తక్కువ కులం విద్యార్థిని ముట్టుకుందని.. మధ్యాహ్న భోజనాన్ని పారబోసిన వంట మనిషి!

ఆహారాన్ని ముట్టుకున్న 8వ తరగతి బాలిక
వండిన అన్నాన్ని పారబోసిన కుక్
సర్వత్ర ఆగ్రహావేశాలు
వంట మనిషిని తొలగించిన ప్రిన్సిపాల్
రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లాలో మరో అమానవీయ ఘటన జరిగింది. ఉతర్దలోని ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండిన వంట మనిషి.. మేఘ్‌వాల్ సామాజిక వర్గానికి చెందిన 8వ తరగతి బాలిక ముట్టుకుందన్న కోపంతో వండిన ఆహారాన్ని పారబోసింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవడంతో స్కూలు ప్రిన్సిపాల్ వంటమనిషిని తొలగించారు.

జరిగిన ఘటనపై వంట మనిషి క్షమాపణ చెప్పినప్పటికీ ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో ఆమెను తొలగించాలని నిర్ణయించుకున్నట్టు ప్రిన్సిపాల్ సుశీల్ ఆర్య తెలిపారు. వండిన ఆహారాన్ని ముట్టుకుందన్న కోపంతో ‌వంట మనిషి కమలా వైష్ణవ్ బాలికను దుర్బాషలాడింది. అంతేకాక, ఆహారాన్ని తీసుకెళ్లి పారబోసింది. దీంతో బాలిక ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన ప్రిన్సిపాల్ కమలా వైష్ణవ్‌ను తొలగించారు.

Related posts

Leave a Comment