‘నా బతుకు నన్ను బతకనివ్వండి..’

ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం.. ఉన్నత విద్య చదువుకోవాలన్న తపన.. ఆమెను చేపలు అమ్ముకునేలా చేశాయి. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు కాలేజీ అయిపోయిన తర్వాత చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది కేరళకు చెందిన ఓ యువతి. హృదయాలను హత్తుకునేలా ఉన్న ఆమె కథ ఇటీవల సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టును చూసిన కొందరు ఆమెను అభినందిస్తుంటే.. మరికొందరు మాత్రం అదంతా నిజం కాదని కొట్టిపారేస్తున్నారు. ఇది కాస్తా వివాదాలకు దారి తీయడంతో ఆ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ‘నా బతుకు నన్ను బతకనివ్వండి’ అని వేడుకుంటోంది. వివరాల్లోకి వెళితే..

కేరళలోని ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన 21ఏళ్ల హనన్‌ స్థానిక ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ చదువుతోంది. హనన్‌ చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి మద్యానికి బానిసవడం, తల్లి మానసికంగా కుంగిపోవడంతో చిన్పప్పటి నుంచే ఆర్థిక కష్టాలను ఎదుర్కొంది హనన్‌. దీంతో ఇంటి బాధ్యతలు తానే తీసుకుంది. కానీ ఇన్ని కష్టాల్లోనూ చదువును మాత్రం వదిలిపెట్టలేదు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ చదువుకుంటోంది. అలా ప్రస్తుతం ఇల్లు గడవడం కోసం కాలేజీ అయిపోయిన తర్వాత చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. రోజూ ఉదయాన్నే కాలేజీకి వెళ్లడం.. కాలేజీ పూర్తయిన తర్వాత హోల్‌సేల్‌ మార్కెట్‌కు వెళ్లి చేపలు తెచ్చుకుని వాటిని వీధుల్లో అమ్మడం ఇది హనన్‌ దినచర్య.

హనన్‌ గురించి తెలుసుకుని ఇటీవల స్థానిక వార్తాసంస్థ ఒకటి తమ ప్రతికలో ఆమె కథనాన్ని ప్రచురించింది. ఇది కొందరు సోషల్‌ మీడియలో పోస్టు చేయడంతో కొద్ది రోజుల్లోనే వైరల్‌గా మారింది. హనన్‌ కథ ఎంతోమందిని కదిలించింది. అయితే కొందరు మాత్రం దీనిపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఇదంతా నిజం కాదని, ప్రచారం కోసమే ఈ కథను సృష్టించారని సోషల్‌మీడియాలో విమర్శిస్తున్నారు.

అయితే ఈ విమర్శలను హనన్‌ కాలేజీ యాజమాన్యం కూడా కొట్టిపారేసింది. కేంద్రమంత్రి కేజే ఆల్ఫోన్స్‌ కూడా దీనిపై స్పందిస్తూ ఆమెకు మద్దతుగా నిలిచారు. దీంతో హనన్‌ జీవితంపై సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై విసుగెత్తిపోయిన హనన్‌.. ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి తన గురించి మాట్లాడటం ఆపండి అంటూ అభ్యర్థించారు. ‘నాకు ఎవరి సహాయం వద్దు. దయచేసి నన్ను వదిలేయండి. నా జీవితం కోసం నా పని నన్ను చేసుకోనివ్వండి’ అంటూ మీడియా ఎదుట కన్నీరుపెట్టుకున్నారు.

Related posts

Leave a Comment