ధర్మపోరాట శంఖారావం

నేడు తిరుపతిలో తెదేపా బహిరంగ సభ
శ్రీవారి దర్శనానంతరం సీఎం రాక
తెదేపా ప్రజాప్రతినిధులంతా హాజరు
1.50 లక్షల మందితో నిర్వహణ
మోదీ వాగ్దాన భంగంపై పోరుబాట
తెలుగుదేశం పార్టీ సోమవారం తిరుపతి వేదికగా ధర్మపోరాట శంఖారావం పూరిస్తోంది. ‘నమ్మక ద్రోహం- కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం’ సభా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు గళమెత్తనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ సుమారు లక్షన్నర మంది సమరశంఖం పూరించనున్నారు. ఇందుకోసం తిరుపతిలోని తారకరామ మైదానం వేదికవుతోంది. ఈ సభకు రాష్ట్రంలోని తెదేపా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలందరూ హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వంపై తెదేపా చేస్తున్న రాజీలేని పోరాటాన్ని ప్రజలకు తెలియజేయడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానాలను ఏ విధంగా పక్కన పెట్టారన్నది వివరించనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయమేఉండటం, తిరుపతి నుంచే తెదేపా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే సంప్రదాయం కలిగి ఉండటాన్ని బట్టి ఇది ఎన్నికల ప్రచారానికి నాందిగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుం బిగించారు. ప్రధాని అభ్యర్థిగా నాడు నరేంద్ర మోదీ తిరుపతిలోని తారకరామ మైదానం వేదికగా రాష్ట్రానికి అనేక వరాలను ప్రకటించారు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్‌ 30న ఇదే వేదికగా ప్రత్యేక హోదాసహా అనేక హామీలిచ్చారు. రాష్ట్రంలో నిర్మించే రాజధాని.. దిల్లీ కంటే మిన్నగా ఉంటుందని, దేశ రాజధాని రాష్ట్ర రాజధాని ముందు చిన్నబోయేలా ఉండేలా తన వంతు కృషి చేస్తామని వాగ్దానం చేశారు. సీమాంధ్రను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు సహాయం చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత నాలుగేళ్లు పూర్తయినా నాటి హామీల్లో ఒక్కటీ పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొంటూ తిరుపతి సభా వేదికగా ప్రజలకు వెల్లడించేందుకు ముఖ్యమంత్రి ఉద్యుక్తులయ్యారు. నాడు వాగ్దానం చేసిన వేదికపై నుంచే ప్రధాని మోదీ నమ్మక ద్రోహాన్ని బహిర్గతం చేయనున్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

Related posts

Leave a Comment