పవన్‌ కల్యాణ్‌తో చేతులు కలిపాం: సీపీఐ రామకృష్ణ

Full Details of PK meet with CPI Ramakrishna
  • టీడీపీ, వైసీపీ నేతలు డబ్బులతో రాజకీయాలు చేస్తున్నారు
  • డబ్బున్న వాడే ఎమ్మెల్యే అవుతున్నాడు
  • ఇటువంటి పరిస్థితులు పోవాలి
  • ఉభయ కమ్యూనిస్టు పార్టీలు జనసేనతో ముందుకు వెళతాయి

ఏ రాష్ట్రంలోనూ లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఉందని, తెలుగు దేశం పార్టీ లేక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలే రాజకీయంగా ఆధిపత్యంతో ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ రెండు పార్టీల మధ్యే ప్రజలను ఉంచే పరిస్థితి ఉండకూడదని, ‘మీరు అటో ఇటో తేల్చుకోండి మధ్యలో మరో పార్టీ రాకూడద’నేలా ఆ పార్టీలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఈ బైపోలార్‌ సిస్టమ్‌ను బద్దలుకొట్టాలని, అలా చేయకుండా వామపక్ష పార్టీలు ఎదగడానికి వీలుకాదని అన్నారు.

“కూటమి, మహాకూటమి అనే పేర్లు మేము పెట్టలేదు.. కానీ, ఈనెల 20న విజయవాడలో ఓ అజెండా రూపొందించి పలు పార్టీలకు పంపించాం. ఆ పార్టీల్లో జనసేన, లోక్‌సత్తా, సీపీఐ, బహుజన్‌ సమాజ్‌ పార్టీతో పాటు పలుపార్టీలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇలాంటి పార్టీలన్నింటినీ కూడగట్టి ముందుకు వెళతాం. త్వరలోనే సదస్సులు ఏర్పాటు చేస్తాం.

కార్మికుల సమస్యలపై విశాఖపట్నంలో, రైతుల సమస్యలపై గుంటూరులో, విద్యార్థుల సమస్యలపై తిరుపతిలో, మైనార్టీల సమస్యలపై కర్నూలులో, మహిళల సమస్యలపై అనంతపురంలో అన్ని వర్గాల సమస్యలపై పలు ప్రాంతాల్లో చర్చలు జరుపుతాం. వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తున్నాం. సెప్టెంబరు 15న విజయవాడలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తాం. ఓ అజెండాను ప్రజల ముందుకు తీసుకెళతాం.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కూడా ఈ విషయంలో స్పష్టత ఉంది. మేమందరమూ కలిసి ముందుకు వెళతాం. ప్రాంతీయ అసమానతలు పోవాలి. వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ ఇటీవల వైసీపీతో పవన్‌ కలుస్తారని అన్న తరువాత నేను పవన్‌తో మాట్లాడాను. పవన్‌ మేము రూపొందించిన అజెండా ప్రకారమే ముందుకు వెళ్లాలన్న స్పష్టతతో ఉన్నారు.

టీడీపీ, వైసీపీ నేతలు డబ్బులతో రాజకీయాలు చేస్తున్నారు. డబ్బున్న వాడే ఎమ్మెల్యే అవుతున్నాడు. ఇటువంటి పరిస్థితులు పోవాలి. ఉభయ కమ్యూనిస్టుల పార్టీలు పవన్‌ కల్యాణ్‌తో చేతులు కలిపాయి.. జనసేనతో మేము ముందుకు వెళతాం” అని రామకృష్ణ అన్నారు.

Related posts

Leave a Comment