పేట నుంచి నగర్‌కు.. ప్రయాణికుల సంఖ్య రెట్టింపుపై మెట్రో అధికారుల అంచనాలు

మెట్రో రైలు అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్‌ వరకు ప్రారంభమైతే ప్రయాణికుల సంఖ్య రెండింతలవుతుందని మెట్రో వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం మియాపూర్‌ నుంచి అమీర్‌పేట-నాగోల్‌ వరకు 30 కి.మీ. మార్గంలో నిత్యం 70వేల నుంచి 80వేల మంది వరకు ప్రయాణిస్తున్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చే మరో 16 కి.మీ. మార్గంతో ప్రయాణికుల సంఖ్య లక్షా 30వేల నుంచి లక్షా 40వేల వరకు పెరుగుతుందని అంటున్నారు.
మెట్రోరైలులో ప్రస్తుతం నడుస్తున్న మార్గాలు రెండు వేర్వేరు కారిడార్లలోనివి. కారిడార్‌-1లోని మియాపూర్‌-ఎల్బీనగర్‌ మార్గంలో అమీర్‌పేట వరకు దాదాపు 13 కి.మీ., కారిడార్‌-3 నాగోల్‌ నుంచి రాయదుర్గం మార్గంలోని మరో 17 కి.మీ. అందుబాటులోకి వచ్చింది. దీంతో అమీర్‌పేటలోని ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌లో ప్రయాణికులు మరో రైలు మారాల్సి వస్తోంది. ఈ నెలాఖరు నాటికి సిద్ధం అవుతున్న ఎల్బీనగర్‌ 16కి.మీ. అందుబాటులోకి వస్తే మియాపూర్‌ నుంచి వెళ్లే ప్రయాణికులు ఎల్బీనగర్‌ వరకు నేరుగా ప్రయాణించవచ్చు. ఈ కారిడార్‌ సిటీలో ఒకవైపు శివారు నుంచి మరోవైపు శివారు ప్రాంతాలను నగరం మధ్య నుంచి కలుపుతూ వెళ్తుంది. దూర ప్రాంతాలకు వెళ్లే బస్‌ స్టేషన్‌(ఎంజీబీఎస్‌) సైతం ఇదే కారిడార్‌లో ఉండటంతో ఎక్కువ మంది ప్రయాణికులు వినియోగిస్తారని అంచనా వేస్తున్నారు. సిటీలో నిత్యం వేలాది మంది ప్రైవేటు ట్రావెల్స్‌లో ప్రయాణం చేస్తుంటారు. వీరంతా ప్రస్తుతం రాత్రి 10 గంటల తర్వాత సిటీలోని వేర్వేరు ప్రాంతాల నుంచి బయలుదేరి వెళ్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌ వీరిని మియాపూర్‌, కూకట్‌పల్లి, మూసాపేట, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట, లక్డీకాపూల్‌, నాంపల్లి, ఎల్బీనగర్‌ ప్రాంతాల్లో ఎక్కించుకుని బయలుదేరుతున్నాయి. దీంతో సిటీ దాటేందుకు రెండు గంటల సమయం వృథా అవుతోంది. మెట్రో వచ్చాక ప్రైవేటు వాహనాలను శివార్లకే పరిమితం చేసే ఆలోచన ఉండటంతో వీరంతా మెట్రోలో ఎల్బీనగర్‌ వరకు చేరుకుంటే అక్కడి నుంచి వేగంగా గమ్యస్థానం చేరుకోవచ్చు. అదే సమయంలో నిత్యం ఉదయం దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం ప్రాంతాల నుంచి మియాపూర్‌, బీహెచ్‌ఈఎల్‌ వరకు ఉద్యోగులు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. చాలామంది ఆర్టీసీ బస్సుల్లో వెళ్తుండగా.. కొన్ని సంస్థలు ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సు సదుపాయం ఏర్పాటు చేశాయి. బస్సు సదుపాయం కల్పిస్తున్న సంస్థలు సైతం మెట్రోకి మారేందుకు ఛార్జీల వివరాలను ఆరాతీస్తున్నాయి. వీటన్నింటిని బేరీజు వేస్తున్న మెట్రో వర్గాలు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్‌ మార్గంలోని 16 స్టేషన్లలో ఎల్బీనగర్‌, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎంజీబీఎస్‌, ఉస్మానియా వైద్యకళాశాల, గాంధీభవన్‌, నాంపల్లి, లక్డీకాపూల్‌, పంజాగుట్ట స్టేషన్లలో ప్రయాణికుల ఆదరణ బాగుంటుందనే అంటున్నారు.

ఆరు స్టేషన్లలోనే ఎక్కువ.. ప్రస్తుతం మెట్రో నడుస్తున్న 30 కి.మీ. మార్గంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రయాణికులు ఐదారు స్టేషన్ల నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. మొదట ఊహించినట్లుగా అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌ నుంచి అత్యధికమంది నిత్యం ప్రయాణిస్తున్నారు. ఆరంభ స్టేషన్లు అయిన మియాపూర్‌, నాగోల్‌లోనూ బాగానే ఎక్కుతున్నారు. జేఎన్‌టీయూ, కేపీహెచ్‌బీ నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. ఉప్పల్‌, సికింద్రాబాద్‌ ఈస్ట్‌ స్టేషన్‌ నుంచి కూడా రాకపోకలు బాగున్నాయి.

సుఖమైన ప్రయాణం..
నేను నాగోల్‌ నుంచి కూకట్‌పల్లి నిత్యం వెళ్తుంటాను. ఇదివరకు ఇతర వాహనాల్లో వెళితే చాలా సమయం పట్టేది. ఇప్పుడు 50 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటున్నాను. ఏసీ కూడా ఉండటంతో అలసట లేకుండా ఒత్తిడి లేకుండా ప్రయాణం సాగిపోతుంది.

Related posts

Leave a Comment