నియంతలా చూస్తున్నారు!

క్రమశిక్షణను పాటించమంటే ప్రస్తుతం నియంతగా ముద్రవేస్తున్నారని ప్రధా ని నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తంచేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు క్రమశిక్షణకు మారుపేరని, ఆయనకు ఏదైనా బాధ్యత అప్పగిస్తే దూరదృష్టితో కూడిన నాయకత్వాన్ని అందిస్తారని కొనియాడారు. పెద్దల సభను సజావుగా నడపడంలో విశేష కృషిచేస్తున్నారని ప్రశంసించారు. ఉప రాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా పదవులను చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా తన అనుభవాలను క్రోడీకరిస్తూ వెంకయ్యనాయుడు రాసిన మూవింగ్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్: ఏ ఇయర్ ఇన్ ఆఫీస్(ముందుకు, మున్ముందుకు: కార్యాలయంలో ఒక ఏడాది) అనే 245 పేజీలు ఉన్న పుస్తకాన్ని ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీలో ఆవిష్కరించారు.
అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. వెంకయ్య క్రమశిక్షణకు మారుపేరు. కానీ, ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. క్రమశిక్షణ పేరు చెప్పగానే అప్రజాస్వామికం అని వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి క్రమశిక్షణను కలిగి ఉంటే అతడిపై నియంతగా ముద్ర వేస్తున్నారు.వెంకయ్య ఓవైపు క్రమశిక్షణకు పిలుపునిస్తూనే మరోవైపు దాన్ని ఆచరించి చూపిస్తున్నారు. ఉన్నత విలువలు పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉంటారు. గత 50 ఏండ్లు గా ప్రజా జీవితంలో ఉన్న వెంకయ్య రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు అని ప్రశంసించారు.

గ్రామ్‌సడక్ యోజన వెంకయ్య కృషే..
వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలో కేంద్ర క్యాబినెట్‌లో ఓ ముఖ్యమైన మంత్రి పదవికి వెంకయ్యను తీసుకోవాలని భావించినా, తనకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ మాత్రమే కావాలని అడిగి తీసుకున్నారని మోదీ గుర్తుచేశారు. వెంకయ్యకు అన్నదాతలంటే ఇష్టమని, వారి సంక్షేమం కోసం నిత్యం పాటుపడేవారన్నారు. వాజపేయి హయాంలో మారుమూల గ్రామాలను సైతం రహదారులతో అనుసంధానం చేసే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనను తేవడానికి వెంకయ్య కృషే కారణం. సమయపాలన విషయంలో వెంకయ్య పక్కాగా ఉంటారు. ప్రయాణ సమయంలో వెంకయ్యతో వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆయన గడియారం ధరించరు. తన వెంట పెన్ను, నగదు కూడాఉండదు. కానీ, నిర్దేశిత కార్యక్రమాలకు అందరికంటే ముందు, అనుకున్న సమయానికే చేరుకుంటారు అని మోదీ అన్నారు. పెద్దల సభ ఔన్నత్యాన్ని ఆయన మరింత ఇనుమడింప జేశారని కొనియాడారు.
ఎవరిపైనా వివక్ష వద్దు: వెంకయ్య
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. కులం, మతం, జాతి, లింగం ఆధారంగా ఏ వ్యక్తిపైన వివక్ష చూపడం ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని ఆచరించాలన్నారు. గత పార్లమెంటు సమావేశాల్లో నిర్వహించిన ఓ సెషన్‌ను ప్రత్యేకంగా సెషన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. సామాజిక న్యాయం కోసం సమిష్టి నిబద్ధతను ప్రతిబింబించే చట్టాలను పరిగణనలోకి తీసుకోవాలని, వాటిని ఆమోదించాలన్నారు. మరింత సంఘటిత సమాజ నిర్మాణానికి.. అన్ని వర్గాలకు ముఖ్యంగా ఇప్పటివరకూ ప్రాతినిధ్యం వహించని వర్గాలకు మరింత భరోసాను కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది అని అన్నారు. రాజకీయ పార్టీలు తమ విభేదాల్ని పక్కనపెట్టి దేశ హితం కోసం ఒక్కటికావాలన్నారు.
సభల్లో అర్థవంతమైన చర్చ జరుగాలని, అనవసరమైన విషయాలకు అమూల్యమైన సభా సమయాన్ని వృథా కానీయరాదని కోరారు. గత ఏడాది ఆగస్టు 11న బాధ్యతలు చేపట్టిన తాను దేశవ్యాప్తంగా 60 ప్రదేశాల్లో పర్యటించానన్నారు. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా తాను చూసిన వివిధ అంశాలను నాలుగు విభాగాల్లో పుస్తకంలో గ్రంథస్తం చేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధానులు మన్మోహన్‌సింగ్, హెచ్‌డీ దేవెగౌడ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, రాజ్యసభలో ప్రతిపక్ష ఉపనేత ఆనంద్‌శర్మ పాల్గొన్నారు.

Related posts

Leave a Comment