఇవ్వాలని, శారీరక పరీక్షలు ఉత్తీర్ణులైతే చాలు.. మిగిలిందంతా తాము చూసుకుంటామని చెబుతున్నారు. సచివాలయంలో ఉద్యోగం ఇప్పించాలంటే రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలు చెల్లించాలంటూ వివరిస్తున్నారు. ఒకరిద్దరు కాదు… పదుల సంఖ్యలో మోసగాళ్లు ముఠాలుగా ఏర్పడి ఇదంతా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడం, కొన్ని సందర్భాల్లో పోలీసులే స్వయంగా సమాచారం సేకరించడంతో ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. నగరంలో ఇలాంటి మోసాలు ఎవరెవరు చేస్తున్నారన్న అంశాలపై పోలీసులు రహస్యంగా పరిశోధన చేస్తున్నారు. హిమాయత్‌నగర్‌, సికింద్రాబాద్‌, లక్డీకాపూల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, పంజాగుట్ట ప్రాంతాల్లో నేరస్థులు ఉంటున్నారని ప్రాథమిక ఆధారాలు సేకరించారు.

పత్రికలు… టీవీల్లో రాగానే…
పత్రికలు… టీవీల్లో ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు రాగానే నేరస్థులు రంగంలోకి దిగుతున్నారు. పొరుగుసేవలు, ఒప్పంద పద్ధతుల్లో ఉద్యోగ ప్రకటనలున్నా వెంటనే వాలిపోతున్నారు. మాకు ఫలానా వారు తెలుసు… ‘మొన్నే… డిప్యూటీ సీఎం సార్‌ దగ్గరికి పోయినం… పీఏతో మాట్లాడాలని చెప్పారు…’, ‘మరో సార్‌ బంధువు మా ఇంటిపక్కనే ఉన్నాడు… మనోళ్లు ఎవరైనా ఉంటే ఉద్యోగం ఇప్పించాలని చెప్పాడు…’ అంటూ మాట్లాడుతున్నారు. అక్కడున్న ఉద్యోగార్థుల్లో కనీసం నలుగురైదుగురు ఆసక్తి ప్రదర్శించినా చాలు… నేరస్థుల పంట పండినట్టే. మోసగాళ్లతో మాటలు కలిపిన వెంటనే ఎక్కడ ఉద్యోగాలున్నాయో… సంబంధిత శాఖల దగ్గరకు వెళ్తారు. ఆయా కార్యాలయాలకు నిరుద్యోగులనూ తీసుకువెళ్తారు. వారిని బయటే ఉండాలని చెప్పి… కార్యాలయాల లోపలికి వెళ్లి… కొంత సేపు అక్కడ గడిపి… బయటకు వస్తారు. ఒకటి, రెండురోజుల పాటు నిరుద్యోగులకు సంబంధించిన ఖర్చునూ వీరే భరిస్తున్నారు. నమ్మకం కుదిరిన వెంటనే డబ్బు గురించి మాట్లాడుకుని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. మరింత నమ్మకం కల్పించేందుకు తమ ముఠాలోని ఒక సభ్యుడిని ప్రభుత్వ అధికారిగా నమ్మించి మాట్లాడిస్తున్నారు.

బాధితులు… పోలీసులకు దొరక్కుండా..
నిరుద్యోగుల నుంచి నగదు తీసుకున్న అనంతరం మోసగాళ్లు ఎక్కడా సాక్ష్యాధారాలు దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకోవడం కాకుండా డబ్బును నేరుగా తీసుకుంటున్నారు. నగదును సంచులు, కాగితాల్లో చుట్టి తీసుకురావాలంటూ సూచిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా పొరుగుసేవలు, తాత్కాలిక ఉద్యోగాలకు సంబంధించినవైతే తప్పుడు నియామక పత్రాలను వాట్సాప్‌లలో పంపుతున్నారు. వాట్సాప్‌లో పంపిన ఉత్తర్వుల కాపీ తీసుకుని సంబంధిత శాఖలకు వెళితే ఉద్యోగాల్లో చేర్చుకుంటారని నమ్మిస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగమైనా వచ్చిందంటూ సంతోషంతో ఉద్యోగార్థులు ఆ ఉత్తర్వులను తీసుకుని సదరు విభాగాలకు వెళ్తున్నారు. అసలు అలాంటి ఉద్యోగాలే లేవంటూ అక్కడి అధికారులు చెప్పాక… తాము మోసపోయామని గ్రహించిన అభ్యర్థులు… పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఏడాది వ్యవధిలో రవాణా, సాగునీటి పారుదల, విద్యుత్‌, పోలీస్‌, రెవెన్యూ శాఖల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ ఘరానా మోసగాళ్లు 153 మందిని మోసం చేశారని పోలీసులు తెలిపారు. ఇటీవల చిక్కిన నేరస్థుల వివరాలను సేకరిస్తే… కొందరు బాధితులు మరీ అమాయకంగా మోసపోయారని వివరించారు.

మోసగాళ్ల మోసాలిలా…
* కూకట్‌పల్లికి చెందిన ప్రేమ్‌సాగర్‌ సచివాలయంలోని రెవెన్యూ శాఖలో ఉద్యోగాలిప్పిస్తానంటూ ఒక్కొక్కరి దగ్గర రూ.5 లక్షల చొప్పున 22 మంది నుంచి రూ.1.10 కోట్లు తీసుకున్నాడు. ప్రభుత్వ కార్యదర్శి కె.రాజశేఖర్‌ రెడ్డి పేరుతో బోగస్‌ నియామక పత్రాలు ఇచ్చాడు. రూ.5 లక్షలు ఇచ్చిన నాగమణి అనే యువతి ఈ నెల 7న విధుల్లో చేరేందుకు సచివాలయానికి వెళ్లగా.. నకిలీ నియామక పత్రం అని తేలింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రాసుకుని 24 గంటల్లో ప్రేమ్‌సాగర్‌ను అరెస్ట్‌ చేశారు.

* రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఇద్దరు మోసగాళ్లు ఎస్‌.వెంకటేశ్వర్‌రెడ్డి, కె.చంద్ర మోగిలి… పదుల సంఖ్యలో నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో డబ్బు వసూలు చేశారు. డబ్బు తీసుకున్న రోజు నుంచి వీరు ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేయడంతో బాధితులకు అనుమానం వచ్చి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను ఆశ్రయించారు.
* హైదర్‌గూడలో ఉండే మరో ఘరానా నేరగాడు సందీప్‌ అర్వా పోలీస్‌ శాఖ, సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 38 మంది నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూళ్లు చేసుకున్నాడు. ఉద్యోగాలు ఏవని డబ్బు ఇచ్చిన వారు ప్రశ్నించగా… ఇస్తానంటూ తప్పించుకుని తిరుగుతున్నాడు. గత ఏడాది అక్టోబరులో సందీప్‌ను అరెస్ట్‌ చేశారు. తనకు భారతీయ వైద్యమండలిలో తెలిసిన వారున్నారని, చైనాలో ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పిస్తానంటూ డబ్బు దండుకున్నాడు. ఇతడిపై అయిదు కేసులు వేర్వేరు పోలీస్‌ ఠాణాల్లో ఉన్నాయి.

Related posts

Leave a Comment