తప్పదిక.. వాహనాలకు థర్డ్‌పార్టీ

ద్విచక్రవాహనానికైనా.. కోట్ల ఖరీదు చేసే కారుకైనా బీమా తప్పనిసరి… బీమా ఉంటే ధీమాగా ఉండొచ్చన్నది అందరి మాట… అయినా అరవైశాతం వాహనాలకు ఇప్పటికీ ఇన్సూరెన్స్‌ లేదు… ఈ దారి తప్పిన శకటాలతో ఏటా లక్షమంది అమాయకులు బలవుతున్నారు… వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి… ఈ దుస్థితిపై అత్యున్నత న్యాయస్థానం కన్నెర్రజేసింది… ద్విచక్రవాహనానికి ఐదేళ్లు.. కార్లకు మూడేళ్లు థర్డ్‌పార్టీ బీమా ఉండాల్సిందేనంది… ఈ సెప్టెంబర్‌ 1 నుంచే అమలు… దీంతో ఉపయోగాలేంటి¨? పరిమితులేంటి?

హైదరాబాద్‌లో ఈమధ్యే జరిగిందీ ప్రమాదం. వేగంగా వెళ్తూ అదుపు తప్పిన కారు రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టింది. తను అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి ఉద్యోగమే కుటుంబానికి ఆధారం. భారీ నష్టపరిహారం కోరుతూ కోర్టుకెళ్లారు సంబంధీకులు. కారు యజమానిది అంత పరిహారం చెల్లించలేని పరిస్థితి. ఇరుపక్షాలూ న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నారు. కారుకి థర్డ్‌పార్టీ బీమా ఉంటే ఈ ఇబ్బందే ఉండేది కాదు. చనిపోయిన మనిషిని తీసుకురాలేకపోయినా మృతుడి కుటుంబానికి పెద్దమొత్తంలో పరిహారం అందేది.

ఏంటీ థర్డ్‌ పార్టీ:
బీమా సంబంధిత విషయాల్లో వాహనదారును ఫస్ట్‌ పార్టీ అంటారు. బీమా సంస్థ సెకండ్‌ పార్టీ. వీరిద్దరికీ సంబంధంలేని వారే థర్డ్‌ పార్టీ. వాహనదారుడి కారణంగా ఏదైనా ప్రమాదం జరిగి వాహనానికి సంబంధం లేని వ్యక్తులు గాయపడ్డా, చనిపోయినా, ఇతరుల ఆస్తులకు నష్టం జరిగినా ఈ బీమా ద్వారా ఇన్సూరెన్స్‌ కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. సొంత వాహనానికి, వాహనంలోని వ్యక్తులు, వాహన యజమానులకు ఏం జరిగినా దీని ద్వారా పరిహారం అందదు. ఈ పరిహారం దక్కాలంటే కాంప్రెహెన్సివ్‌ పాలసీ తీసుకోవాల్సిందే. దీంతో మోటార్‌సైకిల్‌ వెనక కూర్చున్నవారికి, కారు వెనక సీట్లో కూర్చున్నవారికీ పరిహారం దక్కుతుంది. అసలు వాహనాలతో ఎలాంటి సంబంధంలేని వ్యక్తులు, ఆస్తులకు నష్టం జరిగితే పరిహారం అందడానికి ఉద్దేశించిందే థర్డ్‌పార్టీ బీమా.

ఎందుకీ దీర్ఘకాలిక బీమా:

వాహనదారులు చేసే తప్పిదాల కారణంగా జరిగే ప్రమాదాలతో ఏడాదికి దాదాపు లక్షమంది చనిపోతున్నారు. పాదచారులు, ఇతర వాహనాల్లో ఉన్నవారు, రోడ్డుపక్కన ఉండేవారు ఇలా. గాయపడుతున్నవారి సంఖ్య ఇంకా చాలా ఎక్కువే. ఇలాంటి అమాయకులు, మృతుల కుటుంబాలకు అండగా ఉండేందుకే దీర్ఘకాలిక థర్డ్‌పార్టీ బీమా తప్పనిసరని భావించింది కోర్టు. దీనికోసం ఏడు నెలల కిందట సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కేఎస్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలో ఒక కమిటీ వేసింది. ఈ బృందం జాతీయ రహదారులు ఉపరితల మంత్రిత్వశాఖ, ఆర్థికశాఖ, భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏ) అధికారులతో పలుదఫాలుగా చర్చించి, అధ్యయనం చేసి ఈ దీర్ఘకాలిక థర్డ్‌పార్టీ బీమా ఉండాలని తేల్చి చెప్పింది. సెప్టెంబరు 1 నుంచి దాన్ని అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఐఆర్‌డీఏని కోరింది. విధివిధానాలు, నిబంధనలతో కూడిన సర్క్యులర్‌ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

లాభాలేంటి..”:

* థర్డ్‌పార్టీ బీమా తప్పనిసరి చేయడం వల్ల ఇకనుంచి కొనుగోలు అయ్యే ప్రతి కొత్త వాహనం బీమా పరిధిలోకి వస్తుంది.
* మూడు, ఐదేళ్ల దీర్ఘకాలిక బీమాతో ప్రమాద సమయాల్లో వాహనదారులు నిశ్చింతగా ఉండొచ్చు. ఏడాదికోసారి చేసుకొనే పాలసీ పునరుద్ధరణ ప్రయాస తగ్గుతుంది.
* వాహనదారు కారణంగా ప్రమాదంలో ఎవరైనా చనిపోయినా, క్షతగాత్రులైనా, ఆస్తులకు నష్టం జరిగినా బీమా సంస్థ వాహనదారులకు న్యాయవివాదాల్లో అండగా ఉంటుంది.
* ప్రమాదంలో థర్డ్‌పార్టీకి గాయాలైనా వైద్య సంబంధిత బిల్లులు పొందొచ్చు. థర్డ్‌ పార్టీ ఆస్తులకు నష్టం జరిగితే బీమా సంస్థే నష్టపరిహారం చెల్లిస్తుంది.
* ఆస్తుల నష్టానికి పరిహారం విషయంలో పరిమితి ఉన్నా వ్యక్తులు చనిపోతే పరిమితి లేదు. చనిపోయిన వ్యక్తి ఆదాయం, వయసు, కుటుంబ స్థితిగతులు, ఆధారపడ్డ వ్యక్తులనుబట్టి కోట్లలో కూడా పరిహారం దక్కొచ్చు.
* కాంప్రెహెన్సివ్‌ పాలసీతో పోలిస్తే థర్డ్‌పార్టీ బీమా ప్రీమియం తక్కువ.
* థర్డ్‌ పార్టీ బీమా కొనడం, వివాదాల పరిష్కారం తేలిక. తక్కువ ధ్రువీకరణ పత్రాలు చాలు. వ్యాజ్యాలు సులువుగా పరిష్కారం అవుతాయి. ఆన్‌లైన్‌లో కూడా పాలసీలు కొనుక్కోవచ్చు.
* అన్నింటికన్నా ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే వాహనాల కారణంగా దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయే మృతుడి కుటుంబాలకు నష్టపరిహారంతో ఆర్థిక అండ దక్కుతుంది.

పెద్ద ఊరట:

విధివిధానాలు, నిబంధనలు ఎలా ఉంటాయనే విషయంలో ఐఆర్‌డీఏ నుంచి స్పష్టమైన సర్క్యులర్‌ వెలువడాల్సి ఉంది. దీర్ఘకాలిక థర్డ్‌పార్టీ బీమా వాహన ప్రమాద బాధితులకు పెద్ద ఊరటగా నిలిస్తే, వాహనదారులకు అనవసర చిక్కుల్లో భరోసా ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం దేశంలో సగానికిపైగా వాహనాలు బీమా లేకుండా తిరుగుతున్నాయి. ఈ పరిస్థితి తప్పించడానికే న్యాయస్థానం దీర్ఘకాలిక బీమా ప్రతిపాదించింది. దీన్ని అవకాశంగా తీసుకొని వాహన డీలర్లు తమ దగ్గరే బీమా చేయించుకోవాలని డిమాండ్‌ చేయొచ్చు. దీంతో కొనుగోలుదారులకు ఇది ఆర్థిక భారంగా మారే అవకాశం లేకపోలేదు. ఈ విషయంలో వాహనాలు కొనేవాళ్లకు బీమా ఎక్కడైనా చేయించుకునే వెసులుబాటు కల్పించాలి. నో క్లెయిం బోనస్‌ విషయంలో స్పష్టత రావాలి. ప్రస్తుతం థర్డ్‌ పార్టీ బీమాతో ఆస్తుల డ్యామేజీ విషయంలో ఏడున్నర లక్షల రూపాయాల వరకు నష్టపరిహారం పొందవచ్చు. మృతుల విషయంలో పరిమితి లేదు.

– సజ్జా ప్రవీణ్‌చౌదరి: వాహన బీమా పాలసీ విభాగం అధిపతి, పాలసీబజార్‌

కఠిన చట్టం కావాలి:

ప్రస్తుతం ఎక్కువమంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణాలతో వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అలాంటి సమయంలో తప్పనిసరిగా కాంప్రెహెన్సివ్‌ పాలసీ తీసుకోవాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశంతో థర్డ్‌పార్టీ బీమా కూడా చేయించాలి. అలాంటపుడు ఈ రెండూ కలిపి తీసుకోవాలా? విడివిడిగా తీసుకోవాలా? అనే దానిపై స్పష్టత లేదు. ఈ దీర్ఘకాలిక బీమాలో ఒకవేళ మొదటి నుంచి నాలుగు ఏడాదుల్లో ఏవైనా క్లెయిమ్‌లు చేసుకుంటే లోడింగ్‌ ప్రీమియం ఎంత ఉండాలో తెలియదు. ఈ సందేహాలన్నీ తీర్చేలా ఐఆర్‌డీఏ త్వరలోనే సర్క్యులర్‌ వెలువరిస్తుందని ఆటోమొబైల్‌, బీమా సంస్థ నిపుణులు ఆశిస్తున్నారు. ఏదేమైనా ఇది వాహన ప్రమాద బాధితులకు భరోసా ఇచ్చే మంచి విధానం. ప్రభుత్వం, కోర్టులు ఎంత చెప్పినా.. ఎన్ని నిబంధనలు విధించినా దాన్ని అతిక్రమించేవాళ్లూ ఉన్నారు. ఇలా నిబంధనలు అతిక్రమించేవాళ్లకు జరిమానా విధించడమేకాదు వాహనాలు జప్తు చేసేలా కఠిన చట్టం తేవాలి.

Related posts

Leave a Comment