దేశంలో తొలి ఒలింపిక్స్‌ ఏపీలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి

అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్న భారత్‌.. క్రీడల్లో మాత్రం ఇంకా అనుకున్న పురోగతి సాధించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశంలో ఇప్పటి వరకు ఒలింపిక్స్‌ నిర్వహించలేదని భవిష్యత్తులో మన దేశంలో నిర్వహించే తొలి ఒలింపిక్స్‌ ఆంధ్రప్రదేశ్‌లోనే జరగాలని ఆయన ఆకాంక్షించారు. దీనికి తగ్గట్లుగా రాష్ట్రంలోని క్రీడా సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. మంగళవారం విజయవాడలోని విద్యాధరపురంలో అమరావతి అంతర్జాతీయ క్రీడా ప్రాంగణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మంచి క్రీడాకారులను తయారు చేసేందుకు ప్రముఖ మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లేకు చెందిన సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే ప్రాజెక్టు గాండీవం, ప్రాజెక్టు పాంచజన్యం కార్యక్రమాలను తీసుకొచ్చామన్నారు. వీటిని లాంఛనంగా ప్రారంభించారు. గతంలో కేవలం క్రికెట్‌కే ప్రాధాన్యం ఇచ్చేవారని, ఇప్పుడు అన్నింటిపైనా ఆసక్తి చూపిస్తున్నారన్నారు. గోపీచంద్‌కు బ్యాడ్మింటన్‌ అకాడమీ కోసం స్థలాన్ని ఇచ్చామని.. దాని నుంచి ఇప్పుడు అనేక మంది క్రీడాకారులు తయారవుతూ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారని ప్రశంసించారు. శిక్షకులు ముందుకు వస్తే వారికీ ఇస్తానన్నారు. 12 ఏళ్లలోపు బాల, బాలికలను తీసుకుని వారికి అన్ని విధాలా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామన్నారు. 2018-19లో సీఎం కప్‌ పేరిట వివిధ పోటీలు నిర్వహించి ప్రతిభను వెలికితీస్తామన్నారు. అటువంటి వారికి స్కాలర్‌షిప్‌లతో పాటు, నగదు పురస్కారాలు, ఉద్యోగ నియామకాలలో ప్రాధాన్యం ఇస్తామన్నారు. విజయవాడతో పాటు రాజధాని అమరావతిలోనూ అంతర్జాతీయ క్రీడా ప్రాంగణాన్ని నిర్మిస్తామన్నారు. విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ప్రాంతీయ క్రీడా ప్రాంగణాలు వస్తాయమన్నారు. భవిష్యత్తులో పాఠశాల క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేలా చూడాలని శాప్‌ ఛైర్మన్‌ను కోరారు. దేశంలోనే ఇటువంటి కార్యక్రమం ఎక్కడా ప్రారంభం కాలేదని మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే అన్నారు. దీనికింద బాల, బాలికలను ఎంపిక చేసి వారికి అన్ని రకాలుగా తర్ఫీదు ఇస్తామన్నారు.

క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు
కార్యక్రమానికి హాజరైన అర్జున, పద్మశ్రీ అవార్డు గ్రహీతలను ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించారు. కరణం మల్లీశ్వరి, అశ్వనీ నాచప్ప, షైనీ విల్సన్‌, వలసమ్మ తదితరులకు శాలువా కప్పి జ్ఞాపికలు అందజేశారు. స్థానిక క్రీడల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు చెక్కులను అందజేశారు. వివిధ జిల్లాల యువజన సంఘాలకు క్రీడా కిట్‌లను అందించారు. విజయవాడకు చెందిన ఆర్చరీ క్రీడాకారిణి బేబీ డాలీ శివానీని సన్మానించి రూ.25 లక్షలను ఇస్తున్నట్లు ప్రకటించారు. సెయిలింగ్‌లో ప్రతిభ చూపుతున్న నావికా అధికారి లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌ స్వాతిని కూడా ప్రశంసించారు. ప్రభుత్వ ఉద్యోగి అయినా రూ.10 లక్షలు ప్రకటించారు. వోల్గా ఆర్చరీ అకాడమీ నిర్వాహకుడు సత్యనారాయణకు ఇల్లు, అకాడమీ నిర్వహణకు ప్రభుత్వం తరఫున తోడ్పతామన్నారు.

Related posts

Leave a Comment