పెళ్లూరు సంస్థానంలో కొలువులు… ఆ ఇద్దరూ లేకున్నా నిజం బతికుంది..

కరుణానిధి పూర్వీకులు తెలుగువారే… ఆయనకు ముందు రెండు తరాల కిందటివారు ఒంగోలులోనే ఉన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు ఆనుకుని ఉన్న చెర్వుకొమ్ముపాలెంలోనే కరుణానిధి పూర్వీకులు నివాసం ఉండేవారు. పెళ్లూరు సంస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా పనిచేసేవారు.. ఇవి స్వయానా కరుణానిధి చెప్పిన మాటలే… అయితే ఆ మాటలు చెప్పిన కరుణానిధిగానీ, వాటిని ఆలకించిన డిటెక్టిల్‌ నవలా రచయిత కొంపల్లి బాలకృష్ణగానీ ప్రస్తుతం మన మధ్య లేరు. కానీ బాలకృష్ణ తన సతీమణి తేళ్ల అరుణతో ఈ విషయం చెప్పారు. వాటిని ఆమె ‘ఈనాడు’తో పంచుకున్నారు.

కరుణానిధికి నవలలు, నవలా రచయితలు అంటే విపరీతమైన అభిమానం. అందులోనూ డిటెక్టివ్‌ నవలలను విపరీతంగా ఇష్టపడేవారు. అది 1960ల ఆరంభం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో డిటెక్టివ్‌ నవలా రచయితల సమావేశం జరిగింది. ఈ సభకు ఒంగోలు నుంచి కొంపల్లి బాలకృష్ణ హాజరయ్యారు. ఆయన డిటెక్టిల్‌ నవలా రచయిత. విద్యార్థిగా ఉంటూనే పదహారేళ్ల వయసులోనే నవలలు రాసేవారు. ఈ క్రమంలోనే ఏలూరు నుంచి ఆహ్వానం అందడంతో వెళ్లారు. ఆ సభకు కరుణానిధి వచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తనను తాను పరిచయం చేసుకున్నారు. తాను ఒంగోలు నుంచి వచ్చానని కరుణకు చెప్పారు. వెంటనే కరుణ నవ్వుతూ… ‘ఒంగోలా… అయితే మా వాడివే. ఎలా ఉంది ఒంగోలు? మాదీ ఒంగోలే. మా ముత్తాత పెళ్లూరు సంస్థానంలో విద్వాంసులుగా పని చేశారు. తర్వాత పరిస్థితులు బాగాలేక మద్రాసుకు వలస వెళ్లిపోయారు. అక్కడే స్థిరపడ్డాం’ అంటూ చెప్పుకొచ్చారు. ఆ సభ అనంతరం బాలకృష్ణ ఒంగోలు వచ్చి ఆ విషయం అందరికీ చెప్పారు. ఆయన ఒంగోలులోని మంగమ్మ డిగ్రీ కళాశాలలో ప్రధానాచార్యుడిగానూ పని చేశారు. తరచూ తన సన్నిహితుల వద్ద కరుణానిధి చెప్పిన మాటలను చెప్పేవారు. నాలుగేళ్ల కిందట బాలకృష్ణ మరణించారు. తాజాగా కరుణానిధి మరణించారు. కానీ బాలకృష్ణ తన సన్నిహితుల వద్ద చెప్పిన ఈ విషయాలు బయటకు వచ్చాయి. ‘బాలకృష్ణ మంచి నవలా రచయిత. ఏలూరు సభ సందర్భంగా కరుణానిధి ఆయనతో మాట్లాడారు. తమ పూర్వీకులది ఒంగోలు సమీపంలోని చెర్వుకొమ్ముపాలెమని, పెళ్లూరు ఆస్థానంలో పనిచేసేవారని’ చెప్పారు. ఈ విషయాలను తరచూ బాలకృష్ణ మా అందరితో పంచుకునేవారు’ అని బాలకృష్ణ భార్య తేళ్ల అరుణ పేర్కొన్నారు.

Related posts

Leave a Comment