తిండి పెట్టకుండా..కడుపులో తన్నేవారు

‘వారు పెట్టే బాధలు భరించలేక గాజు ముక్కలతో ఒళ్లంతా కోసుకునేవాళ్లం. సరైన ఆహారం పెట్టకుండా మత్తు మందు కలిపిన తిండి పెట్టేవారు. దాంతో ఉదయం లేచే సరికి ఒళ్లంతా నొప్పులతో అల్లాడిపోయేవాళ్లం’.. బిహార్‌లోని బాలికల వసతి గృహంలో అత్యాచారాలకు గురైన బాధితుల ఆవేదన ఇది. ఈ వసతి గృహంలో 140 మందికి పైగా బాలికలు ఉన్నారు. వారిలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మంది బాలికలపై అత్యాచారాలు జరిగాయి. వారిలో 7 నుంచి 18 ఏళ్ల వయసు వారు ఉన్నారు. బాలికలకు రక్షణ కల్పించడానికి ఎన్జీవో ఏర్పాటు చేసిన యజమాని కూడా నిందితుల్లో ఒకరు కావడం గమనార్హం.

శనివారం బాలికలను రిహాబ్‌ సెంటర్లకు తరలించారు. ఈ నేపథ్యంలో బాధితుల్లో కొందరు తాము పడ్డ బాధలను మీడియాతో పంచుకున్నారు. ‘మాకు ఎలాంటి ఆహారం పెట్టినా తినేవాళ్లం. అందులో మాదకద్రవ్యాలు కలిపేవారు. ఒక్కోసారి తిండి కూడా పెట్టరు. ఆకలితో అలమటించేవాళ్లం. తిన్నాక మత్తుగా ఉండడంతో వెంటనే నిద్రపోయేవాళ్లం. ఉదయం లేచే సరికి నోట మాట సరిగ్గా వచ్చేది కాదు. మాపై అత్యాచారాలు చేస్తున్నారని తెలుసు. పారిపోదామంటే ఓపిక ఉండేది కాదు. కిటికీలు కూడా లేవు. మత్తుగా అనిపించడంతో కాసేపు నిద్రపోదామంటే కడుపులో తన్నేవారు. మాలో చాలా మంది అనాథలు. వసతి గృహంలోని ఆడవాళ్లు కూడా మాకు సహకరించేవారు కాదు. చెప్పాలంటే అక్కడికి వచ్చే మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా హింసించేవారు. మా ముందే కస్టమర్లకు ఫోన్లు చేసి మాట్లాడేవాళ్లు. ఆ గదిలోకి వెళ్లు ఈ గదిలోకి వెళ్లు అని బెదిరించేవారు. వారి నుంచి తప్పించుకోవడానికి గాజు ముక్కలతో ఒళ్లంతా కోసుకునేవాళ్లం.’ అని తమ బాధలు చెప్పుకొంటున్న బాలికలను చూస్తే హృదయం ద్రవించకమానదు.

బాలికల మాటలు కూడా సరిగ్గా అర్థంకావడంలేదని, అంతగా మాదకద్రవ్యాలకు అలవాటు చేశారని ఓ ఆంగ్ల మీడియా ప్రతినిధి తెలిపారు. ఒక్కోసారి బాధలు భరించలేక బాలికలు కేకలు వేస్తే పక్క ఇళ్లల్లో ఉన్న వాళ్లు ఎవ్వరూ పట్టించుకోలేదట. ‘అతిథి గృహం నుంచి ఎప్పుడూ బాలికలు బయటికి వచ్చేవారు కాదు. ఒక్కోసారి అరుపులు వినిపించేవి కానీ అంతగా పట్టించుకోలేదు’ అని నసీమా రషీద్‌ అనే స్థానిక యువతి తెలిపారు. ఈ కేసులో ఎన్జీవో యజమాని బ్రిజేష్‌ కుమార్‌తో పాటు మరో తొమ్మిది మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related posts

Leave a Comment