నేడు యోగా దినోత్సవం

-దేశ, విదేశాల్లో ఏర్పాట్లు చేసిన ఆయుష్ మంత్రిత్వశాఖ
-యోగాను రాజకీయ పనిముట్టుగా వాడుకోవద్దంటున్న ముస్లిం సంఘాలు

న్యూఢిల్లీ: నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గురువారం జరుపుకొనేందుకు సర్వం సిద్ధమైంది. దేశంలోని పలు ప్రాంతాలతోపాటు విదేశాల్లో కూడా యోగా దినోత్సవాన్ని మూడేండ్లుగా జూన్ 21న నిర్వహిస్తున్నారు. ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజుగా ప్రాధాన్యం ఉండటంతో ఈ రోజునే అంతర్జాతీయ యోగా దినంగా జరుపుకోవాలని ఐరాస సాధారణ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోదీ 2014లో ప్రతిపాదించారు. ఈ మేరకు నాలుగేండ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుతున్నారు. గురువారం దేశవ్యాప్తంగా ఐదువేల కేంద్రాల్లో ఒకేసారి యోగాసనాలు చేసేందుకు కేంద్ర ఆయుర్వేద, యోగా అండ్ నేచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి (ఆయుష్) మంత్రిత్వశాఖ ఏర్పాట్లు చేసింది. ఈసారి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగే కార్యక్రమంలో దాదాపు 55 వేల మందితో కలిసి ప్రధాని మోదీ యోగాసనాలు వేస్తారు. సియాచిన్‌లో సైనికస్థావరంలో సైనికులతో కలిసి పద్మవిభూషణ్ సద్గురు జగ్గీవాసుదేవ్.. యోగాసనాలు వేస్తారు.

రాజస్థాన్‌లోని కోటాలో ప్రముఖ యోగా గురువు రాందేవ్‌బాబా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా నిర్వహించే యోగా కార్యక్రమాల్లో రాజకీయ, వ్యాపార, సినీరంగ ప్రముఖులు పాల్గొంటారు. శాంతి కోసం యోగా అనే నినాదంతో ఈ ఏడా ది యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆరోగ్యం, శ్రేయస్సుకు సంపూర్ణ విధానం యోగా.. ఇది వ్యాయామం కాదు, వ్యక్తిలోని ఐక్యతాభావాన్ని ఆవిష్కరిస్తుందని ట్విట్టర్‌లో ప్రధాని మోదీ వీడియో సందేశం పంపారు. మరోవైపు యోగాను రాజకీయ పనిముట్టుగా వాడటంగానీ, ఏ ఒక్క జనసమూహంతో కలిపిగానీ చూడొద్దని పలు ముస్లిం సంఘాలు సూచించాయి. ఆరోగ్యంగా ఉండేందుకు చేసే వ్యాయామాల్లో యోగా ఎంతో ప్రముఖమైనది. తప్పనిసరిగా చేయాలనటం మాత్రం తగదు అని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎమ్పీఎల్బీ) అధికార ప్రతినిధి సజ్జాద్ నోమాని అన్నారు. యోగాను సంపూర్ణంగా ఆచరిస్తే అది ప్రాణాంతక వ్యాధులనుంచి కాపాడే సామర్థ్యాన్ని పెంచుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొన్నది. అంటువ్యాధులు కాని ప్రా ణాంతక వ్యాధుల్ని తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యాన్ని యోగా వృద్ధిచేస్తుందని డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్ క్షేత్రపాల్‌సింగ్ తెలిపారు.

బీర్ యోగా నుంచి డోగా వరకు..
శారీరక వ్యాయామం, మానసిక ఏకాగ్రతల సమ్మేళనం యోగా. ఆధునిక కాలంలో యోగాకు ఆదరణ పెరుగడటంతోపాటు రకరకాల యోగా ప్రక్రియలు తెరపైకి వస్తున్నాయి. ఆసనా లు, భంగిమలతో కూడిన సంప్రదా య యోగాకు ఆధునికత జోడిస్తూ వైవిధ్య యోగా ఇప్పుడు క్రేజ్‌ను సంపాదించుకుంటున్నది. నేటితరం బుర్రలోకి త్వరగా ఎక్కాలనో లేక ఆధునికత జోడిస్తే ఆదరణ లభిస్తుందనో యోగాను ట్రెండీగా మారుస్తున్నారు. 2015 నుంచి తెరపైకి వచ్చిన వాటిలో.. బీర్ యోగా, డాగ్ యోగా(దీనికే డోగా అని మరోపేరు), ఆర్టిస్టిక్ యోగా, ఏరియల్ యోగా, గోట్ యోగా, ఆక్రోయోగా వంటివి ముఖ్యమైనవి. బీర్ యోగా అంటే తాగుతూ కూర్చోవడం కాదు. మందుసీసాను ముందు పెట్టుకుని విన్యాసాలు చేయడం. సీసాను అందుకునేలా ఈ ఆసనాలు చేస్తుంటారు. ఇక పెంపుడు జంతువుతో కలిసి విన్యాసాలు చేయడాన్ని పట్టుకుని ఆసనాలకు దిగడం డాగ్‌యోగా (డోగా)గా పిలుస్తున్నారు. గాల్లో వేలాడుతూ చేసేది ఏరియల్ యోగా. భూమ్యాకర్షణకు వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. ఆక్రోబాటిక్స్, యోగా, థాయ్ మసాజ్ కలిస్తే ఆక్రోయోగా అవుతుంది. చాలా పట్టణాల్లో ప్రస్తుతం ఇది ఒక ట్రెండ్‌గా కొనసాగుతున్నది. దీన్నే మరికొంత మార్చి ఆక్రో విన్యాసగా కూడా చేస్తున్నారు.
TAGS:International Yoga Day , Yoga Day Celebrated , Beer Yoga

Related posts

Leave a Comment