తంతేగానీ మీకు బుద్ధి రాదయ్యా.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న బీజేపీ ఎమ్మెల్యేలు

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న బీజేపీ ఎమ్మెల్యేలు
దేశవ్యాప్తంగా విమర్శలతో మాట మార్చిన ఎమ్మెల్యే
వైరల్ అయిన వీడియో
తంతే గానీ పోలీసులకు బుద్ధి రాదని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ బాజ్‌పాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలహాబాద్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ బాజ్‌పాయిని ప్రవేశ ద్వారం వద్ద ఎస్పీ గంగపార్ సునీల్ సింగ్ అడ్డుకున్నారు.

ఎమ్మెల్యేను గుర్తుపట్టకపోవడమే ఇందుకు కారణం. దీంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే ఎస్పీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘తంతే కానీ మీకు బుద్ధి రాదు’ అని అర్థం వచ్చేలా తిట్ల పురాణం అందుకున్నారు. అందరూ చూస్తుండగానే పోలీసు అధికారిపై ఎమ్మెల్యే విరుచుకుపడడాన్ని చూసి, అందరూ విస్తుపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యేను లోపలికి పంపడంతో వివాదం అప్పటికి సద్దుమణిగింది. ఎస్పీపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో వైరల్ అయింది. ఎమ్మెల్యే తీరుపై దేశవ్యాప్తంగా, ముఖ్యంగా పోలీసుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో స్పందించిన హర్షవర్ధన్.. తాను అలా అనలేదని, సీనియర్ మంత్రులను గౌరవించని పోలీసు అధికారులను తీవ్రంగా పరిగణిస్తామని మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపనున్నట్టు అలహాబాద్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నితిన్ తివారీ తెలిపారు.

Related posts

Leave a Comment