పోటీపరీక్షల అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ

కేంద్ర సంస్థల్లో రాష్ట్ర ప్రాతినిథ్యం పెంచేలా చూస్తాం
టి-శాట్‌ వార్షికోత్సవంలో మంత్రి కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో తెలంగాణ ప్రాతినిథ్యం పెంచేలా పోటీపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన శిక్షణ అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఉన్నత విద్యామండలి, టి-శాట్‌, ఐటీ విభాగంతోపాటు అవసరమైన అన్ని శాఖల సహకారంతో ముందుకెళ్లే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గురువారం టి-శాట్‌ మొదటి వార్షికోత్సవాలను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేటీఆర్‌ మాట్లాడుతూ ‘కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన సీఐఎస్‌, రైల్వే, స్టాఫ్‌ సెలక్షన్‌, ఆర్మీ ఇలా వివిధ విభాగాల్లో తెలంగాణ నుంచి ఎంపికవుతున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. వీటిలో రాష్ట్ర వాటా పెంచేందుకు నాణ్యమైన శిక్షణను, అవసరమైన సామగ్రిని అందించాలని యోచిస్తున్నాం. ఉన్నత విద్యామండలి, టి-శాట్‌, ఐటీ విభాగాలతో కలిసి 31 జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లి శిక్షణనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా నైపుణ్యం, విద్య, శిక్షణపై ప్రధాన దృష్టి సారిస్తుంది. టి-శాట్‌ యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యాప్స్‌ ద్వారా ముందుకెళ్తుంది.మధ్యతరగతి ప్రజలు పిల్లల చదువు కోసం ప్రైవేటు శిక్షణలు, మెటీరియల్‌, ట్యూషన్ల పేరుతో లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వారికి ఆర్థిక భారం తగ్గించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను, పరిజ్ఞానాన్ని అందించేందుకు టి-శాట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలంగాణ రాష్ట్రానికి ఒక ఉపగ్రహం (శాటిలైట్‌) ఉంటే బాగుంటుందనీ ఆలోచించాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యుల చెంతకు తీసుకెళ్లినప్పుడే సార్థకత. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన కూడా అదే’ అని కేటీఆర్‌ అన్నారు. అంతకుముందు ఎస్వీబీసీ ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలుచేస్తున్న ప్రాంతానికి కేటీఆర్‌ వెళ్లారు. అక్కడే ఉన్న దర్శకుడు, ఎస్వీబీసీ ఛైర్మన్‌ రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు కీరవాణిని కలిశారు. కార్యక్రమంలో టి-శాట్‌ ప్రతినిధి, సాఫ్ట్‌నెట్‌ సీఈవో శైలేష్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment