పనిలో కొంచెం సాయం చేయరూ!

ఇలా చెప్పుకుంటూ పోతే… చాలామంది మహిళలు తమ భర్తల సహాయ నిరాకరణ గురించి ఎన్నయినా చెబుతారు కదూ… ఇకపై ఆ ఫిర్యాదులు తగ్గాలంటే…మన ఇళ్లల్లోని మగవాళ్లు సాయం చేసేలా వాళ్లలో స్ఫూర్తిని రగిలిద్దామా…
‘‘ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టరు…’’
‘‘అన్నీ కూర్చున్న చోటికి తీసుకెళ్లి ఇవ్వాలి…’’
‘‘ఓపికలేకపోయినా కూడా నేనే చేయాలి తప్ప సాయం చేయాలనే ఆలోచన ఉండదు…’’
‘తను పొద్దున్నే వంటచేసి ఉద్యోగానికి వెళ్లిపోతే… మిగిలిన పనులన్నీ నేను పూర్తిచేస్తా. వంటింటి గట్టు తుడవడం నుంచీ ఇల్లు సర్దడం, అవసరమైతే కూరలూ, ఇతర సరుకులు తీసుకోవడం… ఇలా అన్నీ పూర్తిచేసి నేను ఆఫీసుకు వెళ్తా. భార్య కూడా ఉద్యోగే కాబట్టి ఇంట్లో ఆ మాత్రం సాయం అందివ్వాలిగా…’ అని అంటారు హైదరాబాద్‌కు చెందిన భాస్కర్‌. కానీ అందరిళ్లలో ఈ పరిస్థితి ఉండదు. ఉదయం అయిదుగంటలకు లేచినా లక్ష్మికి ఓ పట్టాన పని పూర్తికాదు. తాను, భర్త తొమ్మిదిగంటలకు ఆఫీస్‌కు వెళ్లడానికి భోజనం సిద్ధం చేయాలి. అంతకన్నా ముందు తమ ఇద్దరు పిల్లల్ని నిద్రలేపి వారిని తయారుచేసి ఎనిమిది గంటల కల్లా బడికి పంపాలి. తరువాత ఆఫీసు. ఇంత కష్టపడుతున్నా భర్త నుంచి చిన్న సాయం కూడా ఉండదని బాధపడుతుందామె. భర్తను నిద్రలేపడం, చేతికి కాఫీ అందివ్వడం, టిఫిను.. అన్నీ దగ్గరుండి మరీ చేయాల్సిన పరిస్థితి.
సతీమణి నీరసంగా కనిపిస్తే ఎందుకలా రోజంతా పనిచేస్తావు, పనమ్మాయిని పెట్టుకోవచ్చు కదా అనే భర్తలు తరువాత ఆ విషయం మర్చిపోతారు. మరికొందరైతే సాయం చేస్తామని చెబుతారు కానీ చేయరు.. ఇలా సాయం చేయకపోవడానికి కారణాలు ఏవైనా ఆ ప్రభావం ఇంటి ఇల్లాలిపై పడుతుంది. పనిభారం పెరుగుతుందే తప్ప తగ్గదు. అందుకే కాస్తయినా సాయం అందించగలిగితేనే మంచిది. అలాగని ఇంటిపనంతా భుజాన చేయమని చెప్పడం కాదు. చిన్నచిన్న పనులే ఎంతో మార్పు తెచ్చిపెడతాయి.
కూరలు తరగడం మొదలు…
ఆయనపేరు శివరామ్‌. బ్యాంకు మేనేజరు. భార్య టీచరు. ఆదివారం వస్తే చాలు… వంట ఆయనే చేస్తారు. దానివల్ల రెండులాభాలుంటాయని చెబుతారు. వంట చేయడం వల్ల నచ్చిన పదార్థం చేసుకోవచ్చు. భార్య నుంచి మార్కులు కొట్టేయొచ్చు… అని చెబుతారు. నిజమే కదా అలాగని అందరూ వంటింట్లో కష్టపడమని కాదు. మరేం చేయొచ్చు అంటారా…
* వారానికోసారి బజారునుంచి కూరగాయలు తీసుకురావచ్చు. కుదిరితే ఇంటికి త్వరగా వస్తే… వాటిని తరిగి కూడా పెట్టొచ్చు. వంటలో ఇదే పెద్దపని. కుదిరితే వారం లేదా నెలకోసారైనా వంటచేసి మీ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజుల్లో ఇది ప్యాషన్‌ కూడా. ఆలోచించండి.
* ఇంటిల్లిపాదికి సంబంధించిన దుస్తులన్నీ ఉతకాలని లేదు. ఉతికినవాటిని తెచ్చి లోపల పడేయడమూ సాయమే.
* పండగల సమయంలో భార్య ఇల్లు సర్దుతోందా… బూజులు ఎందుకు దులపకూడదు!
* పిల్లల బాధ్యత అయితే ఇద్దరూ తీసుకోవాల్సిందే. చదువు చెప్పడం ఇద్దరి పనీ అనుకోవాలి.
* పనుల విషయంలో ఏవరేం చేయాలనే ప్రణాళిక ఉంటే… ఏ సమస్యా ఉండదు. ఇంటిపనినీ ఓ ఉద్యోగంలా భావిస్తే ఏ సమస్యలూ ఉండవు. ఇలా పనుల్ని పంచుకోవడం వల్ల లాభాలూ లేకపోలేదు.
భార్యభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. భార్య ఉద్యోగం చేస్తున్నా, చేయకపోయినా ఆమెకంటూ కొంత సమయం, విశ్రాంతి కల్పించినవారవుతారు. పని ఒత్తిడి తగ్గడం వల్ల ఆమె నుంచి రుసరుసలూ, కోపాలూ, అలకల ప్రభావం తగ్గుతుంది. ఒత్తిడి వల్ల వచ్చే అనారోగ్యాలకూ చెక్‌ పెట్టొచ్చు. దీంతో ఇంటివాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. ప్రయత్నించి చూడండి.

Related posts

Leave a Comment