తెల్లబోతున్నారా?

white hairs
  • చిన్న వయసులోనే రంగు మారిపోతుండటంతో ఆందోళన
  • యువత ఆత్మవిశ్వాసం దెబ్బతింటున్న వైనం
  • కాలుష్యం, పోషకాహారమే కారణమంటున్న వైద్య నిపుణులు

తలపై తెల్లభారం పెరిగిపోతోంది. నల్ల కిరీటంలా నిగనిగలాడాల్సిన జుట్టు కాస్తా శ్వేతవర్ణంలోకి మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. యాభైలలో రావాల్సిన ఆ రంగు ఇరవైలలోనే పలకరించే సరికి ఏం చేయాలో పాలుపోవడంలేదు. అప్పుడే ముసలాళ్లయిపోయామా అనేంతగా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. విశాఖ నగరిలో 30 ఏళ్లలోపు వారిలో 18 శాతం మందికి ఇప్పుడు ఇదే ప్రధాన కలవరపాటు. రంగేసుకుని ఠీవిగా తిరుగుతున్నా లోలోపల మాత్రం ఆ ఇబ్బంది తొలిచేస్తోంది. దీనికి మనవైన కారణాలు ఎన్నో ఉన్నాయి.
విశాఖ యువతలో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఇటీవల పెరుగుతున్నాయి. ఈ ఇబ్బందులతో కింగ్‌జార్జి ఆసుపత్రిలోని చర్మవ్యాధుల విభాగానికి చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. నగరంలోని 20 నుంచి 30 ఏళ్లలోపు ఉన్న యువతలో గతంలో కంటే ఇటీవల ఈ సమస్య బాగా పెరిగిపోతోందని కేజీహెచ్‌ వైద్య నిపుణులు గుర్తించారు. ఇక 10-19 సంవత్సరాల లోపు వారిలోనూ ఈ సమస్యతో 11 శాతం మందిలో ఉన్నట్టు వైద్యుల వద్దకు వస్తోన్న కేసులను బట్టి తెలుస్తోంది. చిన్న వయస్సులో జుట్టు నెరిసిపోవడాన్ని వైద్య పరిభాషలో ‘ప్రీ మెచ్యూర్‌ గ్రెయిన్‌ ఆఫ్‌ హెల్త్‌’ అని పిలుస్తారు. 10-19 ఏళ్ల మధ్య వయస్సులోనే జుట్టు రంగు మారిపోయిన వారిని ఈ కేటగిరీ కింద పరిగణిస్తారు. ఇక జుట్టు రాలిపోవడం, బట్టతల రావడం వంటి కేసులు కూడా అధికంగానే నమోదవుతున్నట్టు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
రూ. 26 కోట్ల వ్యాపారం…
జుట్టు ఆరోగ్యంపై నగర యువత ఏటా సుమారు రూ. 26 కోట్లకు పైగా ఖర్చుపెడుతున్నారు. నెలకోసారి హెయిర్‌డై వేయించుకోవడానికి నగరంలో రూ. 120 నుంచి రూ. 500 వరకూ వసూలు చేసే సంస్థలున్నాయి. కొన్ని ప్రత్యేక సెలూన్లలో ఇంతకంటే ఎక్కువే వసూలు చేస్తున్నాయి. వీటికి పెట్టే ఖర్చు ఏటా రూ. 18 కోట్లు వరకూ ఉంటోంది. ఇక జుట్ట రాలిపోయేవారు, బట్టతల వచ్చేవారు ఆ సమస్య నుంచి బయటపడటానికి ‘కాన్‌స్టిట్యూషనల్‌ ట్రీట్‌మెంట్‌’ పేరుతో క్లినిక్‌లను, ఇతర వైద్యాలయాలను ఆశ్రయిస్తున్నారు. వీటికి చేసే ఖర్చు ఏటా రూ. 8 కోట్ల వరకూ ఉంటోంది.

దెబ్బతింటున్న ఆత్మవిశ్వాసం…
గతంతో పోల్చితే ప్రస్తుత తరంలో 25 ఏళ్ల దాటిన వారి నుంచి జుట్టు నెరిసిపోవడం మొదలవుతోంది. కొంతమందిలో రాలిపోయి బట్టతలగా కూడా మారిపోతోంది. జుట్టు మెరిసిపోవడం వల్ల యువత ప్రధానంగా ఆత్మనూన్యత భావానికి గురవుతున్నారు. వార్ధక్య ఛాయలు వచ్చినట్టుగా భావిస్తూ కలవరపడుతున్నారు. ఇది తర్వాతి దశలో మానసిక సమస్యలకు కూడా దారితీస్తోందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇలాంటివారు సైకియాట్రిక్‌ క్లినిక్‌ల మెట్లు కూడా ఎక్కుతున్నారంటున్నారు. ఈ సమస్యలు ఎదుర్కొంటున్నవారిలో సుమారు 8 శాతం మంది సైకియాట్రిస్ట్‌లను సంప్రదిస్తున్నారు.

కారణాలు:
జన్యుపరమైనవి: 13 శాతం
తల్లిదండ్రులు, వారి పూర్వీకుల
నుంచి జన్యుపరంగా వచ్చే సమస్యల శాతమిది. దీనిలో ప్రధానంగా బట్టతల వస్తుంటుంది.
రంగు మారడం, వెంట్రుకలు రాలడంలో దీని ప్రభావం స్వల్పమే.
జట్టుకు కాలుష్యమే ప్రధాన శత్రువు. దీనివల్ల తెల్లబడటం, రాలిపోవడం ఎక్కువగా జరుగుతుంటుంది. బీ వెంట్రుకలు అసాధారణ స్థాయిలో రాలిపోవడం వల్ల బట్టతల కూడా వచ్చేస్తుంటుంది. బీ ఇలాంటి కేసులు నగరంలో కాలుష్యం అధికంగా ఉన్న పాతనగరం, బీచ్‌రోడ్డు, గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాల నుంచి వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

వీటికి దూరంగా ఉండండి…
* రసాయనాలు అధికంగా కలిసిన షాంపూలు, హెయిర్‌ డైలు వాడొద్దు.
* పిజ్జాలు, బర్గర్లు, బయటి చిరుతిళ్లు తినొద్దు.
* తలస్నానం వంటివి పదేపదే చేయొద్దు
* ఎవరెవరో చెప్పారని జుట్టుమీద ప్రయోగాలు చేయొద్దు. * నిద్రలేమిని దరికి రానివ్వద్దు
* టీవీ చూస్తూ, పుస్తకాలు చదువుతూ ఆహారం తీసుకోకూడదు.
ఇవి చేయాలి…
సమతుల ఆహారం తీసుకోవాలి. అదికూడా ఐరన్‌ వంటి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆకు కూరలు, బి-కాంప్లెక్స్‌ విటమిన్లు, జింకు, సిలేనియం వంటి సూక్ష్మ పోషకాలు ఉండే కూరగాయలు తీసుకోవాలి.
ఇంటి వంట అన్నింటికీ సురక్షితమని గమనించాలి.
రాత్రి పూట విధులు నిర్వహించేవారు పగలు కనీసం 40 నిమిషాలైనా ఎండలో వ్యాయామం చేయాలి.
పని ఒత్తిడికి కాస్తయినా దూరంగా ఉండాలి. ప్రణాళికాబద్ధంగా పనిచేయడం అలవాటు చేసుకోవాలి. బీ కాలుష్య ప్రాంతాలకు వెళ్లేటపుడు తప్పనిసరిగా టోపీలు వంటివి ధరించాలి.
మెలనిన్‌ గురించి తెలుసుకోవాల్సిందే…
మన శరీరం, జుట్టు వర్ణాన్ని నిర్ణయించేది శరీరంలో ఉన్న మెలనిన్‌ అనే పదార్థం మాత్రమే. ఇది ఎక్కువగా ఉన్నవారి శరీరం, జుట్టు నల్లగా ఉంటాయి. మెలనిన్‌ను సరైన మోతాదులో ఉత్పత్తి కావాలంటే మన శరీరానికి సూర్యకిరణాలు తగులుతుండాలి. రాత్రిపూట విధులు నిర్వహించేవారు పగలు బయటకు రావడమే మానేస్తున్నారు. దీనివల్ల వారి జుట్టు త్వరగా తెల్లబడిపోతోందని వైద్యులు చెబుతున్నారు. నగరంలో ఐటీ రంగంలోనూ, సెక్యూరిటీ గార్డులు, ఉత్పత్తి రంగంలో నిరంతరం రాత్రి విధులు నిర్వర్తించేవారు ఈ రకమైన సమస్యకు గురవుతున్నారు.

అవగాహన లోపం: 16 శాతం
అవగాహన లోపం కూడా జుట్టు ఆరోగ్యం దెబ్బతినడానికి కారణమవుతోందని కేజీహెచ్‌ వైద్య నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా కొన్ని రకాల రసాయనాలు ఎక్కువగా ఉండే షాంపూలు, హెయిర్‌ డైలు వాడటం వల్ల ఇది జరుగుతోందని వారు చెబుతున్నారు.

ఆహారపుటలవాట్లు: 28 శాతం
సమతుల ఆహారం తీసుకోకపోవడం, పోషకాహార విధానాన్ని పట్టించుకోకపోవడంతో నగరవాసులకు జట్టు సంబంధ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఐరన్‌, మాంసకృత్తులతో కూడిన ఆహారం తీసుకోకపోవడం వల్ల జట్టు రాలిపోతుంటుంది. ఇక విటమిన్‌-ఎ ఉన్న పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల కూడా జుట్టును నష్టపోవాల్సి వస్తుంది.

సానుకూల దృక్పథంతో మెలగాలి…
జుట్టు సమస్యలు ఇటీవల చాలామందిలో మానసిక ఇబ్బందులుగా మారిపోతున్నాయి. ఈ సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే యువత చాలా ఆందోళన పడిపోతున్నారు. ఇలాంటి వాటిని సానుకూల దృక్పథంతో ఎదుర్కోవాలి. ఇంటివంట భుజించడం, కుటుంబంతో ఎక్కువగా గడపడం వంటివి చేయాలి. శారీరక, మానసిక వత్తిడిని నియంత్రించుకోవాలి. ఆత్మస్థయిర్యంతో ముందుకెళ్లాలి.

– డాక్టర్‌ జి.రఘురామారావు, ఏఎంసీ చర్మవ్యాధుల విభాగం విశ్రాంత ఆచార్యులు
పనిఒత్తిడి 12 శాతం
ఇటీవల కాలంలో యువతలో జుట్టు తెల్లబడటానికి, రాలిపోవడానికి ప్రధాన కారణంగా ఇదే అవుతోంది. ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు చేయడం, రాత్రి వేళ విధులు నిర్వహించడం వంటి వాటి వల్ల జుట్టు త్వరగా మెరిసిపోతుందని వైద్యులు చెబుతున్నారు.
మహిళల్లో…
నీ మహిళల్లో రక్తహీనత, ఐరన్‌ లోపం వంటి కారణాలు కొంపముంచుతున్నాయి. నీ ముఖ్యంగా 15 ఏళ్ల వయస్సు నుంచే పిల్లల్లో జుట్టు రాలిపోతోంది. ఆ వయసులోనే రక్తహీనత, సూక్ష్మపోషకాల లోపాలు తలెత్తడంతో ఈ పరిస్థితి వస్తోంది.
నగరంలో 48 శాతం మంది మహిళల్లో జుట్టు రాలిపోవడానికి ఇదే ప్రధాన కారణంగా నిలుస్తోంది.
నెలసరి సమయంలో అధికంగా రక్తం పోవడంతో పాటు కీలకమైన ఇనుము వంటి సూక్ష్మపోషకాల నష్టం కూడా సంభవిస్తోంది.
గర్భిణీలు, బాలింతల్లో కూడా అధికంగా ఈ సమస్య తలెత్తుతోంది. అయితే కొందరిలో ఈ సమస్య కొన్నాళ్లకు సమసిపోతోంది. కానీ 10 శాతం మంది మహిళల్లో మాత్రం అది శాశ్వతంగా నిలిచిపోయి బాధిస్తోంది.

థైరాయిడ్‌, అధిక మోతాదులో ఔషధాల వినియోగం వంటివి కూడా ప్రభావం చూపుతున్నాయి.

పురుషుల్లో…
వీరిలో జన్యుపరంగా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.
ఇక ఒత్తిడితో పనిచేసేటపుడు శరీరంలో హార్మోన్ల సమతూకం

దెబ్బతిని జుట్టు
తెల్లబడటం, రాలిపోవడం జరుగుతుంటుంది. దీన్ని ‘మేల్‌ ప్యాటర్న్‌ హెయిర్‌ లాస్‌’గా పిలుస్తారు. ఇలాంటి కారణాలు నగరంలోని 23 శాతం మందిలో కనిపిస్తున్నాయి.

Tags: white hairs,hairs lose,iron lopam

Related posts

Leave a Comment