దారి తప్పిన ఆర్టీసీ

బోర్డుపై సూచిక ఒకటి.. వెళ్లే మార్గం మరొకటి
వేళకు రాని బస్సులతో ప్రయాణికుల్లో అయోమయం
మల్కాజిగిరి వాణినగర్‌కు చెందిన జశ్వంత్‌సాయి సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. కార్యాలయం సమయం ఉదయం 10గంటలు. ఇంటి నుంచి ఒక గంట ముందే వెళ్లి బస్సు కోసం బస్టాప్‌లో వేచి చూస్తుంటాడు. ఎంతసేపు ఎదురుచూసినా సమయానికి బస్సు రాకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. బస్సులో వెళ్లేందుకు పాసు సౌకర్యం ఉన్నా వేచి చూసే సమయం లేదు. అటు ఆర్టీసీ ఇటు ప్రైవేటు వాహనాలకు డబ్బులను చెల్లించడంతో జేబు ఖాళీ అవుతోంది.

బేగంపేటకు చెందిన లక్ష్మి లక్డీకాపుల్‌లోని ఓ కాల్‌ సెంటర్‌లో పని చేస్తోంది. బస్సులో వెళ్లేందుకు నెల పాసు తీసుకుంది. తన కార్యాలయం చేరుకోవాలంటే 49వ నంబర్‌ బస్సు కోసం వేచి చూడాల్సి వస్తుంది. ఈ బస్సు రాజ్‌భవన్‌ రోడ్డు మీదుగా నేరుగా లక్డీకాపుల్‌ వెళ్తుంది. కొన్ని సందర్బాల్లో సమయానికి బస్సు రాకపోవడంతో పంజాగుట్టలో దిగి మరో బస్సు ఎక్కాల్సి వస్తోంది.
బస్టాప్‌లలో వేచి ఉండే ప్రయాణికుల కోసం బస్సుల వివరాలు లేకపోవడంతో ఏ బస్సు ఎటువైపు వెళ్తొందో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్నిటికి అయితే బోర్డు ఒకటి ఉంటే బస్సు మరో ప్రాంతానికి వెళ్తొంది. దీంతో మధ్యలోనే దిగాల్సి వస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ బస్‌ షెల్టర్‌లలో బస్సుల వివరాల పట్టికలు కనిపించడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో బస్సు సర్వీసులు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. మల్కజిగిరి, వాణినగర్‌, రాజ్‌భవన్‌రోడ్‌, బోరబండ, ఫిలింనగర్‌ ప్రాంతాల్లో బస్సు సౌకర్యం పెంచాలని ప్రయాణికుల నుంచి డిమాండ్‌ వస్తోంది.

సర్వీసులు పెంచాలి
మల్కాజిగిరి, సోమాజిగూడ రాజ్‌భవన్‌రోడ్డు, బోరబండ నుంచి గండి మైసమ్మ తదిర ప్రాంతాల్లో బస్సు సర్వీసులను పెంచితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆర్టీసీ అందుబాటులో లేకపోవడంతో క్యాబ్‌లు, ఆటోలు ఇతర వాహనాల ద్వారా జనం రాకపోకలు సాగిస్తున్నారు. పేద, మద్య తరగతి ప్రజలు కార్యాలయాలకు సమయానికి వెళ్లాని గంట ముందే బస్టాప్‌ల వద్ద వేచి చూస్తుంటారు. తాము వెళ్లాల్సిన బస్సు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి. బస్సు సమయానికి వస్తే వూపిరి పీల్చుకుంటారు. లేదంటే ఉసూరు మని ఆటోలకు అదనంగా చెల్లించి వెళ్తున్నారు.

కనిపించని బోర్డులు
గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 3580 బస్సులు ఉన్నాయి. నిత్యం 35లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. అయినా బస్టాప్‌ల వద్ద బస్సుల వివరాలను స్పష్టంగా ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారని ప్రయాణికులు వాపోతున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సుల వివరాలు, వాటి సమయం షెల్టర్ల వద్ద ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ పలు ప్రాంతాల్లోని బస్టాప్‌ల వద్ద తాము ఎక్కాల్సి బస్సు ఎప్పుడు వస్తుందో అని పక్కన ఉన్న వారిని అడిగి తెలుసుకోవాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. పలు ప్రాంతాల్లో బస్సులు సమయానికి రాకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.. కాలం చెల్లిన బస్సులు.. అధ్వానంగా బస్‌షెల్టర్‌లు ఉండడంతో ప్రజలు బస్సులను ఎక్కేందుకు విముఖత చూపిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

Related posts

Leave a Comment