పుణ్యానికి పోతే పాపం.. తెలియని వారికి లిఫ్ట్ ఇచ్చారో.. ఇక ఫైన్ కట్టాల్సిందే!

వర్షంలో తడుస్తున్నారని అజ్ఞాత వ్యక్తులకు లిఫ్ట్
సెక్షన్ 66/192 ప్రకారం తెలియని వ్యక్తులకు లిఫ్ట్ నేరం
రూ.1500 జరిమానా
ముక్కుమొహం తెలియని వారికి లిఫ్ట్ ఇచ్చిన పాపానికి మహారాష్ట్రకు చెందిన కారు యజమాని నితిన్ నాయర్ రూ.1500 జరిమానా కట్టాల్సి వచ్చింది. పోలీసుల చేతిలో తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్‌బుక్‌లో పంచుకున్న నితిన్ వాహనదారులను హెచ్చరించాడు. సాయం చేద్దామనే ఉద్దేశంతో తెలియని వారికి లిఫ్ట్ ఇచ్చి తనలా చిక్కుల్లో పడొద్దని సూచించాడు.

ఈ నెల 18న ముంబై ఐరోలి సర్కిల్‌ మీదుగా తన కారులో వెళ్తున్నాడు. వర్షం పడుతుండడంతో రవాణా సౌకర్యం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో అక్కడ బస్సుల కోసం వేచి చూస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, మరో వృద్ధుడిని తన కారులో ఎక్కించుకుని లిఫ్ట్ ఇచ్చాడు. దీనిని గమనించిన ట్రాఫిక్ పోలీసులు నితిన్ వద్దకు వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని చలానా రాసిచ్చారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫైన్ కట్టి లైసెన్స్ తీసుకెళ్లాలని చెప్పారు.

తర్వాతి రోజు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన నితిన్‌కు కోర్టుకు వెళ్లాలని సూచించారు. కోర్టులో ఫైన్ కట్టి బయటపడ్డాడు. సెక్షన్ 66/192 ప్రకారం అజ్ఞాత వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం నేరమని పోలీసులు చెప్పారని, కాబట్టి ఇకపై ఎవరూ అటువంటి పనులు చేయవద్దని హెచ్చరించాడు.

Related posts

Leave a Comment