పెద్దపల్లి లో కాయ్ రాజా..కాయ్..

ముందస్తు ఎన్నికలు తెలంగాణ నేతలను మాంచి బిజీగా మార్చేశాయి. ప్రస్తుతం అంతా ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక పందెం రాయుళ్లు కూడా జోరు పెంచారు. ఎలక్షన్ రిజల్ట్‌ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తూనే పందాలు కాస్తున్నారు. మొత్తంగా నేతల గెలుపోటములను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలపైనే కాక.. నేతలకు ఎంత మెజార్టీ వస్తుంది. సుమారుగా అభ్యర్ధులకు పోలయ్యే ఓట్లు, ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉండొచ్చనే అంశాలపై బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. ప్రస్తుత ఎన్నికలు చాలా ఆసక్తికరంగా సాగాయి. పోల్ పర్సంటేజ్ పెరిగింది. దీంతో ఏ ఒక్కరూ తమదే గెలుపని ధీమాగా ఉండలేని పరిస్థితి. పోల్ సర్వేలు కూడా తమదైన రిజల్ట్ ఇచ్చినా తుది తీర్పు ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నారంతా. ఇంతటి అనిశ్చితిలోనూ బెట్టింగులు జోరుగా సాగుతుండడం సాధారణ జనాలను ఆశ్చర్యపరుస్తోంది. జిల్లాలోని జనం కలుసుకునే ప్రాంతాల్లో గెలుపు, మెజార్టీపై కార్యకర్తలు, యువకులు బెట్టింగ్‌ వేస్తున్నట్లు తెలుస్తోంది. పోటాపోటీగా ప్రచారం చేసుకొని గెలుపు అంచుల్లో ఉన్న ఇద్దరు అభ్యర్థులపై లక్షల వరకు బెట్టింగ్‌ వేసుకుంటున్నట్లు కొందరు అంటున్నారు.

కేఫ్‌లు, బార్‌లతో పాటు గల్లీల్లో జనాలు ఒక్కచోట చేరే ప్రదేశాల్లో పందాల జోరు సాగుతున్నట్లు సమాచారం. పందెం రాయుళ్లు తమ స్థాయిని బట్టి రూ.1000 నుంచి లక్ష వరకు బెట్టింగ్‌ వేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు డబ్బులు బెట్టింగ్‌ వేస్తే మరికొందరు గల్లీల్లో మద్యం బెట్టింగ్‌ వేసుకుంటున్నారు. ఓడిపోయే ఛాన్స్ ఉన్న నాయకులపైనా బెట్టింగ్‌లు సాగుతున్నట్లు సమాచారం. ఓడిపోతారని తెలిసి, స్వతంత్ర అభ్యర్థులకు వచ్చే మెజార్టీ ఎంత వస్తుందనే అంశంపై బెట్టింగ్‌ వేస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోటీ చేసిన నేతలంతా ఎవరికివారు తమదే గెలుపని ప్రకటించుకోవడం, తమకు వచ్చే మెజార్టీని కూడా చెప్తుండడంతో ఆ దిశగా పందాలు సాగుతున్నాయి. మొత్తంగా పలు ప్రాంతాల్లో బెట్టింగ్‌ల మొత్తం రూ.లక్షల్లోనే ఉండొచ్చని టాక్. పందాలు వేసిన వారంతా పోటీ చేసిన అభ్యర్థులతోపాటు ఈనెల 11న జరిగే ఎన్నికల కౌంటింగ్‌ కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉంటే ఈ బెట్టింగ్‌ల గోల ఘర్షణలకు దారి తీయొచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. పందెం సొమ్ము చెల్లించని పక్షంలో ఇలాంటి గొడవలు సంభవిస్తుంటాయి. అందుకే బెట్టింగ్‌లకు కళ్లెం వేయాలని అంతా పోలీసులను కోరుతున్నారు. అయితే.. స్థానికంగా గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్న ఈ పందేల జోరుకు అడ్డుకట్ట వేయడం పోలీసులకూ భారంగానే ఉంది. ప్రజలే ఇలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిదని పలువురు సూచిస్తున్నారు.
Tags: huge betting , pedhapalli,telangana, voting count 2018

Related posts

Leave a Comment