దేశరక్షణలో నేను సైతం

రక్తం గడ్డకట్టే చలి… తడిసి ముద్దయ్యే వాన… దాహంతో గొంతెండిపోయేటంత పరిస్థితులు… కాలమేదైనా, పగలూ రాత్రీ అనే తేడా లేకుండా భుజాన 15 కిలోల లగేజీతో భారత సరిహద్దులో పెట్రోలింగ్‌ విధులు నిర్వహించడం ఆమె పని. అనుక్షణం సైనికుల అవసరాలను గుర్తిస్తూ… అక్కడ మూడేళ్లుగా పనిచేస్తోన్న బీఎస్‌ఎఫ్‌ మహిళా కమాండర్‌ ఆమె. పేరు స్టాంజిన్‌ నార్‌యాంగ్‌. దేశరక్షణే తన బాధ్యత… అంటోన్న ఈ 28 ఏళ్ల సాహసి అనుభవాలివి!

కేవలం పహారా కాయడమే కాదు, శత్రువుల నుంచి వచ్చే తుపాకీ కాల్పుల్నీ ఎదుర్కోవాలి. బాంబుదాడి జరిగితే.. బంకర్లలోకి వెళ్లి పోరాడాలి. వేయి కళ్లతో చుట్టూ ఏం జరుగుతోందో గమనించాలి. ఎప్పుడు చనిపోతామో తెలియని పరిస్థితుల్లో ఇలా పనిచేయడం తనకు ఇష్టమంటుందామె. అందుకే ఏరికోరి ఈ రంగాన్ని ఎంచుకుంది. దానికి ప్రేరణ కార్గిల్‌ యుద్ధమేనని చెబుతుంది. స్టాంజిన్‌ది జమ్మూకశ్మీర్‌, లేహ్‌ జిల్లాలోని హెమిస్‌ షుక్‌పచన్‌. అమ్మానాన్నలకు ఆమె ఒక్కతే కూతురు. ఇంటర్‌ వరకూ అక్కడే చదివి, జమ్మూలో డిగ్రీ పూర్తిచేసింది. కాలేజీలో క్రీడలన్నింటిలోనూ పాల్గొని మొదటిస్థానంలో నిలిచేది. జాతీయస్థాయి రెజ్లింగ్‌, జూడో ఛాంపియన్‌. చిన్నవయసులోనే కార్గిల్‌ యుద్ధాన్నీ, సైనికుల పనితీరునూ దగ్గరి నుంచీ గమనించింది స్టాంజిన్‌. అప్పుడే బీఎస్‌ఎఫ్‌లో చేరాలని నిర్ణయించుకుంది. అలా పరీక్షలు రాసి అర్హత సాధించింది. ఏడాది శిక్షణ పూర్తి చేసుకుని, దేశ సరిహద్దులోని సంబాలో పని చేయడం మొదలుపెట్టింది. ‘కుగ్రామంలో పుట్టా. జమ్మూకశ్మీరు అందాలను కార్గిల్‌ యుద్ధం మార్చేసింది. అది చూశాకే దేశం కోసం ఏదైనా చేయాలనే తపన పెరిగింది. అయితే బీఎస్‌ఎఫ్‌ శిక్షణకు వెళ్లినప్పుడు కొంత ఇబ్బంది పడ్డా. మా బృందంలో మహిళల సంఖ్య తక్కువైనా భయపడలేదు. తరువాత సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరా. ఇప్పుడు అక్కడ మహిళా కమాండర్‌గా బాధ్యతలు చూస్తున్నా’ అని చెబుతుందామె.

ప్లాటూన్‌ కమాండర్‌గా..

జమ్మూ, సంబా జిల్లా వెంబడి సరిహద్దులో ప్లాటూన్‌ కమాండర్‌గా, సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఆమె పెట్రోలింగ్‌ చేయడమే కాదు… దాదాపు పదికి పైగా ఉండే సైనిక బృందాల బాధ్యత కూడా తనదే. ఇరవైనాలుగ్గంటలూ అప్రమత్తంగా ఉండాలి. ‘రాత్రీ, పగలుతో సంబంధం లేకుండా పని చేయాల్సి ఉంటుంది. పెట్రోలింగ్‌ అంటే కేవలం గస్తీ తిరగడం మాత్రమే కాదు, సైనికుల అవసరాలూ, ఆయుధాల పరిరక్షణ కూడా నాదే. రకరకాల రైఫిల్స్‌ ఉంటాయి. అవి పని చేస్తున్నాయా లేదా అనేదీ ఎప్పటికప్పుడు పరిశీలించాలి. పనివేళలు అయిపోయినా అవసరమైతే రాత్రుళ్లు సరిహద్దుకు వెళ్లవలసి ఉంటుంది. ఒక్కోసారి మూడు గంటల చొప్పున పని విభజించుకుంటా. మధ్యలో కాస్త విరామం తీసుకుంటా. కొన్నిసార్లు అదీ కుదరదు. ఎవరైనా ఓ సైనికుడికి సమస్య వస్తే వెంటనే అక్కడికి వెళ్లిపోవాలి. మరొకరు వచ్చేవరకూ ఆ బాధ్యత చూసుకోవాలి…’ అని వివరిస్తుందామె.

అబ్బాయిలా వెళతా…

దేశ సరిహద్దులో ప్రశాంతత ఉండదు. అకస్మాత్తుగా పాక్‌ సైనికులు కాల్పులు జరుపుతారు. తాను విధుల్లో ఉన్నప్పుడు అలాంటి సందర్భాలు ఎదుర్కొన్నానని చెబుతుంది స్టాంజిన్‌. ‘మూడేళ్లక్రితం ఓసారి పాక్‌ సైనికులు బాంబుల దాడి మొదలుపెట్టారు. మేం కూడా ఓ వైపు పోరాడుతూనే దగ్గర్లోని బంకర్లలోకి వెళ్లి, ఎదురు కాల్పులు జరిపాం. అప్పుడు ఎవరికీ ప్రమాదం జరగలేదు కానీ ఎప్పుడూ ఆ పరిస్థితి ఉండదు. కొందరు సైనికులు గాయపడతారు. ప్రాణాలు పోగొట్టుకున్నవారూ ఉన్నారు. కొన్నిసార్లు సరిహద్దుకు సమీపంలోని గ్రామాలపైనా శత్రు దాడి జరుగుతుంది. దాంతో అక్కడి ప్రజలు భయపడి వేరే ప్రాంతాలకు తరలివెళ్లిపోతుంటారు. ఇలాంటి సందర్భాలు ఇక్కడ మామూలే…’. యుద్ధవాతావరణంలోనే కాదు పెట్రోలింగ్‌కి స్టాంజిన్‌ కొన్నిసార్లు అబ్బాయిలా వెళ్తుందట. దానివల్ల ఓ మహిళగా కొన్ని సమస్యల నుంచి తప్పించుకోవచ్చని చెబుతుంది. ముఖ్యంగా రాత్రుళ్లు గస్తీ తిరగాల్సి వస్తే… జుట్టును టోపీలో దూర్చేసి, పైన హెల్మెట్‌ పెట్టుకుంటుంది. ఎలాగూ బరువైన యూనిఫారం, అందులో ఆయుధం మామూలే. వెళ్లే ప్రతీసారీ దాదాపు 15 కేజీల బ్యాగు వీపుపైన ఉండాల్సిందేనని చెబుతుంది. అయితే పర్వతశ్రేణులపై అంత బరువుతో నడవడం శిక్షణలో భాగంగా నేర్పిస్తారు కాబట్టి మైళ్లదూరం నడిచినా కష్టంగా ఉండదు… అని వివరిస్తుంది.

నా ముందున్న లక్ష్యం మౌంట్‌ ఎవరెస్టు ఎక్కడం. త్వరలో అది సాధించాలనుకుంటున్నా. ఏడాదికి 15 రోజులు మాత్రమే ఇచ్చే సెలవుల్లో ఈ ఏడాది అమ్మావాళ్లని చూసి రావడానికి సరిపోయింది. వచ్చే ఏడాదిలో తప్పనిసరిగా సాధిస్తా.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌పై…

స్టాంజిన్‌ ఈ ఏడాది జనవరి 26న దిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవంలో పాల్గొని బైక్‌ రైడింగ్‌పై సాహసం చేసింది. వాస్తవానికి ఆమెకు బైకు నడపడం రాదు. అయితే ఆమెకా అవకాశం బీఎస్‌ఎఫ్‌లో చేరాక వచ్చింది. బీఎస్‌ఎఫ్‌ ప్రారంభించిన ‘మహిళా బైక్‌ డేర్‌ డెవిల్స్‌ జట్టు’లో సభ్యత్వం తీసుకుంది. వాస్తవానికి గణతంత్ర దినోత్సవాల్లో కొన్నేళ్లుగా త్రివిధ దళాలు చేసే సాహస విన్యాసాల్లో బీఎస్‌ఎఫ్‌కు సంబంధించి మగవాళ్లే పాల్గొనేవారు. ఈసారి తొలిసారిగా మహిళలూ భాగస్వాములయ్యారు. దానికి స్టాంజిన్‌ కెప్టెన్‌గా వ్యవహరించింది. గతేడాది చివరి నుంచి శిక్షణ తీసుకున్నారు. దీనికోసం మొదట 106 మంది మహిళలను ఎంపిక చేయడమూ ఆమె పనే. వీరిలో దాదాపు అందరికీ బైకు నడపడం రాదు. పైగా విన్యాసాలన్నీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్లపైనే నేర్చుకోవాలనుకున్నారు. మొదట బైకు నడపడంలో శిక్షణ తీసుకుని తరువాత సాహసాలు చేశారు. అయితే శిక్షణలో భాగంగా ఎన్నో గాయాలూ తప్పలేదని చెబుతుందామె. స్టాంజిన్‌ ముక్కుకీ గాయం అయి… ఇప్పుడు ఆమె కొన్ని వాసనలు పసిగట్టలేదు. చివరకు 51 మందితో ఆ సాహసం పూర్తిచేసింది. ప్రధాని, రాష్ట్రపతి నుంచి ఎందరో విదేశీప్రతినిధులూ, లక్షలాదిమంది ప్రజల ఎదుట ప్రదర్శనను విజయవంతంగా పూర్తిచేశారు. అరగంటకు పైగా ఆ బృందం చేసిన విన్యాసాలను కళ్లార్పకుండా చూశారు. ప్రధాని నుంచి ప్రశంసలూ అందుకున్నారు. స్టాంజిన్‌ ఒంటరిగా బైకుపై నుంచుని దేశమాతకు సెల్యూట్‌ చేయడం ఎంతోమందిని ఆకట్టుకుంది.

Related posts

Leave a Comment