నా భక్తులకు సంతోషం లేకుండా పోయింది: స్వర్ణలత

తన దర్శనానికి ఏటా భక్తులు సంతోషంగా వచ్చేవారని.. ఈ ఏడాది మాత్రం దుఃఖంతో వచ్చారని స్వర్ణలత అన్నారు. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో భాగంగా అమ్మవారు స్వర్ణలత అనే అవివాహిత ద్వారా భవిష్యవాణి వినిపించారు. ‘ నాకు ముక్కుపుడక తెచ్చినవారినే కాక ప్రజలందరినీ ఆశీర్వదిస్తా. ఎప్పుడూ న్యాయం పక్షానే నిలబడతా. న్యాయం పక్షాన నిలబడిన వారికి ఆపద కలిగించను. ఈ ఏడాది సమర్పించిన బంగారు బోనం నాకు కొంత సంతోషాన్ని.. కొంత బాధను కలిగించింది. నా దర్శనానికి వచ్చే భక్తులను ఇబ్బంది పెట్టొద్దు. ఆడపడుచులందరూ దుఃఖంతో ఉన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి’ అని అమ్మవారు అన్నారు.

ఈసారి ఏర్పాట్లు ఘనంగా చేశాం: మంత్రి తలసాని
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు గతంలో కంటే ఈ ఏడాది ఏర్పాట్లు ఘనంగా చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. రంగం కార్యక్రమం పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి అమ్మవారికి బంగారం బోనం సమర్పించడం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. నిన్న అమ్మవారి దర్శనం విషయంలో కొందరు భక్తులు అసంతృప్తికి గురైన సంగతి తమ దృష్టికి వచ్చిందన్నారు.
రాజకీయాలకతీతంగా అందరికీ అమ్మవారి దర్శనం కల్పించామన్నారు. ఆలయంలో స్థలాభావం వల్ల కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ.. అన్ని శాఖల సమన్వయంతో బోనాల పండుగను ఘనంగా నిర్వహించామన్నారు.

Related posts

Leave a Comment