పవ(ర్‌)న్‌ చామ్లింగ్‌

ముఖ్యమంత్రిగా 23 ఏళ్ల
138 రోజులు.. నాటౌట్‌
సుదీర్ఘకాల ముఖ్యమంత్రిగా సరికొత్త రికార్డ్‌
దేశ రాజకీయాల్లో ఆదివారం సరికొత్త రికార్డు నమోదైంది. అత్యంత సుదీర్ఘకాలం ఓ రాష్ట్రాన్ని పాలించిన నేతగా సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌చామ్లింగ్‌ చరిత్ర సృష్టించారు. ఇన్నాళ్లు కమ్యూనిష్టు కురువృద్ధుడు జ్యోతిబసు పేరుమీదున్న రికార్డును చెరిపేసి పవన్‌ తన పేరు చరిత్ర పుటల్లో లిఖించుకున్నారు. చామ్లింగ్‌ అధికారం చేపట్టి ఆదివారానికి 23 ఏళ్ల నాలుగు నెలల 17 రోజులవుతుంది. ఇది జ్యోతిబసు పదవీకాలం కంటే ఒకరోజు ఎక్కువ. జ్యోతిబసు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రిగా 1977 జూన్‌ 21నుంచి 2000 నవంబర్‌ 6వరకు ఉన్నారు. పవన్‌చామ్లింగ్‌ 1993లో సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ పేరిట ప్రత్యేకపార్టీ స్థాపించారు. ఏడాదిలోపే అంటే.. 1994 డిసెంబరు 12న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1973లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.. 1985లో తొలిసారి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఒకేసారి వరుసగాకానీ, విడతలవారీగాకానీ అత్యధికకాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తుల జాబితాలో చామ్లింగ్‌ తరువాతి వరుసలో జ్యోతిబసు (23 ఏళ్ల 137రోజులు), మాణిక్‌సర్కార్‌ (20 ఏళ్ల మూడునెలలు), గెగాంగ్‌ అపాంగ్‌ (22 ఏళ్ల 256 రోజులు), ఎం.కరుణానిధి (18 ఏళ్ల 293రోజులు) నిలిచారు.పవన్‌చామ్లింగ్‌ స్వతహాగా కవి. కిరణ్‌ అన్న కలం పేరుతో ఈయన చేసిన రచనలకు 2010లో భానుపురస్కారం లభించింది. ఇద్దరు భార్యలు, నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఈయన కుటుంబం. అరుదైన రికార్డు నమోదుచేస్తున్న సందర్భంగా ఆయన శనివారం తన ఫేస్‌బుక్‌పేజీలో తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఫొటోలతోపాటు సుదీర్ఘ వ్యాసం పోస్ట్‌చేశారు. గొప్పరాజనీతిజ్ఞుడు, అత్యంత గౌరవనీయమైన వ్యక్తి జ్యోతిబసు పేరున ఉన్న రికార్డును తాను అధిగమించడం తన అదృష్టంగా పేర్కొన్నారు.

చామ్లింగ్‌ సిక్కిం రాజకీయాలు, ప్రభుత్వంపై గట్టిపట్టుసాధించారు. ఒకరకంగా చెప్పాలంటే నియంతృత్వ ధోరణిలో వెళ్తున్నారు. సిక్కింలో మరో అధికార కేంద్రం తయారుకాకుండా జాగ్రత్త పడుతున్నారు. సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ ఇదివరకు యూపీయే, ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ తన ఎంపీలెవర్నీ కేంద్రమంత్రులుగా చేయలేదు. భండారీ నేతృత్వంలోని సిక్కిం సంగ్రాం పరిషత్‌ చీలిపోయి కొంత కాంగ్రెస్‌, మరికొంత భాజపాలో విలీనం కావడమే చామ్లింగ్‌ రాజకీయంగా బలపడటానికి దారితీసింది. 2004 నుంచి 2014వరకు జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ బలంగా ఉన్నప్పటికీ సిక్కింలో బలపడలేకపోవడానికి కారణం పవన్‌చామ్లింగ్‌ రాజకీయ చతురతే కారణమన్నది రాజకీయ విశ్లేషకుల భావన. చూడటానికి చాలా మెతకగా కనిపించే చామ్లింగ్‌ సవాళ్లను ఎదుర్కోవడంలో ఛాంపియన్‌. అనిశ్చితి పాలనకు మారుపేరైన ఈశాన్యభారతంలో స్థిరమైన ప్రభుత్వాలు ఇవ్వగల వ్యక్తిగా మంచి గుర్తింపు పొందారు. సేంద్రియ వ్యవసాయాన్ని తప్పనిసరిచేసి వ్యవసాయరంగంలో సరికొత్త పంథా నెలకొల్పారు. రాష్ట్రాన్ని అత్యంత శుభ్రమైన ప్రాంతంగా మార్చి పర్యాటకరంగంలో ఈశాన్యరాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిపారు. సిక్కింను స్విట్జర్లాండ్‌ ఆఫ్‌ ఇండియాగా పిలుచుకొనేలా చేశారు. గ్యాంగ్‌టక్‌ను నేరాలులేని నగరంగా మార్చారు. మరోవైపు చామ్లింగ్‌, ఆయన కుటుంబంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి.

Related posts

Leave a Comment