నాలుగు దశాబ్దాల తర్వాత.. ముందస్తు బెయిల్‌

లఖ్‌నవూ: దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ ఉత్తర్‌ప్రదేశ్‌ వాసులు ముందస్తు బెయిల్‌ పొందే అవకాశం రాబోతుంది. ముందస్తు బెయిల్‌కు సంబంధించిన చట్టాన్ని తిరిగి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని సోమవారం యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇప్పటి వరకు యూపీ, ఉత్తరాఖండ్‌లలో మాత్రమే ముందస్తు బెయిల్‌ పొందే అవకాశం లేదు. ఈ ప్రాంతాల్లో నేరాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో నేరస్థులు అరెస్టు నుంచి తప్పించుకోకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్‌ ఆప్షన్‌ను ఈ రెండు రాష్ట్రాల్లో అందుబాటులో లేకుండా చేశారు.

ఈ సదుపాయం లేకపోవడం వల్ల క్రిమినల్‌ కేసుల్లోని నేరస్థులను పోలీసులు వెంటనే అరెస్టు చేస్తున్నారు. కావాలంటే నిందితులు ఆ తర్వాత బెయిల్‌ పొందే విధంగా అక్కడి చట్టాలు ఉన్నాయి. 1975లో ఎమర్జెన్సీ విధించిన తర్వాతి సంవత్సరం నుంచి యూపీలో ముందస్తు బెయిల్‌ ఆప్షన్‌ లేకుండా ఎత్తివేశారు. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాల్లో ముందస్తు బెయిల్‌ సదుపాయాన్ని మళ్లీ తీసుకొచ్చేందుకు అవసరమైన నిబంధనలు రూపొందించి తెలియజేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీనిపై యూపీ ప్రభుత్వం స్పందించింది. నిబంధనలు రూపొందించేందుకు వారం రోజుల సమయం కావాల్సిందిగా ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేసింది.

Related posts

Leave a Comment