పడవ ప్రమాదాలు పెద్ద సమస్యగా మారాయి…చంద్రబాబు నాయుడు

అమరావతి: రాష్ట్రంలో పడవ ప్రమాదాలు మరో పెద్ద సమస్య మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జల సంరక్షణ, జల నియంత్రణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వంశధార వరదలో చిక్కుకున్న కూలీలను రక్షించిన సిబ్బందిని ఆయన అభినందించారు. విపత్తు నిర్వహణ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంగా పనిచేశారని… ఆర్టీజీ సకాలంలో స్పందించి అన్ని శాఖలను అప్రమత్తం చేసిందని… ఇదే స్ఫూర్తి భవిష్యత్తులో కూడా కనిపించాలని సూచించారు. ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఖరీఫ్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం సూచించారు.

నీరు – ప్రగతి, వ్యవసాయం పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రంలో రిజర్వాయర్లు అన్నింటిలో నీటిని నిల్వ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, సోమశిల, కండలేరు జలాశయాలపై దృష్టిపెట్టాలన్నారు. ఈ రోజుతో ప్రభుత్వం ఏర్పడి 1500రోజులు పూర్తయ్యిందని ప్రజాసేవకు పునరంకితం అయ్యేందుకు ఇదొక అవకాశం అని సీఎం వ్యాఖ్యానించారు. దీని ద్వారా అధికార యంత్రాంగం ప్రజల్లోకి వెళ్లి అన్నివర్గాల సమస్యలను పరిష్కరించాలన్నారు. చేసిన పనులను సమీక్షించి ఇంకా అవసరాలను తెలుసుకోవాలన్నారు.

2019-24 విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ‘గ్రామదర్శిని-గ్రామ వికాసం’ విజయవంతం చేయాలన్నారు. వారానికి రెండు రోజులు అధికారులు పాల్గొని ప్రజల వద్ద వినతులు స్వీకరించాలని.. గతంలో ఇచ్చిన అర్జీల పురోగతిని వివరించాలన్నారు. రిజర్వాయర్లలో నీటి నిల్వ, ఇన్ ఫ్లోను అధికారులు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం భూగర్భజలం 12.33మీటర్ల దిగువన ఉందని నవంబర్ కల్లా మరో 9మీటర్లు ఎగువకు రావాలని.. వర్షాకాలం పూర్తయ్యేటప్పటికి 3మీటర్లకు భూగర్భజలం చేరాలని సీఎం అన్నారు. అందుకు తగ్గట్లుగా జల సంరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఒకచోట కరవు, మరోచోట వరదలు రాష్ట్రాభివృద్ధికి పెద్ద ఆటంకాలని పేర్కొన్నారు.

Related posts

Leave a Comment