తెలుగు వార్తా చానళ్లకు కేసీఆర్ సర్కారు వార్నింగ్!

రెచ్చగొట్టేలా మాట్లాడిన వారిపై పెట్టే సెక్షన్లే వాటిని ప్రసారం చేసే చానళ్లపై కూడా
సున్నిత అంశాలపై చర్చలు నిర్వహిస్తే కఠిన చర్యలు
నిఘా పెట్టేందుకు కమిషనరేట్ లో ప్రత్యేక విభాగం
అభ్యంతరకర ప్రసారాలు చేసినా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన వారి వ్యాఖ్యలు చూపించినా కఠిన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ సర్కారు తెలుగు వార్తా చానళ్లను హెచ్చరించింది. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడిన వారిపై ఐపీసీలోని ఏ సెక్షన్ల కింద కేసులు పెడతామో, వాటిని ప్రసారం చేసే చానళ్లపైనా అవే సెక్షన్లు పెట్టి విచారించాలని నిర్ణయించిన ప్రభుత్వం, అదే విషయాన్ని చానళ్ల యాజమాన్యాలకు తెలిపింది.

ఇటీవల ఓ టీవీ చానల్ లో చర్చా కార్యక్రమం నిర్వహిస్తూ, సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ను ఆహ్వానించిన వేళ, ఆయన శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దానికి హిందూ సంఘాలు నిరసన తెలియజేయడం తదనంతర పరిణామాలు అటు కత్తి మహేష్ ను, ఇటు శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందను హైదరాబాద్ నుంచి బహిష్కరించేంత వరకూ వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కొన్ని చానళ్లు మతపరమైన సున్నిత అంశాలపై అభ్యంతరకర చర్చలు నిర్వహిస్తుండటంతోనే పరిస్థితి విషమిస్తోందని పోలీసు అధికారులు, ప్రభుత్వానికి రిపోర్టును అందించారు. ఆపై సమీక్ష జరిపిన ప్రభుత్వం చానళ్లలో ప్రసారమయ్యే అంశాలపై నిఘా ఉంచాలని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆపై డీజీపీ సూచన మేరకు చానళ్లలో వచ్చే వార్తలను నిరంతరం సమీక్షిస్తూ ఉండటానికి నగర పోలీస్ కమిషనరేట్ లో ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటైంది.

Related posts

Leave a Comment