నిమజ్జనానికి గూగుల్‌ సాయం

ఏటా హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే గణేశ్‌ ఉత్సవాల్లో కీలకఘట్టమైన సామూహిక నిమజ్జనం గూగుల్‌కు ఎక్కనుంది. దీనికి సంబంధించి తొలిసారిగా ఈ ఏడాది ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హైదరాబాద్‌ అదనపు పోలీసు కమిషనర్‌ (ట్రాఫిక్‌) అనిల్‌కుమార్‌ తెలిపారు. ట్రాఫిక్‌ డీసీపీ–1 ఎల్‌ఎస్‌ చౌహాన్‌తో కలసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏటా గణేశ్‌ నిమజ్జనం సందర్భంలో హైదరాబాద్‌ వ్యాప్తంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తుంటారు. వాహనాల నియంత్రణకు బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. ఊరేగింపు మార్గంలో ఉన్న వాహనాలు, విగ్రహాలతో ఉన్న వాహనాలు చేరిన ప్రాంతాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటూ ఆంక్షలు, మళ్లింపుల్లో మార్పులు చేస్తుంటారు.

బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు ఉన్న ప్రధాన ఊరేగింపు మార్గంతో పాటు మరో 20 ఉపమార్గాల్లోని 66 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటా యి. వీటి ప్రభావం సాధారణ వాహనచోదకుల పైనా ఉంటోంది. ఆయా మార్గాల్లో ఉన్న పరిస్థితులు, ఊరేగింపు ముగింపు ఉన్న ప్రాంతాలపై ప్రజలు సమాచారం ఇవ్వడానికి ఇప్పటి వరకు ట్రాఫిక్‌ పోలీసులు వారి అధికారిక సోషల్‌మీడియాతోపాటు మీడియాను, రేడియోలను వినియోగిస్తున్నారు. ఇటీవల స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగటంతోపాటు గూగుల్‌ నావిగేటర్, మ్యాప్స్‌లతోపాటు ట్రాఫిక్‌ లైవ్‌ను వాహనచోదకులు, ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ గూగుల్‌ సంస్థతో సంప్రదింపులు జరిపారు.

గణేశ్‌ ఊరేగింపుతోపాటు ఆ రోజు, ఆయా మార్గాల్లో ఉన్న ట్రాఫిక్‌ స్థితిగతుల్ని ప్రత్యేకంగా అందించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది. బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ)కు చెందిన అధికారులు ఊరేగింపు, ట్రా ఫిక్‌ స్థితిగతులు గమనిస్తూ ఉంటారు. దీనికోసం నగరంలోని జంక్షన్లు, ఇతర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను వినియోగిస్తుంటారు. ఈ వివరాల ను సీసీసీ సిబ్బంది ఎప్పటికప్పుడు గూగుల్‌కు అందిస్తూ మ్యాప్‌లో అప్‌డేట్‌ అయ్యేలా చూస్తా రు. ఇది సాధారణ వాహనచోదకులకు ఉపయుక్తమని అనిల్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు.

Related posts

Leave a Comment