‘తాతయ్య రా.. నన్ను కాపాడు..’

ఇంటిపెద్ద కాసేపటి క్రితమే పనిమీద బయటకెళ్లాడు. ఇంట్లో ఉన్న ఆమె తన ఇద్దరు మునిమనవళ్లు చేస్తున్న అల్లరి చూస్తూ మురిసిపోతోంది. ఇంతలో ఊహించని ప్రమాదం వారి సంతోషాలను ఆవిరిచేసింది. నిప్పులు కక్కుతున్న కార్చిచ్చు ఇంట్లోకి దూసుకొస్తుంటే.. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో బయటకెళ్లిన భర్తకు ఫోన్‌ చేసింది. ఆమె మాటలతో ప్రమాదాన్ని అర్థం చేసుకున్న ఆ భర్త పరుగుపరుగున ఇంటికి వచ్చాడు. కానీ అంతలోనే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. దావాగ్ని వారిని దహించివేసింది. మంటల్లో కాలిపోతున్న చిన్నారి.. ‘తాతయ్య రా.. నన్ను కాపాడు’ అని పిలుస్తుంటే ఈ ముసలి గుండె బద్దలైంది.

ఉత్తర కాలిఫోర్నియాలో రగులుతున్న కార్చిచ్చు కారణంగా లేక్‌పోర్ట్‌ పట్టణంలోని నాలుగిళ్లకు నిప్పంటుకుని మరో 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ఉండగా.. మరో ఆరుగులు పౌరులు ఉన్నారు. ఈ ప్రమాదంలోనే భార్య, ఇద్దరు మునిమనవళ్లను తన కళ్లముందే కోల్పోయాడు ఎడ్‌ బ్లెడ్‌సోయ్‌. ఆ విషాద ఘటనకు సంబంధించి ఆయన మాటల్లోనే..

‘గత ఆదివారం నేను పనిమీద బయటకు వెళ్లగా.. కాసేటికే ఇంటి నుంచి ఫోన్‌ వచ్చింది. అవతలివైపు నా భార్య మెలొడీ(70) భయంభయంగా మాట్లాడింది. ఏం జరిగిందని అడగ్గా.. ‘మంటలు సమీపిస్తున్నాయి.. త్వరగా రండి’ అని ఫోన్‌ పెట్టేసింది. దీంతో నేను కంగారుకంగారుగా ఇంటికి వెళ్లి చూస్తే కార్చిచ్చు ఇల్లంతా వ్యాపించింది. మంటల్లో చిక్కుకున్న నా ఐదేళ్ల మునిమనవడు జేమ్స్‌ రాబర్ట్స్‌ ‘తాతయ్య రా.. నన్ను బయటకు తీసుకెళ్లు’ అని లోపలి నుంచి పిలుస్తున్నాడు. కానీ మంటలు నన్ను లోపలికి వెళ్లనివ్వలేదు. వారు బయటకు రాలేదు’ అంటూ గద్గద స్వరంతో చెప్పారు బ్లెడ్‌సోయ్‌.

ఈ ప్రమాదంలో బ్లెడ్‌సోయ్‌ భార్య మెలొడి, ఆయన మునిమనవళ్లు జేమ్స్‌(5), ఎమిలీ(4) ప్రాణాలు కోల్పోయారు. వారం క్రితం ప్రారంభమైన ఈ కార్చిచ్చు ఇప్పటికే లక్ష ఎకరాల్లో వ్యాపించింది. దాదాపు 700లకు పైగా ఇళ్లు మంటల్లో దగ్ధమయ్యాయి. మరో 5వేల కట్టడాలకు కార్చిచ్చు ముప్పు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Related posts

Leave a Comment