డిసెంబరులో కోటప్పకొండలో హిల్ ఫెస్టివల్!

ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటన
మూడు రోజుల పాటు నిర్వహణ
కోటప్పకొండ రోప్ వే నవంబర్ నాటికి పూర్తి
అధికారులకు స్పీకర్‌ ఆదేశాలు
గుంటూరు జిల్లాలోని కోటప్పకొండలో ఈ ఏడాది డిసెంబర్ లో మూడు రోజుల పాటు హిల్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని, ఈ ఉత్సవాలు విజయవంతం అయ్యేలా కృషి చేయాలని సంబంధిత అధికారులను ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆదేశించారు. భారతీయ సంప్రదాయాలతో పాటు అడవుల పెంపకం వల్ల కలిగే లాభాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా హిల్ పెస్టివల్ నిర్వహిస్తామన్నారు.

కోటప్పకొండలో నిర్వహించే హిల్ ఫెస్టివల్ పై అసెంబ్లీలోని తన కార్యాలయంలో అటవీ, టూరిజం, దేవాదాయ ఉన్నతాధికారులతో ఈరోజు ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కోటప్పకొండ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. దీనివల్ల ఒకప్పుడు నిర్మానుష్యంగా ఉండే కోటప్పకొండ నేడు భక్తులు, సందర్శకులతో కిటకిటలాడుతోందన్నారు. కోటప్పకొండలో కొలువుదీరిన మేధా దక్షిణామూర్తి పాదాల చెంత ప్రతి సంవత్సరమూ వేల మంది విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయిస్తుంటారన్నారు.

ఈ నేపథ్యంలో హిల్ ఫెస్టివల్ కోటప్పకొండలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించదన్నారు. భారతీయ సంప్రదాయాల ప్రాధాన్యత, అడవుల అభివృద్ధి, చెట్లు, కొండల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ఉంటాయన్నారు. పెస్టివల్ లో తోలుబొమ్మలాట, నాటకాలు, డప్పు కళాకారుల నృత్యాలు, కోలాటం, చెక్కభజన తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.

వాటితో పాటు పల్నాడు సంప్రదాయాలు, పుణ్యక్షేత్రాలు, కొండల గొప్పతనం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో ఉమెన్ పార్లమెంట్ సదస్సు మాదిరిగా హిల్ ఫెస్టివల్ ను కూడా విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కోటప్పకొండలో నిర్మిస్తున్న రోప్ -వే పనులు నవంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో టూరిజం కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, టూరిజం డైరెక్టర్ హనుస్షు శుక్లా, అటవీశాఖ రిటైర్డ్ సీసీఎప్ సీసీఎఫ్
సూర్యనారాయణ, డీఎఫ్‌వో మోహన్, దేవాదాయ శాఖ డీఈ శ్రీనివాస్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment